544 పేజీల సోనియా ఆత్మకథతో దేశానికి ఒరిగేదేంటి ?
| సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం విమర్శలకు గురవుతోంది. 544 పేజీల పుస్తకంలో 55 వరకు చారిత్రక తప్పిదాలు ఉన్నాయని సమీక్షకులు ఆరోపిస్తున్నారు. బోఫోర్స్, యూపీఏ అవినీతి ఆరోపణలు వంటి కీలక అంశాలను ప్రస్తావించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తన జ్ఞాపకాల ఆధారంగానే పుస్తకం రాశానని సోనియా గాంధీ స్పష్టం చేశారు.
ఆత్మ కధలు అంటే అద్దంలో ముఖం చూపించేటంత స్పష్టంగా ఉండాలి. కానీ చాలా మంది రాసే ఆత్మ కధలలో ఆత్మ లోపిస్తోంది అన్న విమర్శలు ఉంటున్నాయి. నిజానికి ఇలాంటివి రాసేది కాలాన్ని పట్టి కొలవడానికే. అందులో అన్నీ అందుబాటులోకి రావు. చాలా వరకూ జారిపోతూంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా కాల విమర్శల పాలు అవుతాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత చరిత్రను ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. నవంబర్ 17న ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర విపక్ష నేతల సమక్షంలో అట్టహాసంగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. దాంతో పాటుగానే జాతీయ రాజకీయాలలో మీడియా వర్గాలలో ఇదిపుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. నిజానికి ఈ పుస్తకం విడుదలైన వారం రోజుల్లోనే రెండు లక్షల కాపీలు అమ్ముడయ్యాయని పబ్లిషర్లు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అసలు ఈ పుస్తకంలో ఉన్నదేంటి దీని వలన దేశ ప్రజలకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
వాస్తవాలు ఎంత వరకూ :
ఆత్మ కధలు అంటే సాధారణంగా అంతా చూసేది వాస్తవిక కోణాన్ని. ఎందుకంటే అదే కాలంలో జీవించి ఉన్న వారు పుస్తకంలో అంశాలను అప్పట్లో జరిగిన విషయాలను సరిపోల్చుకుని చూస్తారు. ఇపుడు సోనియా గాంధీ ఆత్మ కధ మీద కూడా రకరకాలైన విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు రాజకీయ విమర్శకులు దీనిని చరిత్రకు మసిపూసే ప్రయత్నంగా అభివర్ణిస్తుంటే మరోవైపు సీనియర్ జర్నలిస్టులు ఈ పుస్తకంలోని వాస్తవాలు లేవని, తప్పిదాలు దొర్లాయని, అనేక కీలక అంశాలను దాటవేసిన తీరు కనిపిస్తోందని ఎత్తిచూపుతున్నారు. సోనియా గాంధీ పుస్తకం‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ లోతుగా విశ్లేషిస్తే ఈ పుస్తకం దేశ ప్రగతి గమనానికి కానీ పరిపాలనా అనుభవాలకు సంబంధించిన గ్రంథం కాదని స్పష్టమవుతోంది. ఇటలీ నుండి భారత్‌కు వచ్చిన ఒక సాధారణ యువతి అప్పటి ప్రధాని కుమారుడు రాజీవ్ గాంధీతో ప్రేమలో పడి తరువాత కాలంలో దేశపు అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబంలో ఎలా ఒదిగిపోయిందనే వ్యక్తిగత భావోద్వేగాల సమాహారమే ఈ పుస్తకంగా చెబుతున్నారు. ఆ విధంగా చూస్తే ఈ పుస్తకాన్ని సోనియా గాంధీ జ్ఞాపకాల దొంతరగానే చూడాలని అంటున్న వారూ ఉన్నారు.
గాంధీల లోగిలిలోనే :
ఈ పుస్తకం చూస్తే 544 పేజీల సుదీర్ఘంగా ఉంది. అందులో అత్యధిక పేజీలు గాంధీల లోగిళ్ళలోనే తిరిగింది అని అంటున్నారు. అమెరికన్ బజార్ వంటి పత్రికల సమీక్షల ప్రకారం భారతదేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఆర్థిక సవాళ్లు, సామాన్యుల కష్టాల కంటే కూడా గాంధీ నెహ్రూ కుటుంబ అంతర్గత వ్యవహారాలు అలాగే వారి ఇంటి సంప్రదాయాలకే ఇందులో అగ్రతాంబూలం ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఒక రాజకీయ నాయకురాలి ఆత్మకథ నుండి ప్రజలు సాధారణంగా ఆశించే విధానపరమైన అంశాలు, అలాగే పరిపాలనా పాఠాలు ఇందులో మచ్చుకైనా కనిపించవని అంటున్నారు.
