ఏపీ జాబ్ క్యాలెండర్ 2026లో ఏముంది?.. నోటిఫికేషన్ల తేదీలు, ఖాళీల వివరాలు ఇవే..
ఈ ఏడాది మొత్తం 10,060 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో తెలిపింది.;
కూటమి ప్రభుత్వం ప్రకటించినట్లే ఉగాది పండుగ పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. తన ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. టీడీపీ యువనేత, ఐటీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చారు. దీనిప్రకారం ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నామని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లో ప్రకటించారు. ఉద్యోగాల భర్తీలో జాప్యం నివారించడంతోపాటు గ్యారెంటీగా నోటిఫికేషన్ ప్రకటించే బాధ్యత వహించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చినట్లైందని అంటున్నారు.
ఈ ఏడాది మొత్తం 10,060 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో తెలిపింది. ‘‘ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.’’ అంటూ మంత్రి నారా లోకేశ్ తన ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు. ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్యాలెండర్ ద్వారా ఎప్పుడు? ఏ శాఖ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నారనేది స్పష్టంగా తెలియజేశారు.
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని, నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. అదేవిధంగా పోటీ పరీక్షలకు సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని ఎప్పటికప్పుడు అలర్ట్స్ ద్వారా జాబ్ నోటిఫికేషన్ సమాచారం పొందవచ్చునని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
‘‘ఇక ప్రతి ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు’’ అంటూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తన ఉగాది వేడుకల్లో జాబ్ క్యాలెండర్ పై స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని యువతకు హామీ ఇచ్చింది.. ఉద్యోగాల కల్పన కోసం తాము సంకల్పించాం.. 10,060 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ జారీ చేశాం’’ అంటూ సీఎం ప్రకటించారు.
గత ఏడాది 15,940 మంది టీచర్లకు మెగాడీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని, 5757 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తి చేశామని వివరించారు. అదేవిధంగా 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, 6.28 లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. గత ఎన్నికల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని, ఆ హామీ నెరవేరుస్తామని సీఎం స్పష్టం చేశారు. మే 15 నుంచి అక్టోబరు 15 వరకూ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చంద్రబాబు తెలిపారు.