వలసల నియంత్రణ: అమెరికాది ప్రలోభమా? హెచ్చరికా?
అనధికార వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్తే 2,600 డాలర్ల నగదుతో పాటు ఉచిత విమాన టికెట్ ఇస్తామన్న ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.;
అమెరికా ఇమ్మిగ్రేషన్ చరిత్రలో ఒక వింతైన పరిణామం చోటుచేసుకుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఇన్నాళ్లూ కఠినంగా శిక్షించడం, జైళ్లలో బంధించడం లేదా బలవంతంగా వెనక్కి పంపడం చూశాం. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం 'చేతులు జోడించి.. పైసలిచ్చి' మరీ పంపించే వ్యూహానికి తెరలేపింది. అనధికార వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్తే 2,600 డాలర్ల నగదుతో పాటు ఉచిత విమాన టికెట్ ఇస్తామన్న ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఒత్తిడిలో అగ్రరాజ్యం
అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉదారవాదం కంటే ఆచరణాత్మక ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా సరిహద్దుల్లోనూ దేశంలోని నిర్బంధ కేంద్రాల్లోనూ వలసదారుల సంఖ్య మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. వీరిని పర్యవేక్షించడం..వారికి ఆహార, వైద్య సదుపాయాలు కల్పించడం.. సుదీర్ఘమైన న్యాయపరమైన ప్రక్రియను నిర్వహించడం అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారింది. ఈ ఖర్చుతో పోలిస్తే ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి పంపడమే 'చౌకైన మార్గం' అని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
ఈ పథకం ఒక రకమైన 'క్యారెట్ అండ్ స్టిక్' వ్యూహం. ఒకవైపు నగదు సహాయం అనే 'క్యారెట్'ను చూపిస్తూనే మరోవైపు 'సిబిపి హోమ్' యాప్ ద్వారా నమోదు చేసుకోకపోతే కఠిన చర్యలు తప్పవనే హెచ్చరికను కూడా అధికారులు ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛందంగా వెళ్లేవారికి భవిష్యత్తులో చట్టబద్ధంగా అమెరికా వచ్చే తలుపులు తెరిచి ఉంచుతామని చెబుతూనే పట్టుబడితే మాత్రం శాశ్వత నిషేధం విధిస్తామనే హెచ్చరిక ఇందులో దాగి ఉంది.
ఇది పరిష్కారమేనా?
అయితే ఈ పథకం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందనేది ప్రశ్నార్థకమే. గర్భదారిద్య్రం నుంచి తప్పించుకోవడానికి ప్రాణాలకు తెగించి అమెరికా చేరుకున్న వలసదారులకు ఈ 2,600 డాలర్లు వారి కష్టాలకు సరిపోతాయా? ఈ నగదు ఆశతో కొత్త వలసదారులు సరిహద్దుల వైపు వచ్చే ప్రమాదం ఉందా? రాబోయే ఎన్నికల నేపథ్యంలో వలసల సమస్యను పరిష్కరించామనే ముద్ర వేయించుకోవడానికే ప్రభుత్వం ఈ 'షార్ట్ కట్' మార్గాన్ని ఎంచుకుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి..
కేవలం డబ్బు ఇచ్చి వలసదారులను పంపించేయడం తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతుంది. వలసలకు మూలకారణమైన పేదరికం, ఆయా దేశాల్లోని అశాంతిని పరిష్కరించకుండా కేవలం 'ఎగ్జిట్ బోనస్' ప్రకటించడం వల్ల వ్యవస్థాగత మార్పు రాదు. ఏదేమైనా ఒక దేశం తన గడ్డపై ఉన్న అక్రమ నివాసితులను వెనక్కి వెళ్ళమని బతిమాలుకుంటూ డబ్బు ఆఫర్ చేయడం అనేది ప్రస్తుత ప్రపంచ వలస సంక్షోభ తీవ్రతకు నిదర్శనం.