అంతరిక్షంలోకి గణపతి ప్రతిమ... సునీత విలియమ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అవును... సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరుతున్నారు

Update: 2024-05-06 06:45 GMT

సునీతా విలియమ్స్... ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా పరిచయం అవసరంలేని పేరనే చెప్పాలి! అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపిన మహిళా వ్యోమగామిగా ఆమె రికార్డు నెలకొల్పారు. ఇదే సమయంలో... అమెరికాలో అత్యంత స్టామినా ఉన్నవారి జాబితాలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈమె తాజాగా మూడో అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అవును... సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరుతున్నారు. ఇంతకు ముందు 2006, 2012లో అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన సునీతా విలియమ్స్... తాజాగా ఈ నెల 7వ తేదీన మూడోసారి అంతరిక్షయాత్ర చేయనున్నారు. సునీత 14 జూలై 2012న తన రెండోసారి అంతరిక్షయానం చేశారు. సుమారు నాలుగు నెలలపాటు అంతరిక్షంలోనే గడిపి.. 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు.

ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం తన మూడో అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా బుచ్‌ విల్మోర్‌ తో కలిసి ఆమె అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఇద్దరు వ్యోమగాములు బోయింగ్‌ స్టార్‌ లైనర్‌ స్పేస్‌ షిప్‌ లో స్పేస్‌ లోకి దూసుకెళ్లనున్నారు. ఇంతకు ముందు బోయింగ్‌ కంపెనీ మానవ రహిత అంతరిక్ష యాత్రలు చేపట్టగా.. మొట్టమొదటిసారి మానవ సహిత యాత్ర చేపడుతుంది!

స్టార్‌ లైనర్‌ స్పేస్‌ షిప్ రేపు (మే 7) భారతకాలమానం ప్రకారం ఉదయం 8:00 గంటలకు కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించబడనుంది. ఈ సందర్భంగా స్పందించిన సునీతా విలియమన్స్‌... కొత్త స్పేస్‌ క్రాఫ్ట్‌ లో ప్రయాణించబోతున్నందున తాను కొంచెం ఉద్విగ్నంగా ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో ఉత్సాహంగానూ ఉన్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా తన అంతరిక్ష ప్రయాణంలో తనతో పాటు గణపతి ప్రతిమను వెంట తీసుకెళ్తానని.. దీంతో అదృష్టం కలిసివస్తుందని తాను భావిస్తున్నానని తెలిపారు సునీతా విలియమన్స్‌. కాగా... గత రెండు అంతరిక్ష ప్రయాణాల్లోనూ ఆమె వెంట భగవద్గీత తీసుకెళ్లారు!

Tags:    

Similar News