వీసా రద్దు : అమెరికాలో భారత విద్యార్థికి తప్పిన బహిష్కరణ ముప్పు

అమెరికాలో విద్యార్థి వీసా రద్దు చేయబడి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థికి అక్కడి ఫెడరల్ కోర్టు ఊరటనిచ్చింది.;

Update: 2025-04-17 16:30 GMT

అమెరికాలో విద్యార్థి వీసా రద్దు చేయబడి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థికి అక్కడి ఫెడరల్ కోర్టు ఊరటనిచ్చింది. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్న 21 ఏళ్ల క్రిష్‌లాల్ ఐసర్ దాసానీ వచ్చే నెలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉండగా, ఈ నెల 4న అతని ఎఫ్-1 విద్యార్థి వీసా రద్దయింది. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎస్‌ఈవీఐఎస్‌) డేటాబేస్ నుండి అతని వివరాలను తొలగించారు.

దీంతో క్రిష్‌లాల్ స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అతని న్యాయవాది వాదనలు వినిపించారు. "వీసా రద్దు చేయడానికి ముందు అతనికి ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. తన వివరణ ఇవ్వడానికి లేదా ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోవడానికి అతనికి అవకాశం ఇవ్వలేదు" అని కోర్టుకు తెలిపారు. న్యాయమూర్తి వాదనలు విన్న అనంతరం క్రిష్‌లాల్‌ను బహిష్కరించవద్దని ఆదేశాలు జారీ చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అతని వీసాను రద్దు చేయకుండా మరియు అతన్ని నిర్బంధించకుండా కూడా ఆదేశాలు ఇచ్చింది.

గత ఏడాది నవంబర్‌లో క్రిష్‌లాల్‌ను పోలీసులు ఒక బార్ వెలుపల రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో అరెస్టు చేశారు. అయితే, కోర్టు అతనిపై అభియోగాలు మోపడానికి నిరాకరించడంతో పోలీసులు అతన్ని విడుదల చేశారు. ఆ తర్వాత అతని వీసా రద్దు కావడం గమనార్హం.

మరోవైపు, క్రిష్‌లాల్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు కూడా బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటూ గత శుక్రవారం కోర్టును ఆశ్రయించారు. ఎస్‌ఈవీఐఎస్‌లో వారి వలస విద్యార్థి హోదాను తొలగించడంతో వారు బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్)కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన వారిలో భారత్‌కు చెందిన చిన్మయ్ డియోర్, చైనాకు చెందిన జియాంగ్యున్ బు, క్వియుయి యాంగ్ మరియు నేపాల్‌కు చెందిన యోగేశ్ జోషి ఉన్నారు. ఈ విద్యార్థుల కేసులు కూడా త్వరలో విచారణకు రానున్నాయి.

Tags:    

Similar News