హెచ్1బీ, ఎఫ్1, గ్రీన్ కార్డు వీసాదారులకు ట్రంప్ మరో షాక్

అమెరికాలో వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2025-04-07 12:30 GMT

అమెరికాలో వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ, ఎఫ్1 వీసాలు కలిగినవారు , గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సహాయం అందిస్తున్న కీలకమైన కార్యాలయాన్ని ఆయన ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఇకపై ఈ వర్గాల వారికి సహాయం లభించదు.

ట్రంప్ ప్రభుత్వం సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (సీఐఎస్) అంబుడ్స్‌మన్ కార్యాలయ సిబ్బందిని 60 రోజుల పరిపాలనా సెలవుపై పంపింది. ఇది స్వతంత్ర ఇమ్మిగ్రేషన్ పర్యవేక్షణ సంస్థను రద్దు చేసే దిశగా తొలి అడుగు అని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యల ప్రభావం ఆఫీస్ ఫర్ సివిల్ రైట్స్ అండ్ సివిల్ లిబర్టీస్, ఆఫీస్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ అంబుడ్స్‌మన్‌పై కూడా పడింది. దీంతో సీఐఎస్ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వీసా , గ్రీన్ కార్డ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంగా సమర్థించుకుంటున్నప్పటికీ, అంబుడ్స్‌మన్ ప్రమేయం లేకుండా వలస కేసులను ఎలా పరిష్కరిస్తారో స్పష్టంగా చెప్పడం లేదు. ఈ పరిణామం సహజంగానే అమెరికాలో ఉన్న భారతీయ హెచ్1బీ, ఎఫ్1 వీసాదారులు , గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారిపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతంలో ఈ హెల్ప్ డెస్క్ ఏటా సుమారు 30 వేల మందికి వీసా ప్రాసెసింగ్ ఆలస్యం , ఇతర సమస్యల పరిష్కారంలో సహాయం చేసింది.

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ప్రభావితమయ్యే వారు తమ ఆలస్యమైన లేదా వివాదాస్పదమైన యూఎస్‌సీఐఎస్ కేసుల సహాయం కోసం కాంగ్రెస్ ప్రతినిధిని సంప్రదించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వృత్తిపరమైన మార్గదర్శకత్వం కోసం ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులను సంప్రదించాలని కోరుతున్నారు. తమ వద్ద అన్ని రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని , వీసాలు, గ్రీన్ కార్డుల కోసం ప్రీమియం ప్రాసెసింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి పెద్ద సంస్థలు తమ హెచ్1బీ ఉద్యోగులను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నాయి. ఈ పరిణామం అమెరికాలో ఉన్న వలసదారుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News