బ్రాహ్మణులు భారత్ కే పరిమితం కారా? అమెరికాలోనూ బ్రాహ్మిణ్స్ ఉన్నారా?

కుల, మతాలకు మన దేశమే నిలయం.. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కులం, మతం కోణంలోనే చూస్తారు. కానీ, విదేశాల్లోనూ ఈ కుల వ్యవస్థ ఉందా? అనే చర్చ తాజాగా మొదలైంది.;

Update: 2025-09-02 11:30 GMT

కుల, మతాలకు మన దేశమే నిలయం.. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కులం, మతం కోణంలోనే చూస్తారు. కానీ, విదేశాల్లోనూ ఈ కుల వ్యవస్థ ఉందా? అనే చర్చ తాజాగా మొదలైంది. ప్రధానంగా అమెరికాలో ‘బ్రాహ్మణులు’ను ఉద్దేశించి వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలు అగ్ర రాజ్యంలోనూ కుల వ్యవస్థపై చర్చకు కారణమవుతున్నాయి. అమెరికాలో కులాల కోసం ఇంతవరకు ఎవరూ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, మన దేశం రష్యా చమురు కొనుగోళ్లకు సంపన్న బ్రాహ్మణులే కారణమని పీటర్ నవారో వ్యాఖ్యానించడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

అమెరికా సుంకాల పెంపు నేపథ్యంలో మన దేశం ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించుకుంటుందన్న భావనతో వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో నోరు పారేసుకున్నారని అంటున్నారు. చైనా, రష్యాలకు మన దేశం దగ్గర అవుతుండటంపై ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ఇంట్వ్యూలో నవారో తన అక్కసు వెళ్లగక్కారు. మోదీ వంటి గొప్ప ప్రజాతంత్ర నాయకుడు పుతిన్, జిన్ పింగులతో ఎందుకు అంటకాగుతున్నారో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించిన పీటర్ నవారో.. ‘ఇదంతా బ్రాహ్మణులు’చేస్తున్నారని మండిపడ్డారు. రష్యా చమురు కొనుగోళ్లలో బ్రాహ్మణులే లాభపడుతున్నారని ఆయన ఆరోపించారు.

వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఏ ఉద్దేశంతో ఇలా వ్యాఖ్యానించారో గానీ, అమెరికాలో అత్యంత సంపన్నులైన వ్యాపార వర్గాలకు చెందిన ప్రొటెస్టెంట్లను బోస్టన్ బ్రాహ్మిన్స్ గా వ్యవహరిస్తారు. ఈ కారణంగానే సంపన్నులైన వ్యాపారులే లాభపడుతున్నారని చెప్పడానికి నవారో బ్రాహ్మిన్స్ అన్న పదం వాడి ఉంటారని అంటున్నారు. అయితే మన దేశంలో బ్రాహ్మిణ పదానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా నవారో వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అమెరికన్స్ లో కూడా బ్రాహ్మణులు ఉంటారా? అని చాలా మంది ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు.

కాగా, పీటర్ నవారో వ్యాఖ్యలను ప్రధాని మోదీ వాణిజ్య సలహాదారు సంజీవ్ సన్యాల్ తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పారు. ఇక బ్రాహ్మణులను ఉద్దేశించి సోషల్ మీడియాలోనూ పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దవ్ సేన పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ నవారో వ్యాఖ్యలు ఆయన కురచ బుద్దిని బయటపెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో బ్రాహ్మణ పదానికి వేరే అర్థం ఉంది అని ఆమె తెలిపారు. సంపన్న కులీన వర్గాన్ని ఆ పేరుతో పిలుస్తారని, దానికీ, కుల వ్యవస్థకు సంబంధమే లేదని చెప్పారు.

Tags:    

Similar News