బెజవాడ గొడవ : 260 మందిపై కేసులు.. నిందితుల్లో రౌడీషీటర్లు!
శాప్ కార్యాలయం ఎదుట తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, టీడీపీ నాయకులే గుండాలను తీసుకువచ్చి దాడి చేశారంటూ వైసీపీ ప్రత్యారోపణలు చేస్తోంది.
మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా వివాదం ముదురుతోంది. స్టోర్ట్స్ కోటా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ అంశమై సోమవారం విజయవాడలోని శాప్ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ధర్నా పేరుతో రౌడీలు, ఆకతాయిలు ఉపాధ్యాయులపై దాడి చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. శాప్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో అసాంఘిక శక్తులు పాల్గొన్నాయని అదేరోజు టీడీపీ సోషల్ మీడియా కొన్ని వీడియోలు వైరల్ చేసింది. ఇప్పుడు వాటికి బలం చేకూర్చేలా పోలీసులు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 260 మందిపై కేసులు నమోదు చేశారని చెబుతున్నారు. వీరిలో రౌడీషీటర్లు 45 మంది, ట్రబుల్ మాంగర్స్ 46 మంది. సస్పెక్ట్ షీటు ఉన్నవారు 16 మంది, అల్లర్లు సృష్టించేవారు 71 మంది, వివాదాల్లో పాల్గొనే అలవాటు ఉన్న వారు మరో 76 మంది ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక నిందితుల అరెస్టు కోసం ప్రత్యేక గాలింపు బృందాలను రంగంలోకి దించారు.
శాప్ కార్యాలయం ఎదుట తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, టీడీపీ నాయకులే గుండాలను తీసుకువచ్చి దాడి చేశారంటూ వైసీపీ ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో శాప్ కార్యాలయం ఎదుట జరిగిన గొడవ తీవ్ర రాజకీయ వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన వారిలో రౌడీలు, అల్లరి మూకలు ఉన్నాయని ఆరోపిస్తున్న ప్రభుత్వం, వారిని తీసుకువచ్చిన వైసీపీ నాయకులపైనా కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పరిస్థితిని మరింత వేడెక్కిస్తోందని చెబుతున్నారు.
మొత్తానికి ఇటు ప్రభుత్వం.. అటు వైసీపీ డీఎస్పీపై తగ్గేదేలే అన్నట్లు వ్యూహప్రతివ్యూహాలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మంత్రి లోకేశ్ రాజీనామా చేసే వరకు ఈ విషయంలో వెనక్కి తగ్గొద్దు అన్నట్లు వైసీపీ ముందుకు వెళుతోంది. అయితే డీఎస్సీ పేరుతో ప్రతిపక్షం యాగీ చేస్తోందన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అధికార పక్షం శాప్ కార్యాలయం ఎదుట చోటుచేసుకున్న పరిణామాలను అవకాశంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. ఉపాధ్యాయులపై దాడులు చేస్తారా? అంటూ ధర్నాలో పాల్గొన్న పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టులకు సిద్ధమవుతోంది. సాధారణంగా ధర్నాలు, ఆందోళనల చేసినప్పుడు నిరసనకారులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించడం పరిపాటి. అయితే ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడమే తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
ఇక ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడలో రెండు పోలీసుస్టేషన్లలో 260 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. నిందితులు అంతా గతంలో వివిధ కేసులను ఎదుర్కొంటుండటం వల్ల విపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందన అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ ఎత్తుగడపై వైసీపీ కూడా సీరియస్ గానే రియాక్ట్ అవుతోంది. తాము ధర్నా చేస్తామని ముందుగానే చెప్పామని, తమ ధర్నాకు అనుమతి ఇవ్వని పోలీసులు శాప్ కార్యాలయం వద్దకు టీచర్లను ఎలా అనుమతించారని ఎదురు ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా టీచర్ల ముసుగులో టీడీపీ కార్యకర్తలే తమ నేతలపై దాడులకు దిగారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తానికి డీఎస్సీ వివాదం శాప్ కార్యాలయం వద్ద గొడవతో పతాకస్థాయికి చేరిందని అంటున్నారు. ప్రస్తుతం కేసులు నమోదు చేసిన వారిలో 15 మందిని అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. మిగిలిన వారిని అరెస్టు చేస్తారా? కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.