వైసీపీకి కొత్త రూపు...ముహూర్తం అపుడేనా ?
వైసీపీ అంటే ఠక్కున చాలా మంది నాయకుల పేర్లు కళ్ళ ముందు మెదులుతాయి. వైసీపీలో కాంగ్రెస్ ఉంది.
వైసీపీ అంటే ఠక్కున చాలా మంది నాయకుల పేర్లు కళ్ళ ముందు మెదులుతాయి. వైసీపీలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు అనేక మంది ఆ పార్టీలో ఉన్నారు. వారితోనే వైసీపీ రాజకీయ ప్రస్థానం సాగుతూ వస్తోంది. అయితే వరుసగా మూడు ఎన్నికలను చూసి ఒకసారి అధికారంలోకి వచ్చిన వైసీపీకి 2029 ఎన్నికలు చాలా కీలకం అని ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. అదే సమయంలో వైసీపీకి కొత్త నాయకత్వం అవసరం అని అధినాయకత్వం అభిప్రాయపడుతోంది అంటున్నారు. టీడీపీ అయితే ఇప్పటికే చాలా చోట్ల సీనియర్ల స్థానంలో చాలా స్మూత్ గా కొత్త నాయకులను యంగ్ బ్లడ్ ని తెచ్చి పెడుతోంది. 2029 ఎన్నికల నాటికి చూస్తే టీడీపీ పూర్తిగా యువ బృందంతో రంగంలోకి దిగుతుంది అని అంటున్నారు. అదే వైసీపీలో చూస్తే సీనియర్ నేతలే అత్యధిక శాతం కనిపిస్తున్నారు అని ఒక మాట ఉంది.
యువతరానికి స్వాగతం :
వైసీపీలో యువ తరానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. అదే సమయంలో సీనియర్ల అనుభవాలను వాడుకోవాలని ఈ రెండూ మేళయించి మంచి కో ఆర్డినేషన్ తో ముందుకు సాగాలని చూస్తోంది అంటున్నారు. ఉద్యమాలు చేయాలంటే యూత్ లీడర్లే ముందుకు వస్తారని వారితోనే పార్టీకి ఊపూ ఉత్సాహం వస్తాయని కూడా భావిస్తున్నారు. అదే విధంగా జెన్ జీ ప్రభావం కూడా వైసీపీ అధినాయకత్వంలో సరికొత్త ప్రయోగాలు చేసేలా చేస్తోంది అంటున్నారు. తరచూ జగన్ నోట జెన్ జీ అన్న మాట రావడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దాంతో పార్టీలో కూడా యువతకు పట్టం కడితే ఆటోమేటిక్ గా జెన్ జీని ఎట్రాక్ట్ చేయగలని తలపొస్తున్నారు అని చెబుతున్నారు.
అక్కడతో మొదలు :
తాజాగా చూస్తే వైసీపీలో ఒక నియామకం అందరినీ ఆలోచింపచేస్తోంది. నెల్లిమర్ల వంటి కీలక స్థానంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుని తప్పించి మూడున్నర పదుల వయసు కలిగిన యువ నేత సన్యాసినాయుడుకు చాన్స్ ఇచ్చారు. దాంతో అంతా దీని మీద విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారు అని అంటున్నారు. ఈ విధంగా నాలుగు పదుల లోపు యువతకు పెద్ద పీట వేయాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. వైసీపీని చాలా మంది నేతలు వీడారు. ఆయా చోట్ల కొత్త వారికి చాన్స్ అంటే ముందుగా యూత్ కే ప్రయారిటీ ఇస్తున్నారు అని అంటున్నారు. వైసీపీలో సగటు నాయకుల ఏజ్ 50 లోపు ఉండేలా చూసుకోవాలన్న భావన కూడా వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా ఈ తరహా నాయకత్వం ఇప్పటికే కొందరిని తయారు చేసి ఉంచారని ముందు ముందు మరింతగా వీరి సంఖ్యను పెంచుతారు అని అంటున్నారు.
లోకల్ ఫైట్ తరువాతనే :
జగన్ పదే పదే స్థానిక సంస్థల ఎన్నికల గురించి పార్టీ నాయకులకు చెబుతున్నారు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని కూడా హెచ్చరిస్తూ వస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఏకపక్షాలు ఏకగ్రీవాలు కూటమి వైపు నుంచి ఉండకూడదని ఆయన అంటున్నారు. అలా జరిగితే ఇంచార్జి పదవికే ముప్పు అని చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్ట్కి ఏకగ్రీవాలు అనేక చోట్ల జరుగుతాయని అంటున్నారు. దాంతో వాటి ఫలితాలను చూసిన తరువాత వైసీపీలో ప్రక్షాళనకు జగన్ సిద్ధపడతారు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే ముహూర్తం అయితే ఫిక్స్ అయినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.