వైసీపీ ‘యువత పోరు’ కాదు.. ముసలి పోరు!
ఈ నేపథ్యంలోనే "యువత పోరు" కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ ల వద్ద ఆందోళనలకు ఆ పార్టీ యువజన విభాగం పిలుపునిచ్చింది.;
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ విమర్శిస్తోన్న వైసీపీ... చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంపై పోరుకు పిలుపునిచ్చింది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైసీపీ.. ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. అయితే.. ఇక్కడ యువత ఎక్కువగా కనిపించకపోవడం గమనార్హం.
అవును.. ఈ నెల 4న ఏపీలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన వైసీపీ... తాజాగా అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆ దిశగా అడుగులు పడలేదని.. ఉద్యోగాలు కల్పించకపోతే రూ.3,000 నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇచ్చి, దాన్ని నెరవేర్చలేదని ఆరోపించింది.
ఈ నేపథ్యంలోనే "యువత పోరు" కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ ల వద్ద ఆందోళనలకు ఆ పార్టీ యువజన విభాగం పిలుపునిచ్చింది. యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ లకు యువతీ యువకులతో కలిసి పార్టీ నేతలు వినతిపత్రాలు అందించనున్నారు.
ఈ క్రమంలో... పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం ఈ రోజు ఉదయాన్నే ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు జిల్లా కలెక్టరేటల వద్ద నిరసనకారుల అత్యుత్సాహంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఓ చర్చ తెరపైకి వచ్చింది.
వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమం పేరే "యువత పోరు". పైగా యూత్ లో జగన్ కు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పుకుంటుంటారు! అయితే అనూహ్యంగా.. యువత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యువత కంటే ఎక్కువగా పెద్దలు, వృద్ధులు కనిపిస్తున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీమ్స్ కి ట్రోల్స్ కి అవకాశం ఇచ్చింది!
తాజాగా ఈ "యువత పోరు" కార్యక్రమానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన కొన్ని ఫోటోల్లో... నిరసనల్లో పాల్గొన్న వారిలో.. యువత ఎక్కువగా కనిపించలేదు సరికదా వారి స్థానంలో పెద్దలు, వృద్ధులు కనిపిస్తుండటం వైరల్ గా మారింది! దీంతో... ఈ పోరుపై యువతకు ఆసక్తి లేదా. లేక, కూటమి ప్రభుత్వంపై నమ్మకం తగ్గేదేలేదా అనే చర్చ తెరపైకి వచ్చింది.