కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్య.. కారణం ఇదే
కెనడాలోని వాంకోవర్ లో నివసిస్తున్న డిల్ రాజ్ సింగ్ గిల్ ను జనవరి 22న బర్నబీలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.;
కెనడాలోని భారత సంతతి వ్యక్తుల మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కెనడాలోని వాంకోవర్ లో నివసిస్తున్న డిల్ రాజ్ సింగ్ గిల్ ను జనవరి 22న బర్నబీలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ హత్య బీసీ గ్యాంగ్ మధ్య కొనసాగుతన్న ఉద్రిక్తత నేపథ్యంలో జరిగినట్టు స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ వ్యాపార లావాదేవీల్లో వచ్చిన మనస్పర్థలతో హత్య జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. కానీ పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. డిల్ రాజ్ సింగ్ కు ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్స్ తో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. డిల్ రాజ్ కు డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
బిసి గ్యాంగ్స్ అంటే..
బ్రిటిష్ కొలంబియాలో ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఈ గ్యాంగుల సంఖ్య 120 వరకు ఉండొచ్చని అంచనా. డ్రగ్స్ వ్యాపారం ఈ గ్యాంగుల ప్రధాన లక్ష్యం, ఆదాయవనరు. బ్రిటిష్ కొలంబియాలో ప్రధానంగా మూడు గ్యాంగులు ఉన్నట్టు తెలుస్తోంది. మిగతావి చిన్నాచితక గ్యాంగులు.
ది వోల్ఫ్ ప్యాక్ అలయన్స్..
ఇది 2010లో హెల్స్ యాంగిల్స్, రెడ్ స్కార్పియన్స్, ఇండిపెండెంట్ సోల్జర్స్ లోని కొంత మంది సభ్యులతో కలిసి ఏర్పడింది. డ్రగ్స్ రవాణాలో ఈ గ్యాంగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
ది 856 గ్యాంగ్..
ఇది చిన్నా చితకా నేరాల నుంచి డ్రగ్స్ వ్యాపారం వరకు అన్ని రకాల క్రైమ్స్ లో తన పాత్రను పోషిస్తుంది. అన్ని ప్రావిన్సులలో ఇది తన నెట్ వర్క్ ను విస్తరించి నేరాలు చేస్తోంది.
రెడ్ స్కార్పియన్స్..
ఈ గ్యాంగ్ కూడా డ్రగ్స్ రవాణాతో పాటు నేరాలు చేయడంలో దిట్ట. ముఖ్యంగా తన ప్రత్యర్థులైన హెల్స్ యాంగిల్స్, యునైటెడ్ నేషన్స్ గ్యాంగ్ తో ఘర్షణల సందర్భంగా ప్రాధాన్యతలోకి వచ్చింది.
ఈమూడు గ్యాంగులు అన్ని ప్రావిన్సులలో డ్రగ్స్ రవాణా చేయడం, నేరాలు చేయడం, ఒక గ్యాంగ్ పై ఇంకో గ్యాంగ్ దాడి చేయడం, చంపుకోవడం వంటి చర్యలు సర్వసాధారణం. డిల్ రాజ్ సింగ్ గిల్ హత్య కూడా ఇదే కోణంలో జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డిల్ రాజ్ ను ప్రత్యర్థులు నేరుగా కాల్చినట్టు సమాచారం. స్థానికులకు ఎలాంటి హాని జరగకుండా డిల్ రాజ్ ను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇండో కెనెడియన్ క్రైమ్ గ్రూప్స్..
భారత సంతతికి చెందిన కొందరు చాలా కాలం నుంచి క్రైమ్ వ్యవహారాల్లో ఉన్నట్టు కెనడియన్ పోలీసులు చెబుతున్నారు. వీరిలో చాలా మంది పంజాబ్ నుంచి వెళ్లి కెనడాలో సెటిల్ అయినవారు ఉన్నారు. వీరంతా గ్యాంగులుగా ఏర్పడి ఆర్గనైజ్డ్ క్రైమ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వ్యాపారం మొదలుకొని చాలా క్రైమ్స్ లో వీరు ప్రధానపాత్ర పోషిస్తున్నారు. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ లాంటి దేశాల నుంచి వీరు డ్రగ్స్ కొనుగోలు చేసి..కెనడాలో విక్రయిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.