డాలస్ పురం : అమెరికాలో తెలుగు హబ్.. వైరల్ వీడియో

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.;

Update: 2026-01-26 09:41 GMT

సముద్రాలు దాటినా.. ఖండంతరాలు దాటినా తెలుగువాడి ఆత్మవిశ్వాసం.. ఆత్మీయత ఎక్కడికీ పోవు. దానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న డాలస్ నగరం. ప్రస్తుతం ఈ నగరం తెలుగువారికి కేవలం ఒక నివాస ప్రాంతం మాత్రమే కాదు.. అది అమెరికాలో వెలుగొందుతున్న ఒక ‘మినీ తెలుగు రాష్ట్రం’. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

వైరల్ వీడియోలో అసలేముంది?

డాలస్‌లోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో చిత్రీకరించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆ హోటల్‌లోకి అడుగుపెడితే మనం అమెరికాలో ఉన్నామా లేక హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోనో.. విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లోనో ఉన్నామా అనే అనుమానం కలగక మానదు. రెస్టారెంట్ నిండా తెలుగువారే కనిపిస్తున్నారు.. ఎటు చూసినా గలగలా సాగే తెలుగు మాటలే వినిపిస్తున్నాయి. ఇంగ్లీష్ మాటలు ఎక్కడో ఒకచోట అరుదుగా వినిపించడం విశేషం. వీడియో తీస్తున్న వ్యక్తి సరదాగా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు చర్చకు దారితీసింది. "ఇక్కడ ఇంగ్లీష్ వినిపించడమే లేదు.. మన వాళ్ల జోరు చూస్తుంటే అమెరికన్లే వారి దేశంలో తాము పరాయి వాళ్ళమా అని అనుకునేలా ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

ఎందుకీ మార్పు? డాలస్ ‘డాలస్‌పురం’గా ఎలా మారింది?

గత దశాబ్ద కాలంలో డాలస్ పరిసర ప్రాంతాలైన ఫ్రిస్కో, ప్లేనో, ఇర్వింగ్ వంటి చోట్ల తెలుగు జనాభా ఊహించని రీతిలో పెరిగింది. దీనికి ప్రధాన కారణాలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఇక్కడ కొలువుదీరడం వల్ల తెలుగు ఇంజనీర్లకు ఇది స్వర్గధామంగా మారింది. కేవలం ఉద్యోగాలే కాకుండా హోటల్ రంగం, రియల్ ఎస్టేట్, కిరాణా స్టోర్లలో తెలుగువారు అగ్రగామిగా ఉన్నారు. భారీ దేవాలయాలు, తెలుగు అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగే పండుగలు ఇక్కడి తెలుగువారిని ఏకం చేస్తున్నాయి.

ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు."పరాయి గడ్డపై మన భాషా ప్రాభవం చూడటం గర్వంగా ఉంది. మన సంస్కృతిని కాపాడుకోవడం గొప్ప విషయం" అని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం "మనం ఉన్న దేశపు సంస్కృతిని గౌరవించాలి. ఇలాంటి వ్యాఖ్యలు అమెరికన్లు బయటివారిలా కనిపిస్తున్నారు అనడం స్థానికులకు మనపై ప్రతికూల భావన కలిగించే అవకాశం ఉంది.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి" అని సూచిస్తున్నారు.

పేరు ఏదైనా ‘డాలస్‌పురం’ ఇప్పుడు తెలుగు వారి శక్తికి, విజయానికి ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తోంది. ఇక్కడ వినిపిస్తున్న తెలుగు సందడి కేవలం ఒక వీడియోకే పరిమితం కాకుండా విదేశాల్లో మన తెలుగు సంస్కృతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో స్పష్టం చేస్తోంది.



Tags:    

Similar News