భారత్-అమెరికా వాణిజ్య మైత్రికి 'సుంకాల' విముక్తి!

గతేడాది రష్యా నుంచి చమురు దిగుమతుల కారణంగా భారత్‌పై విధించిన 25 శాతం అదనపు శిక్షార్హత సుంకాలను తొలగించాలని అమెరికా నిర్ణయించడం ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం.;

Update: 2026-02-03 06:05 GMT

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ప్రతిష్ఠంభన ఎట్టకేలకు ఒక సుఖాంతానికి చేరుకుంది. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను 50 శాతం నుండి ఏకంగా 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ వేదికపై భారత్ సాధించిన దౌత్య విజయం. ఈ ఒప్పందం కేవలం అంకెలకు సంబంధించినది మాత్రమే కాదు... రెండు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి ప్రతీక.

ట్రంప్‌ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇకపై అమెరికా 18 శాతం సుంకమే విధించనుందని తెలిపారు. ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ “అద్భుతమైన ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే మోదీ తన స్పందనలో వాణిజ్య ఒప్పందాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. శాంతి కోసం ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

కీలక మలుపు: రష్యా చమురు వ్యూహం

గతేడాది రష్యా నుంచి చమురు దిగుమతుల కారణంగా భారత్‌పై విధించిన 25 శాతం అదనపు శిక్షార్హత సుంకాలను తొలగించాలని అమెరికా నిర్ణయించడం ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసి అమెరికా, వెనెజువెలా నుంచి దిగుమతులు పెంచుకోవడానికి భారత్ మొగ్గు చూపడం వల్ల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల్లో భారత్ తన తటస్థ వైఖరిని మరింత స్పష్టం చేసినట్లయింది. ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం వంటి రంగాల్లో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకోవాలన్న భారత నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట.

ఆర్థిక ప్రయోజనాలు.. ఎగుమతుల జోరు

భారతీయ ఎగుమతిదారులకు, ముఖ్యంగా చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు ఈ నిర్ణయం సంజీవని వంటిది. సుంకాలు 18 శాతానికి తగ్గడంతో అమెరికా మార్కెట్లో భారతీయ వస్త్రాలు, ఔషధాల ధరలు తగ్గి, పోటీతత్వం పెరుగుతుంది. సముద్ర ఉత్పత్తులు వంటి రంగాల్లో ఎగుమతులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. సుంకాల గందరగోళం తొలగిపోవడంతో అమెరికా కంపెనీలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తాయి.

మోదీ - ట్రంప్ దౌత్యం

"మోదీ నా గొప్ప స్నేహితుడు" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల నేతల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం దేశ ప్రయోజనాలకు ఎలా దోహదపడుతుందో నిరూపిస్తున్నాయి. అయితే మోదీ ఈ ఒప్పందాన్ని కేవలం వాణిజ్య పరంగానే కాకుండా, ప్రపంచ శాంతి , స్థిరత్వానికి చిహ్నంగా అభివర్ణించడం ఆయన దార్శనికతకు అద్దం పడుతోంది. మోదీ–ట్రంప్‌ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగినట్లు భారత్‌లో అమెరికా రాయబారి కూడా ధ్రువీకరించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటనకు ముందే ఈ ప్రకటన రావడం గమనార్హం.

భారత్-అమెరికా మధ్య నెలకొన్న ఈ 'గ్రీన్‌సిగ్నల్' ప్రపంచ వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చనుంది. చైనాపై ఆధారపడటం తగ్గించాలనుకుంటున్న అమెరికాకు, అగ్రరాజ్యంతో సమానస్థాయిలో వాణిజ్యం చేయాలనుకుంటున్న భారత్‌కు ఇది పరస్పర ప్రయోజనకారి ఒప్పందం. ఈ ఒప్పందంలోని నిబంధనలు అమలులోకి వస్తే, 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం సుసాధ్యం కానుంది.




 


Tags:    

Similar News