అమెరికాలోనూ మనోళ్లు మారరా.? ట్రంప్ ఇందుకే అనేది

అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన వినాయక చవితి వేడుకలు ఒక పోలీసు అధికారి డాన్స్‌తో వైరల్‌గా మారాయి.;

Update: 2025-09-05 05:28 GMT

అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన వినాయక చవితి వేడుకలు ఒక పోలీసు అధికారి డాన్స్‌తో వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఈ నృత్యాన్ని ఆనందం, సాంస్కృతిక వ్యక్తీకరణగా చూస్తుంటే మరికొందరు దీనిని ఆధ్యాత్మిక వాతావరణానికి తగని చర్యగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అమెరికాలో వేరే దేశస్థుల ఆధిపత్యంపై అమెరికన్స్ తోపాటు అధ్యక్షుడు ట్రంప్ కారాలు మిరియాలు నూరుతూ టారిఫ్ లు వేస్తున్నారు.అమెరికాలో ఉంటూ అమెరికన్ సంప్రదాయాన్ని గౌరవించాలంటూ హెచ్చరికలు వస్తున్న వేళ.. ఇండియాలోలాగా డల్లస్ లో వినాయక ఊరేగింపు నిర్వహించడంపై విమర్శల వర్షం కురుస్తోంది. అమెరికాలో అక్కడి సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాల్సిన మన భారతీయులు ఇలా చేయడం వల్ల అక్కడి సమాజంలోని ప్రజలతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

భారతదేశంలో గణేశ్‌ నిమజ్జనం, శోభాయాత్రల్లో డప్పులు, డాన్స్‌లు సాధారణం. కానీ అమెరికాలో ఇదే దృశ్యంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా ఉండే డల్లాస్‌లో ఈ వివాదం చర్చకు దారితీసింది.

ఈ వివాదం కేవలం డాన్స్‌ గురించి మాత్రమే కాదు. ఇది వలస వెళ్లిన భారతీయుల సంస్కృతి, గుర్తింపు సమస్యలను సూచిస్తోంది. అమెరికాలోని భారతీయులు తమ మూలాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే, స్థానిక అమెరికా సమాజం దృష్టిని, విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని ఈ సంఘటన తెలియజేస్తుంది. ఈ వేడుకలు ఒకవైపు ఆనందాన్ని పంచుతుంటే, మరోవైపు ఇవి స్థానిక సమాజానికి ఎలా కనిపిస్తున్నాయనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

సాంస్కృతిక వ్యక్తీకరణ:

గణేశ్‌ ఉత్సవాల్లో డాన్స్‌ను సాంస్కృతిక సంప్రదాయంగా చూడాలి. ఆనందాన్ని వ్యక్తం చేయడంలో ఇది ఒక భాగం. కొంతమంది డాన్స్‌లను ఆధ్యాత్మికతకు విరుద్ధంగా భావిస్తున్నారు. పండుగ అంటే ప్రశాంతంగా, భక్తితో జరుపుకోవాలనేది వారి వాదన. ప్రవాస భారతీయులు తమ సంస్కృతిని కాపాడుకోవడానికీ, స్థానిక సమాజంతో కలిసిపోవడానికీ మధ్య ఉండే సంఘర్షణను ఈ వివాదం ప్రతిబింబిస్తుంది.

ఈ సంఘటన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. సంస్కృతులను అనువదించడం ఎప్పుడూ సులభం కాదు. ఒక ప్రాంతంలో సాధారణమైనది, మరొక ప్రాంతంలో వివాదానికి దారితీయవచ్చు. అందుకే, సంబరాలు జరుపుకునేటప్పుడు ఆయా ప్రాంతాల సాంస్కృతిక, సామాజిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.


Tags:    

Similar News