కృత్రిమ కాళ్లను తీసి టేబుల్ మీద పెట్టి.. సీపీఎం హింసను లైవ్ లో చూపిన ఎంపీ

తన ప్రసంగంలో భాగంగా కేరళలోని కన్నూర్ మోడల్ హింసను ఆయన ప్రస్తావించటం ద్వారా.. కమ్యూనిస్టుల మాటలకు చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పటమే కాదు..;

Update: 2026-02-03 04:23 GMT

ప్రజాస్వామ్యం.. మానవత్వం.. సహనం గురించి మాట్లాడే పార్టీలు తమకు వ్యతిరేకంగా పని చేసే వారి మీద ఎంతటి హింసకు పాల్పడుతుందన్న విషయానికి నిలువెత్తు రూపంగా తనను తాను ఆవిష్కరించుకున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెద్దల సభలో తొలిసారి మాట్లాడిన కేరళకు చెందిన బీజేపీనేత సదానందన్ మాస్టర్.. విపక్షాల తీరును కళ్లకు కట్టినట్లుగా చూపించారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వంతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

దాదాపు ముప్ఫై ఏళ్ల క్రితం సీపీఎంకు చెందిన ఎనిమిది మంది నడిరోడ్డు మీద తన రెండు కాళ్లను నరికేసి.. తిరిగి అతికించుకోవటానికి వీల్లేని విధంగా తయారు చేసిన నేపథ్యంలో.. ఆయన కృత్రిమ కాళ్లతో నడుస్తున్నారు. రాష్టపతి కోటాలో రాజ్యసభకు ఎన్నికైన సదానందన్ మాస్టర్.. తొలిసారి రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తన రెండు కృత్రిమ కాళ్లను తీసి టేబుల్ మీద పెట్టి విపక్ష (సీపీఎం)పార్టీల తీరును ఎండగట్టిన వైనం సంచలనంగా మారింది.

ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వారే ముప్ఫైఒక్క ఏళ్ల క్రితం కేరళలో తనపై దాడి చేశారని.. ఇంటికి తిరిగి వెళుతున్న వేళ.. కొంతమంది పథకం ప్రకారం రోడ్డుపై తనను వెనకు నుంచి పట్టుకొని నా రెండు కాళ్లను నరికేశారంటూ అప్పట్లో జరిగిన అమానవీయ ఘటన గురించి చెప్పారు. అయితే.. కృత్రిమ కాళ్లను టేబుల్ మీద పెట్టి ప్రసంగించటాన్ని సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటాస్ తప్పుపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన సదానందన్.. ‘‘ప్రజాస్వామ్యం అంటే ఏమిటో దేశానికి.. ప్రజలకు చూపించాలని అనుకున్నాను. మీరు ఎప్పుడూ సహనం.. ప్రజాస్వామ్యం.. మానవత్వం గురించి మాట్లాడుతుంటారు. మీ నిబద్ధత రాజకీయ హింసపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏదైనా విషయంలో కేంద్రాన్ని గుడ్డిగా వ్యతిరేకించొద్దు’’ అంటూ తగిన రీతిలో వ్యాఖ్యానించారు.

తన ప్రసంగంలో భాగంగా కేరళలోని కన్నూర్ మోడల్ హింసను ఆయన ప్రస్తావించటం ద్వారా.. కమ్యూనిస్టుల మాటలకు చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పటమే కాదు.. అందుకు నిలువెత్తు రూపం తానే అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. తాను నిలబడి మాట్లాడలేకపోవటానికి కారణం సీపీఎం చేసిన చిత్రహింసలే అన్న విషయాన్ని రాజ్యసభ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన తీరుతో.. 31 ఏళ్ల క్రితం జరిగిన కిరాతక చర్య మళ్లీ ఇప్పుడు చర్చనీయాంశంగా చేశారు సదానందన్ మాస్టర్.

ఓవైపు సీపీఎం దురాగతాలను.. రాజకీయ హింసను బయటపెడుతూనే.. మరోవైపు హింసాత్మక రాకీయాలకు వ్యతిరేకంగా.. బాధితులకు అండగా బీజేపీ ఉంటుందన్న సందేశాన్ని దేశానికి సదానందన్ ద్వారా బీజేపీ చూపించినట్లైందని చెప్పాలి. ఇక.. రాజ్యసభలో తన కృత్రిమ కాళ్లను టేబుల్ మీద పెట్టటం సభా మర్యాదా? అంటే కాదనే చెప్పాలి. రూల్ బుక్ ప్రకారం చూస్తే అది తప్పే అవుతుంది. కానీ.. మానవత్వం కోణంలో చూసినప్పుడు దేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో జరిగిన రాజకీయ కక్షకు ఒకరు ప్రభావితం అయితే అదెంత దారుణంగా ఉంటుందన్న విషయాన్ని తన తీరుతో అందరికి చెప్పే విషయంలో సదానందన్ మాస్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అదే సమయంలో నీతులు చెప్పే సీపీఎం తాను పట్టున్న ప్రాంతాల్లో ఎంత దారుణంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని తన తీరుతో తెలియజేశారని చెప్పాలి.

Tags:    

Similar News