విదేశాల నుంచి వస్తుంటే మహిళలు 40గ్రా.. మగాళ్లు 20 గ్రాముల బంగారం

2016నాటి పాత నిబంధనల స్థానంలో రూపొందించినకొత్త బ్యాగేజీ నిబంధనలు 2026 ఈ నెల రెండు నుంచి అమల్లోకి వచ్చినట్లుగా కేంద్ర పరోక్ష పన్నులు.. కస్టమ్స్ బోర్డు తాజాగా వివరాల్ని వెల్లడించింది. ఆ వివరాల్ని చూస్తే..;

Update: 2026-02-03 04:12 GMT

విదేశాల నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చే బంగారు ఆభరణాలకు సంబంధించిన సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. ఆకాశ మార్గంలో కానీ సముద్ర మార్గంలోకి కానీ వచ్చే ప్రయాణికులు ఎవరెంత బంగారు ఆభరణాలు తీసుకురావొచ్చన్న దానికి సంబంధించిన వివరాలు మరింత క్లియర్ గా తెలుసుకుంటే.. అసలు విషయం అర్థమవుతుంది. ఎవరెంత బంగారు ఆభరణాలు తీసుకురావొచ్చన్న అంశంపై స్పష్టం వచ్చేస్తుంది. కేంద్రం తాజాగా అమల్లోకి తెచ్చిన కొత్త బ్యాగేజ్ నిబంధన ప్రకారం మహిళలు 40 గ్రాముల బంగారు ఆభరణాల్ని.. పురుషులు 20 గ్రాముల బంగారు ఆభరణాల్ని ఎలాంటి సుంకం లేకుండా తీసుకొచ్చే వీలుంది.

అయితే.. వీరికి ఒక నిబంధన వర్తిస్తుంది. వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తూ.. తిరిగి వస్తున్న వారు లేదా భారతసంతతి పర్యాటకులైనా కావొచ్చు. ఈ ఆభరణాలు తప్పనిసరిగా వ్యక్తిగత వినియోగానికి మాత్రమే వినియోగించాలే తప్పించి.. బంగారు కడ్డీలు.. బిస్కెట్ల రూపంలో మాత్రం ఉండకూడదు. అలా ఉంటే మినహాయింపులు వర్తించవు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం మహిళలకు రూ.లక్ష, పురుషులకు రూ.50వేల వరకు బంగారు ఆభరణాల్ని తెచ్చుకునే వీలుంది. మారిన నిబంధనల ప్రకారం రెట్టింపు కెంటే ఎక్కువే అనుమతి ఇస్తున్నట్లుగా చెప్పాలి.

2016నాటి పాత నిబంధనల స్థానంలో రూపొందించినకొత్త బ్యాగేజీ నిబంధనలు 2026 ఈ నెల రెండు నుంచి అమల్లోకి వచ్చినట్లుగా కేంద్ర పరోక్ష పన్నులు.. కస్టమ్స్ బోర్డు తాజాగా వివరాల్ని వెల్లడించింది. ఆ వివరాల్ని చూస్తే..

- విదేశాల నుంచి వచ్చే భారతీయ నివాసితులు.. ఫారిన్ లో స్థిరపడిన భారత సంతతి పర్యాటకులు లేదంటే పర్యాటక వీసా కాకుండా ఇతర వీసాలపై వచ్చే ఫారినర్లు.. తమ వెంట తెచ్చే రూ.75 వేల వరకు విలువైన వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు ఉంటుంది. గతంలో ఈ పరిమితి రూ.50 వేలు మాత్రమే.

- అదే సమయంలో వీరు వ్యక్తిగత వినియోగం కోసం రూ.75వేల విలువైన వస్తువుల్ని కస్టమ్స్ సుంకం చెల్లించకుండానే తీసుకురావొచ్చు. రెండేళ్లలోపు వయసున్న పిల్లలకు ఈ నిబంధన వర్తించదు.

- విమానం.. నౌకల ద్వారా వచ్చే విదేశీ పర్యాటకులు రూ.25వేల విలువైన కొత్త వస్తువుల్ని మాత్రమే సుంకం లేకుండా తీసుకురాగలరు.

- 18 ఏళ్లు అంతకంతే ఎక్కువ వయసున్న వారు తమతో పాటు అదనంగా కొత్త ల్యాప్ టాప్ లేదంటే నోట్ ప్యాడ్ ను ఎలాంటి సుంకం లేకుండా తమ లగేజీలో తీసుకురావొచ్చు. తమ జర్నీలో భాగంగా వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చే పాత వస్తువులపై ఎలాంటి సుంకం ఉండదు. విమాన సిబ్బందికి ఈ నిబంధన వర్తించదు.

- జాబ్ కోసం విదేశాల్లో ఉండి.. భారత్ కు శాశ్వితంగా తిరిగి వచ్చే వారికి .. నివాస కాలం ఆధారంగా ఇంటికి సంబంధించి వస్తువులపై ప్రత్యేక మినహాయింపులు లభిస్తాయి. విదేశాల్లో 3-12 నెలలు ఉన్న వారికి రూ.లక్షన్నర విలువైన వస్తువులు.. గడిచిన రెండేళ్లలో ఏడాదిగా విదేశాల్లో ఉంటే రూ.3 లక్షల విలువైన వస్తువుల్ని తీసుకురావొచ్చు. కనీసం రెండేళ్లు విదేశాల్లో ఉండి తిరిగి వచ్చే వారు సుంకం లేకుండా రూ.7.5 లక్షల ఇంటి సామాన్లను తీసుకొచ్చే వీలుంది.

- విదేశాల నుంచి వస్తున్న వారు 2 లీటర్ల మద్యం.. 100 సిగిరెట్లు.. 125 గ్రాముల పొగాకు ఉత్పత్తుల వరకు సుంకం వర్తించదు. పిస్టల్స్.. ఆభరణాలు, వెండి, బంగారం, టీవీ లాంటి వస్తువులకు సాధారణ సుంకం మినహాయింపు వర్తించదు. రూ.2500 విలువైన చాకెట్లను.. బ్యూటీ సామాగ్రిని సుంకం లేకుండా తీసుకురాగలరు.

Tags:    

Similar News