జగన్ మార్క్ లిట్మస్ టెస్ట్ ...పాజిటివిటీ కోసమేనా ?
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సరి కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు. అది గతానికి భిన్నమైనది.
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సరి కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు. అది గతానికి భిన్నమైనది. జగన్ ఎక్కడికీ కదలడం లేదు, తాడేపల్లికి ఇలా వచ్చి అలా బెంగళూరుకు వెళ్ళిపోతున్నారు అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ అయితే తాను అనుకున్నదే చేసుకుంటూ పోతున్నారు. ఆయన ఏపీలో కొన్ని ఎంచుకున్న ప్రాంతాలలో లిట్మస్ టెస్ట్ పెట్టుకుని మరీ తన పర్యటనలు చేస్తున్నారు. ప్రజా సమస్యలు రైతుల ఆందోళనలు అన్న పేరు మీద జగన్ చేస్తున్న ఈ టూర్లు సొంత పార్టీ వారికి భరొసా కల్పించడంతో పాటు కూటమికి తన బలాన్ని తెలియచేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. అదే విధంగా జనంలో కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ వైసీపీ మీద బిల్డప్ చేయడం కూడా వ్యూహంలో భాగం అని అంటున్నారు.
కీలక జిల్లాలలోనే :
వైసీపీకి ఈ రోజుకీ హార్డ్ కోర్ రీజియన్ అంటే నాలుగు జిల్లాల రాయలసీమను అంతా చెబుతారు. 2024 లో వైసీపీ ఓటమికి సవాలక్ష కారణాలతో పాటు సొంత కుటుంబంలో వచ్చిన చీలిక ప్రధాన కారణం అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఆ పరిస్థితి 2029 లో ఉండదని వైసీపీ గట్టిగా విశ్వసిస్తోంది. ఈ రోజుకీ వైసీపీకి అక్కడ బలమైన సామాజిక వర్గం దన్ను అలాగే గట్టి నాయకుల అండ ఉంది. దాంతో వైసీపీ రాయలసీమలో బ్యాక్ బౌన్స్ అవుతోంది అని అంటున్నారు. ఇక మిగిలిన మూడు రీజియన్స్ లో వైసీపీకి ఉత్తరాంధ్రా కూడా ఎంతో కొంత కలసి వచ్చే రీజియన్ అని అంటున్నారు. ఇక్కడ విశాఖ అర్బన్ ని తప్పిస్తే విశాఖ రూరల్ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో వైసీపీకి మంచి పట్టు ఉంది. 2024లో యాంటీ ఇంకెంబెన్సీ వల్ల ఓటమి చెందినా వచ్చే సారి గెలుస్తామని వైసీపీ ఇక్కడ నమ్మకం వ్యక్తం చేస్తోంది.
కొరుకుడు పడని చోట :
ఈ క్రమంలో వైసీపీ ఆలోచనలు అన్నీ కూడా దక్షిణ కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల మీద ఉన్నాయని అంటున్నారు. దక్షిణ కోస్తా జిల్లాలలో కృష్ణా గుంటూరు రెండూ టీడీపీకి కంచు కోటలు. ఇపుడు జనసేన కూడా జత కావడంతో మరింత బలంగా టీడీపీ కూటమి ఉంది. నెల్లూరు వైసీపీకి కంచుకోట అయినా ఇపుడు అక్కడ కూటమి పట్టు పెంచుకుంది. ప్రకాశంలో సగం సగం బలం కాస్తా ఇపుడు కూటమికి మూడు వంతులకు పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాలలో చూసుకుంటే టీడీపీకి సహజంగానే బలం ఉంది, జనసేన కూడా గట్టిగానే ఉంది. ఇక్కడ మొదటి నుంచి వైసీపీకి తక్కువ మద్దతు దక్కుతూ వస్తోంది. ఈ క్రమంలో జగన్ ఎక్కువగా కోస్తా గోదావరి జిల్లాల మీదనే ఫోకస్ పెట్టారు అని అంటున్నారు.
సరికొత్త స్ట్రాటజీ అని :
నిన్న ఆక్వా రైతుల పరామర్శ పేరుతో పశ్చిమ గోదావరి భీమవరంలో టూర్ చేసినా నేడు పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించినా కూడా లిట్మస్ టెస్ట్ కూడా అందులో భాగమని అంటున్నారు. తమ పార్టీకి ఈ ప్రాంతాలలో బలం పెరిగింది అని చూపించడమే కాకుండా కూటమి వీక్ అవుతోందని చాటి చెప్పడం ఈ సరికొత్త స్ట్రాటజీ అని అంటున్నారు. అలాగే ఏపీలో రాజకీయ గాలి మారుతోంది అన్నది అటు జనాలకు ఇటు సొంత పార్టీ జనాలకు తెలియచెప్పడం ద్వారా పార్టీని దూకుడు పెట్టించాలన్నదే వైసీపీ అధినేత ఆలోచన. మరి జగన్ వస్తే జనం ఎపుడూ వస్తారు, 2024లో ఇంతకంటే కూడా వచ్చారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. వచ్చిన జనాలతోనే గెలుపు సాధ్యమా నిజంగా జనంలో మార్పు ఉందా అన్నది అయితే ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు, అయితే వైసీపీకి మాత్రం దీని వల్ల తక్షణ రాజకీయ లాభం ఏంటి అంటే తమ పార్టీలో చురుకు పుడుతుంది, పార్టీలో నేతలు అంతా ఆశావహంగా ఉంటారు.