'స్థానికం' నిజంగానే సమరమే.. ఏం జరుగుతుంది..?
మరో రెండు మాసాల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది.
మరో రెండు మాసాల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. అయితే.. ఈ ఎన్నికలు సాధారణంగా ఎప్పుడూ క్షేత్రస్థాయి రాజకీయాలపైనే ఆధారపడి ఉంటాయి. కానీ, వైసీపీ హయాంలో 2021లో జరిగిన ఎన్నికలు .. స్థానిక ముఖ చిత్రాన్ని మార్చేశాయి. తొలిసారిగా మంత్రులకు, ఎంపీలకు కూడా జగన్ టార్గెట్లు విధించారు. ఎక్కడా ఎన్నికలు జరగకూడదని.. అన్నీ ఏకగ్రీవాలే జరగాలని తేల్చి చెప్పారు దీంతో వైసీపీ నేతలువిజృంభించారు. ఫలితంగా టీడీపీపోరు నుంచి తప్పుకొంది.
కట్ చేస్తే..
ఇప్పుడు మరోసారిస్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో నే మునిసిపాలిటీ, తర్వాత కార్పొరేషన్.. అనంతరం.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిలోనే బీసీలకు రిజర్వేషన్ కూడా కల్పించనున్నారు. ఇప్పటికే కమిషన్ నివేదిక కూడా రెడీ అయింది. దీనిపై నిర్ణయం తీసుకుని.. గవర్నర్ అనుమతితో రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాలు.. కూటమికి మేలు చేస్తాయన్న అంచనా ఉంది.
దీని కి తోడు టీడీపీ కూడా.. ఏకగ్రీవాలకు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా మంత్రి లోకేష్.. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో తాము పుంజుకోలేక పోయామని చెబుతున్న ఆయన.. ఇప్పుడు మంత్రులతో నేరుగా భేటీ అవుతున్నారు. కేవలం 24 గంటల్లో మూడు సార్లు మంత్రులతో స్థానిక ఎన్నికలపై చర్చించడం గమనార్హం. అంతేకాదు.. వారికి దిశానిర్దేశం కూడా చేశారు. ఎక్కడా ఏకగ్రీవాలకు భిన్నంగా జరగడానికి లేదన్నారు.
ఇదే .. ఇప్పుడు స్థానిక సమరాన్ని.. సమరంగా మార్చుతోంది. ఒకవైపు.. 2024లో దెబ్బతిన్నవైసీపీ ప్రస్తుత స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడు తమ ప్రభావం చూపించకపోతే.. భవిష్యత్తులో మరింత ఇబ్బంది అవుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో ఏకగ్రీవాలకు తావులేకుండా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. అంటే.. అటు ఏకగ్రీవాలకు.. టీడీపీ, కాదని వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి మించి.. ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.