అమెరికా పౌరసత్వం.. మనకే ఫస్ట్

అమెరికాలో స్థిరపడాలనే కోట్లాది మంది కల నెరవేరుతోంది. ముఖ్యంగా భారతీయులకు ఈ కల కేవలం గ్రీన్‌కార్డుతోనే ఆగిపోవడం లేదు.;

Update: 2025-07-15 16:30 GMT

అమెరికాలో స్థిరపడాలనే కోట్లాది మంది కల నెరవేరుతోంది. ముఖ్యంగా భారతీయులకు ఈ కల కేవలం గ్రీన్‌కార్డుతోనే ఆగిపోవడం లేదు. ఇటీవల విడుదలైన యూఎస్‌సీఐఎస్‌ (USCIS) డేటా ప్రకారం.. ఇతర దేశాల వలసదారులతో పోలిస్తే భారతీయులు చాలా తక్కువ సమయంలోనే అమెరికన్ పౌరసత్వం పొందుతున్నారు. ఇది వారి దృఢ సంకల్పానికి, ప్రణాళికాబద్ధమైన పయనాన్ని సూచిస్తోంది.

-పౌరసత్వంలో సరికొత్త వేగం

అమెరికన్ పౌరసత్వం పొందడానికి దేశవ్యాప్తంగా సగటున 7.5 సంవత్సరాలు పడుతుండగా.. భారతీయులు కేవలం 5.9 సంవత్సరాలలోనే దీనిని సాధిస్తున్నారు. ఈ వేగం ఆశ్చర్యకరమైనది. పౌరసత్వం పొందిన వారి సంఖ్యలో మెక్సికన్లు అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, వారికి సగటున దాదాపు 11 సంవత్సరాలు పడుతుంది. ఈ గణాంకాలు భారతీయులు "తక్కువ నిరీక్షణ, ఎక్కువ కృషి" అనే సూత్రాన్ని పాటిస్తున్నారని స్పష్టం చేస్తున్నాయి. అమెరికన్ పౌరసత్వం పొందడానికి ప్రాథమిక నిబంధనలు చాలా సులువుగానే ఉన్నాయి. పర్మనెంట్ రెసిడెన్సీ పొందిన ఐదేళ్ల తర్వాత లేదా వివాహం ద్వారా గ్రీన్‌కార్డు పొందినట్లయితే మూడేళ్ల తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు.

- ఐటీ నిపుణులే కాదు.. మహిళల భాగస్వామ్యం ఎక్కువ!

పౌరసత్వం పొందుతున్న వారిలో హై-స్కిల్డ్ ఐటీ నిపుణులే కాకుండా.. ఇతర వృత్తుల వారు కూడా గణనీయంగా ఉన్నారు. గత ఏడాది పౌరసత్వం పొందిన వారి సగటు వయస్సు 42 సంవత్సరాలు కాగా.. వీరిలో 55 శాతం మంది మహిళలే కావడం విశేషం. ఇది ఉద్యోగాల నిమిత్తం వచ్చిన పురుషులతో పాటు కుటుంబాలతో వస్తున్న మహిళలు కూడా పౌరసత్వాన్ని కోరుకుంటున్నారని తెలియజేస్తుంది. కుటుంబ భద్రతకు, స్థిరమైన భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇస్తున్నారని దీని ద్వారా అర్థమవుతుంది.

భద్రత, భవిష్యత్ భరోసా కోసమే పౌరసత్వం

భారతీయులు ఇంత త్వరగా పౌరసత్వం కోరుకోవడానికి ప్రధాన కారణం భద్రత, భవిష్యత్తుపై భరోసా. గతంలో ట్రంప్ పాలనలో వలస విధానాల్లో వచ్చిన మార్పులు, H-1B వీసా కేటాయింపుల్లో నెలకొన్న గందరగోళం అనేక కుటుంబాలను ఆందోళనకు గురి చేశాయి. వీసా రద్దు, ఉద్యోగం కోల్పోయే ప్రమాదం వంటి అనిశ్చితి మధ్య, అమెరికన్ పౌరసత్వమే స్థిరత్వానికి ఏకైక మార్గంగా కనిపించింది.

అమెరికన్ పాస్‌పోర్ట్ పొందిన తర్వాత లభించే ప్రయోజనాలు అనేక మందికి భద్రతను అందిస్తున్నాయి. ఉద్యోగం మారడానికి ఎటువంటి భయం ఉండదు. వీసా గడువు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశం విడిచి వెళ్లి తిరిగి రావడంలో సమస్యలు ఉండవు.

డిపోర్టేషన్ భయం పూర్తిగా తొలగిపోతుంది. అందుకే దానికోసం అందరూ ప్రయత్నిస్తున్నారు.

-గ్రీన్‌కార్డు దాటి పౌరసత్వం వైపు దృష్టి

ఇప్పటివరకు చాలా మంది భారతీయులకు గ్రీన్‌కార్డు పొందడమే ఒక పెద్ద విజయంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ దశను దాటి, వారి దృష్టి పూర్తిస్థాయిలో పౌరసత్వంపైనే ఉంది. అమెరికాలో సురక్షితమైన జీవితం, పిల్లల భవిష్యత్తు, సంపూర్ణ పౌర హక్కులతో జీవించాలంటే అమెరికన్ పాస్‌పోర్ట్ అత్యవసరం అని వారు గ్రహించారు.

"వీసాల అస్థిరత మాకు భద్రతను ఇవ్వదు, పాస్‌పోర్ట్‌నే ధైర్యంగా నిలబెట్టగలదు!" అని భారతీయ ప్రవాసులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతీయుల కలలు ఇప్పుడు గ్రీన్‌కార్డుకే పరిమితం కాకుండా, పౌరసత్వమే లక్ష్యంగా మారాయి. కేవలం 6 ఏళ్లలోనే పౌరసత్వం సాధించి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అమెరికా వారి రెండో ఇల్లు కాకుండా, మొదటి ఇల్లు కావాలనేదే వారి నేటి ఆకాంక్ష. ఈ మార్పు భారతీయ వలసదారుల పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని, అమెరికాలో వారి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే కోరికను స్పష్టంగా తెలియజేస్తుంది.

Tags:    

Similar News