కార్‌లోనే జిమ్.. మీ ఇంటి వద్దనే వ్యాయామాలు.. ఐడియా ఎలా ఉంది?
బెంగళూరుకు చెందిన ఇద్దరు యువ ఫిట్‌నెస్ నిపుణులు రిత్విక్ రాధాకృష్ణన్ (26), భూమిక జయన్న (25) ఒక సరికొత్త ఆలోచనతో జిమ్ సంస్కృతికే వినూత్న రూపం ఇచ్చారు.
బెంగళూరుకు చెందిన ఇద్దరు యువ ఫిట్‌నెస్ నిపుణులు రిత్విక్ రాధాకృష్ణన్ (26), భూమిక జయన్న (25) ఒక సరికొత్త ఆలోచనతో జిమ్ సంస్కృతికే వినూత్న రూపం ఇచ్చారు. వ్యాయామం చేయాలనుకునేవారి కోసం జిమ్ వెళ్లాల్సిన పని లేకుండా.. నేరుగా వారి అపార్ట్‌మెంట్ ఆవరణకే జిమ్‌ను తీసుకువచ్చే వినూత్న భావనకు తెరలేపారు. దీనికోసం వారు ఒక సెకండ్ హ్యాండ్ మారుతి ఈకో వ్యాన్‌ను కొనుగోలు చేసి, దానిలోని సీట్లన్నీ తొలగించి, పూర్తిగా బరువులు, వ్యాయామ పరికరాలతో నింపేశారు.
`అన్‌లీష్ 45` పేరుతో ఈ మొబైల్ జిమ్ వెంచర్‌ను ప్రారంభించారు. ఈ వ్యాన్‌లో డంబెల్స్, కెటిల్‌బెల్స్, స్లామ్ బాల్స్, మెడిసిన్ బాల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్స్, బాటిల్ రోప్స్ వంటి రక రకాల ఫిట్‌నెస్ పరికరాలను అమర్చుకున్నారు. అపార్ట్‌మెంట్ సొసైటీలలో బయటి ట్రెయినర్లను జిమ్ పరికరాలు ఉపయోగించుకోనివ్వని సమస్య ఎదురైనప్పుడు, ఈ ఆలోచన వారికి వచ్చింది. దీంతో సొంతంగా పరికరాలను మోసుకెళ్లేలా ఈ మొబైల్ వ్యాన్ ఐడియాను అమలులోకి తెచ్చారు.
ఈ మొబైల్ జిమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం యువతకే కాకుండా వృద్ధులకు సైతం ఎంతో సులభంగా అందుబాటులో ఉంటోంది. అపార్ట్‌మెంట్‌లోని క్లబ్‌హౌస్‌లు లేదా కామన్ స్పేస్‌లలో వీరు 45 నిమిషాల పాటు గ్రూప్ వర్క్‌అవుట్ సెషన్లను నిర్వహిస్తారు. ఇందులో ఎలాంటి భారీ యంత్రాలు ఉండవు. కేవలం బాడీ వెయిట్ .. చిన్న పరికరాలతో కూడిన హోల్-బాడీ స్ట్రెంగ్త్ వ్యాయామాలు ఉంటాయి. ఎవరి శారీరక నొప్పులు లేదా సామర్థ్యానికి తగినట్లుగా వారికి వ్యాయామాలను ట్రెయినర్లు మారుస్తుంటారు.
ప్రారంభంలో కేవలం ఐదు మందితో ఒక అపార్ట్‌మెంట్‌లో మొదలైన ఈ ప్రయోగం ప్రస్తుతం బెంగళూరు వ్యాప్తంగా అనేక అపార్ట్‌మెంట్లకు విస్తరించింది. 60, 70 ఏళ్ల వయసువారు కూడా మొదటిసారిగా బరువైన వ్యాయామాలు చేసేలా ఈ బృందం ప్రోత్సహిస్తోంది. బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జిమ్‌కు వెళ్లలేకపోయే వారికి, ఫిట్‌నెస్‌ను సులభంగా సామాన్యుల చెంతకు చేర్చిన ఈ మొబైల్ జిమ్ కాన్సెప్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో.. స్థానికంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.