55 వాస్తవ తప్పిదాలు :
ఇక ఈ పుస్తకం మార్కెట్ లోకి రాగానే ఆసక్తిగా కొని చదివిన వారు పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే ! 544 పేజీలు 55 వాస్తవ తప్పిదాలు దొర్లాయని గట్టిగానే విమర్శిస్తున్నారు. ఈ పుస్తకం అత్యంత ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థ ద్వారా వెలువడింది. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినా దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత పేరుతో వచ్చిన పుస్తకంగా ఉంది. అలాంటి పుస్తకంలో కనీస ఎడిటింగ్ ప్రమాణాలు కూడా పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ది సౌత్ ఫస్ట్ వంటి వేదికలపై సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ తో పాటు పలువురు సమీక్షకులు ఇవే అంశాలను ప్రస్తావించారు. ఈ 544 పేజీల ఈ పుస్తకంలో సుమారు 55 వరకు చిన్న పెద్ద చారిత్రక వాస్తవ తప్పిదాలు దొర్లాయని వారు ఎత్తి చూపించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ 2020 నవంబర్‌లో మరణించగా పుస్తకంలో 2022లో మరణించినట్లు రాశారు. ఆరెస్సెస్ అనే సంస్థ 1925లో స్థాపించబడగా 1921లో స్థాపించబడినట్లు ఈ పుస్తకంలో పేర్కొన్నారు. 1970 నుండే గాంధీనగర్ గుజరాత్ రాజధానిగా ఉన్నప్పటికీ 2002 నాటి ఘటనలను వివరిస్తూ అహ్మదాబాద్‌ను గుజరాత్ రాజధానిగా రాయడం అత్యంత చారిత్రాత్మక తప్పిదంగానే చూస్తున్నారు.
రాజ్యాంగ అంశాల్లోనూ గందరగోళం :
అంతే కాదు, ఈ పుస్తకంలో మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ పేరును ప్రముఖ రచయిత పేరుతో కలిపి ఏకంగా ప్రెసిడెంట్ ఆర్.కె నారాయణ్ రాయడాన్ని ముద్రా రాక్షసంగా వదిలేయాలా లేక పెద్ద పొరపాటుగానే చూడాలా అని ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభ సభ్యులంతా నామినేట్ అవుతారని పేర్కొనడం వంటివి ఇందులో పేర్కొనడం చూస్తే రాజ్యాంగపరమైన అంశాల మీద అవగాహన లోపం ఉందా అని అంటున్నారు. ఇక సోనియా గాంధీ తన జీవితంలోని పూర్తి వాస్తవాలను కలబోసి పుస్తకంగా తెచ్చారని పెద్ద ఎత్తున చెప్పుకున్నప్పటికీ అత్యంత కీలకమైనవి, అలాగే ఆనాటి కాలంలో చోటు చేసుకున్న ఎన్నో వివాదాస్పద అంశాలను మాత్రం చాలా తెలివిగా దాటవేశారనే ఆరోపణలు సైతం ఈ పుస్తకం మీద ఉన్నాయి.
