అమెరికా సరిహద్దుల్లో 'భారత' అలజడి: ప్రతి 20 నిమిషాలకో అరెస్ట్!
మెరుగైన జీవితం.. భారీ జీతం.. విలాసవంతమైన జీవనశైలి.. ఈ 'అమెరికా కల' సాకారం చేసుకోవాలని తపించే భారతీయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.;
మెరుగైన జీవితం.. భారీ జీతం.. విలాసవంతమైన జీవనశైలి.. ఈ 'అమెరికా కల' సాకారం చేసుకోవాలని తపించే భారతీయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే సరైన మార్గంలో వెళ్లడం కష్టతరమవ్వడంతో చాలామంది ప్రాణాలకు తెగించి అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) విడుదల చేసిన గణాంకాలు ఈ పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
2025 సంవత్సరపు గణంకాల ప్రకారం.. అమెరికా సరిహద్దుల్లో భారతీయుల అరెస్టులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ప్రతి 20 నిమిషాలకో భారతీయుడు సరిహద్దుల్లో పట్టుబడుతున్నారు. గడిచిన ఏడాదిలో సుమారు 23,830 మంది భారతీయులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉండటం గమనార్హం. అంటే గత ఏడాదితో పోలిస్తే సంఖ్య తగ్గినా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.
ఎందుకు ఈ రిస్క్?
భారతీయులు ఇంత భారీ సంఖ్యలో అక్రమంగా ప్రవేశించడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.. హెచ్-1బీ వంటి చట్టబద్ధమైన వీసాల లభ్యత తక్కువగా ఉండటం.. వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండటంతో చాలామంది షార్ట్‌కట్ వెతుక్కుంటున్నారు. మానవ అక్రమ రవాణా చేసే ముఠాలు "డొంకీ రూట్" వంటి ప్రమాదకరమైన మార్గాల ద్వారా అమెరికా చేరవేస్తామని యువతను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.భారతీయులు ఎక్కువగా కెనడా లేదా మెక్సికో సరిహద్దుల గుండా అడవులు, ఎడారులను దాటుకుంటూ అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు.
దేశ ప్రతిష్ఠపై ప్రభావం
అక్రమ వలసలు కేవలం వ్యక్తిగత భద్రతకే కాకుండా దేశ ప్రతిష్ఠకు కూడా భంగం కలిగిస్తాయి. అంతర్జాతీయ వేదికలపై భారతీయ పాస్‌పోర్ట్ విలువపై ఇది ప్రభావం చూపుతుంది. నిజమైన పర్యాటకులు, విద్యార్థులు వీసాలు పొందే సమయంలో మరింత కఠినమైన తనిఖీలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
యువతకు సూచనలు
అక్రమ మార్గాల్లో వెళ్లడం వల్ల జైలు శిక్ష, బహిష్కరణ ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. అందుకే ఎడ్యుకేషన్ వీసా, వర్క్ వీసా లేదా స్కిల్డ్ మైగ్రేషన్ వంటి అధికారిక మార్గాలను మాత్రమే ఎంచుకోవాలి. విదేశీ ప్రయాణాలకు ముందు భారత ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీల ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలి.
గమ్యం చేరడం ఎంత ముఖ్యమో ప్రయాణించే మార్గం అంతే సురక్షితంగా ఉండాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అక్రమ వలసలపై గ్రామీణ స్థాయి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.