శోభన్ బాబు నోట బాలు పాట పలికించిన స్వర చక్రవర్తి

చక్రవర్తి తొలి చిత్రం మూగ ప్రేమకు హీరో శోభన్ బాబే. ఆ తరువాత అనేక శోభన్ హిట్ చిత్రాలకు ఆయనే హీరో. అయితే శోభన్ బాబు తన పాటలను రామక్రిష్ణ మాత్రమే పాడాలని కండిషన్ పెట్టేవారు.;

Update: 2026-02-03 06:05 GMT

చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. గుంటూరు జిల్లా పొన్నవోలులో పుట్టిన ఆయనకు స్వర జ్ఞానం చిన్న నాటి నుంచే ఉంది. అందుకే ఆయన తన భవిష్యత్తును తెలుసుకునేందుకు మద్రాస్ నే గమ్యస్థానంగా ఎంచుకున్నరు. ఆయన మద్రాస్ లో అడుగుపెట్టాక తెలిసింది తాను గాయకుడిగా సెటిల్ కాలేనని, అప్పటికి ఘంటసాల శకం నడుస్తోంది. ఆ తరువాత వరుసలో పీబీ శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఏం ఏం రాజా వంటి వారు ఎందరో ఉన్నారు. దాంతో ఆయన ఘంటసాల బృందంలో చేరి సహాయకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. పరమానందయ్య శిష్యుల కధ మూవీలో కొన్ని పదాలను కూడా పలికి గాయకుడు అనిపించుకున్నారు. కానీ ఆ జీవితం ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు, దాంతో తాను ఏదో విధంగా తన టాలెంట్ ని చాటుకోవాలని వేరే దారులు వెతికారు.

సంగీత దర్శకుడిగా :

ఘంటసాల మాస్టర్ ఇతర సంగీత దర్శకుల వద్ద చేసిన శిష్యరికంతో సినీ సంగీతం మీద ఆయనకు కొంత పట్టు వచ్చింది. దాంతో సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించాలని అనుకున్నారు. అలా 1970లో ఆయన తొలి చిత్రం మూగ ప్రేమ వచ్చింది. అందులో చక్రవర్తిగా పేరుతో ఆయన సమకూర్చిన బాణీలు అన్నీ శ్రోతల ప్రశంసలు పొందాయి. ఇక 1973లో ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన శారద మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా విజయంలో సగం పాత్ర సంగీతమే వహించింది అంటే అతిశయోక్తి కాదు. ఆ తరువాత చక్రవర్తి చూసుకోలేదు, అప్పటికి హీరోలుగా ఎస్టాబ్లిష్ అవుతున్న శోభన్ బాబు కృష్ణ వంటి వారి సినిమాలకు చక్రవతి సంగీతం బహు చక్కగా కుదిరింది. ఆనాటి యువతరం పల్స్ పట్టుకుని అప్పటిదాకా ఒక ఒరవడిలో ఉన్న సినీ సంగీతాన్ని పరుగులు పెట్టించిన ఘనత అచ్చంగా చక్రవర్తిదే అని చెప్పాలి.

శోభన్ బాబుని ఒప్పించి :

చక్రవర్తి తొలి చిత్రం మూగ ప్రేమకు హీరో శోభన్ బాబే. ఆ తరువాత అనేక శోభన్ హిట్ చిత్రాలకు ఆయనే హీరో. అయితే శోభన్ బాబు తన పాటలను రామక్రిష్ణ మాత్రమే పాడాలని కండిషన్ పెట్టేవారు. చక్రవర్తికి అయితే ఎస్పీ బాలుతో పాడించాలని ఉండేది. కానీ ఘంటసాల వాయిస్ కి దగ్గరగా ఉంటుందని తన సినిమాలకు రామక్రిష్ణ గొంతు మాత్రమే సూట్ అవుతుందని శోభన్ బాబు చెప్పడంతో చక్రవతి మధన పడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మరో విశేషం ఉంది. చక్రవర్తి బాలూల మధ్య అన్న దమ్ముల బంధం ఎంతో గాఢంగా ఉంది. బాలు తన పాటలు పాడాలని ఆయనకు ఉండేది.

ఇలా సాగుతున్న క్రమంలో చక్రవర్తి అయితే తాను మ్యూజిక్ డైరెక్టర్ గా కొంత ఎస్టాబ్లిష్ అయ్యాక తన మాట నెగ్గుతుందని ధైర్యం వచ్చాక హీరో శోభన్ బాబుతోనే మాట్లాడి వాదించి మరీ ఆయన పాటలకు ప్లే బ్యాక్ సింగర్ గా బాలూని ఒప్పించారు. మీ గొంతుకు బాలూ గొంతు బాగా సూట్ అవుతుంది నమ్మండి అంటూ శోభన్ కి నచ్చ చెప్పి ఎస్పీబీతో పాడించారు. అలా దర్శకుడు కె రాఘవేంద్రరావు తొలి చిత్రం బాబు మూవీకి బాలు గొంతుకతో శోభన్ పాటలు వెండి తెరను అలరించాయి. ఆ సినిమా హిట్ అయింది. పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అక్కడ నుంచి శోభన్ కి బాలూయే అన్నట్లుగా బంధం ఫిక్స్ అయింది. దీని వెనక ఉన్నది మాత్రం స్వర చక్రవర్తి అన్నది చాలా మందికి తెలియదు.

బాలూయే చెప్పారు :

స్వరాభిషేకం లో ఒక ఎపిసోడ్ లో శోభన్ బాబు గురించి చక్రవర్తి గురించి బాలూ మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. తన గురించి తన కెరీర్ గురించి ఎంతో ఆలోచించి మధన పడ్డ వారు చక్రవర్తి అని బాలూ అన్నారు. ఒక హీరోని ఒప్పించి తన పాటలను పాడించడం అంటే మామూలు విషయం కాదని, తన కోసం ఇదంతా చక్రవర్తి చేశారు అని బాలూ చక్రవర్తిని తలచుకున్నారు. ఇక చక్రవర్తి టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన దాదాపుగ వేయి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన 1970, 1980 దశకంలో తెలుగు సినీ సంగీతాన్ని ఊపేశారు. నిజంగా చక్రవర్తిలా ఏలారు. ఎన్నో సూపర్ హిట్స్ ఎన్టీఆర్ ఏఎన్నార్, కృష్ణ శోభన్ బాబులకే కాదు ఆ తరువాత వచ్చిన చిరంజీవి బాలయ్య, వెంకటేష్ నాగార్జులకు కూడా ఇచ్చి వారి కెరీర్ స్ట్రాంగ్ కావడానికి తన వంతు పాత్ర పోషించారు. 2002 ఫిబ్రవరి 3న ఆ స్వర చక్రవర్తి భువిలో తన పాటలను జ్ఞాపకాలుగా వదిలేసి అనంతలోకాలకు పయనమయ్యారు. తెలుగు సినీ సీమలో చక్రవర్తి ఒక స్వరం. ఒక శకం ఒక వరం అని కూడా చెప్పాలి.

Tags:    

Similar News