కుభకోణాల ప్రస్తావన ఏదీ :
ఈ పుస్తకం రాసినప్పటి కాలంలో జరిగిన అనేక కుంభకోణాల ప్రస్తావన ఇందులో ఏదీ అని ప్రశ్నించే వారూ ఉన్నారు. బీబీసీ జర్నలిస్ట్ సౌతిక్ బిశ్వాస్ తన విశ్లేషణలో పేర్కొన్నట్లుగా యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో దేశాన్ని కుదిపేసిన అవినీతి ఆరోపణలు కానీ ఆశ్రిత పక్షపాతం వంటి అంశాల గురించి పుస్తకంలో ఎక్కడా ప్రస్తావించలేదని అంటున్నారు. అలాగే రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని కూల్చిన బోఫోర్స్ కుంభకోణం 1980 దశకం మధ్యలో జరిగిందని అంటారు. ఇక ఇటలీ వ్యాపారి ఒట్టావియో క్వాట్రోచితో కుటుంబ సంబంధాలు కానీ ఒకప్పుడు ప్రాణస్నేహితులుగా ఉన్న బచ్చన్ కుటుంబంతో విభేదాలు కానీ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చేసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వంటి చారిత్రక ఘట్టాలను కానీ ఈ పుస్తకంలో మలో పూర్తిగా విస్మరించారని అంటున్నారు. మరో వైపు ఈ పుస్తకంలో బీజేపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చోటు చేసుకోవడం విశేషం. అందుకే ఈ పుస్తకానికి ‘బిలాంగింగ్’కు బదులు ‘వైట్‌వాషింగ్’ అంటే తప్పులను కప్పిపుచ్చుకోవడం అని పేరు పెట్టి ఉంటే సరిపోయేదని బీజేపీ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్ ఎద్దేవా చేశారు. 1975 ఎమర్జెన్సీ లాంటి ప్రజాస్వామ్య చీకటి రోజులను ఒక చిన్న పొరపాటుగా చిత్రీకరిస్తూ ఇందిరా గాంధీని మనసులో ప్రజాస్వామ్యవాదిగా సమర్థించుకునే ప్రయత్నం సోనియ్గా గాంధీ చేశారని బీజేపీ చాలా గట్టిగానే ఆరోపిస్తోంది.
నిజంగా త్యాగమేనా :
ప్రధాని పదవిని సోనియా గాంధీ త్యాగం చేశారు అని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెబుతూంటారు. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు తాను ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించానో మొదట "ఠీక్ హై" అని ఆ తర్వాత ఎందుకు వెనక్కి తగ్గారో ఈ పుస్తకంలో సోనియ్గాంధీ వివరించారు. అయితే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న పదేళ్ల కాలంలో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా తెరవెనుక అధికారం చెలాయించింది ఎవరో దేశ ప్రజలకు తెలియనిది కాదన్న విమర్శలకు సమాధానం ఈ పుస్తకంలో ఎక్కడా లేదని ఎత్తి చూపుతున్నారు. ఇక పదవీ త్యాగం అంటూ గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ గట్టిగా వల్లించిన నినాదాన్ని ఇప్పుడు మళ్లీ కొత్త పుస్తకంలో అక్షరబద్ధం చేయడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి సానుభూతి కూడగట్టడానికి అదే సమయంలో తన ఇమేజ్‌ను మెరుగుపరుచుకోవడానికి ఈ పుస్తకాన్ని ఒక సాధనంగా గాంధీలు వాడుకుంటున్నారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి.
జస్ట్ జ్ఞాపకాలేనా :
ఇక ఈ పుస్తకంలో తప్పులు ఉన్నాయన్నది ఒక కోణంలో విమర్శలు అయితే దీనిని సోనియా గాంధీ జ్ఞాపకాల దొంతరగా భావించి అక్కడికే పరిమితం చేయడం సముచితం అన్న మాట కూడా రెండో కోణంలో వినిపిస్తోంది. ది ప్రింట్ సీనియర్ జర్నలిస్ట్ వీర్ సంఘ్వీ అభిప్రాయం ప్రకారం చూస్తే ఇది ప్రభుత్వ విధానాల పుస్తకం కాదని ఒక్క ముక్కలో తేల్చేశారు. ఒక విదేశీ మహిళ భారతదేశపు అత్యంత శక్తివంతమైన కుటుంబంలో ఒదిగిపోయిన తీరును వివరించే వ్యక్తిగత జ్ఞాపకాల సమాహారం మాత్రమే అని కూడా స్పష్టం చేశారు. ఇక తన పుస్తకం గురించి సోనియ్గా గాంధీ మాట్లాడుతూ తన జ్ఞాపకాల ఆధారంగానే రాశాను అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో దశాబ్దాలుగా తమ కుటుంబంపై రాజకీయ ప్రత్యర్థులు అవాస్తవాలు కల్పిత కథనాలు ప్రచారం చేస్తున్నాయని తన జీవితంలోని వాస్తవ కోణాన్ని ప్రజల ముందు ఉంచడానికే ఈ పుస్తకం రాశానని తాజాగా ఆవిష్కరణ సభలో సోనియా గాంధీ స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ డైరీ రాసుకోలేదని కేవలం జ్ఞాపకాల ఆధారంగానే దీనిని రాశానని చెప్పడం ద్వారా కొన్ని తేదీల తప్పులు జరిగి ఉండవచ్చనే సంకేతమిచ్చినట్లుగానే చెప్పుకొచ్చారు అని అంటున్నారు.