అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..
| ఒకవేళ ప్రిడిక్షన్ మార్కెట్ అంచనాలు నిజమై.. డెమోక్రాట్లు సెనేట్‌లో స్పష్టమైన మెజారిటీ సాధిస్తే.. అది అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తీవ్రమైన రాజకీయ ముప్పుగా పరిణమించనుంది.
అమెరికాలో డెమోక్రాట్ల దూకుడు చూస్తుంటే... అధ్యక్షుడి కుర్చీ కంటే ముందే ‘సెనేట్’ సింహాసనమే ట్రంప్‌కు చుక్కలు చూపించేలా ఉంది. ఈరోజు జరుగుతున్న ఎన్నికల ముందే ప్రిడిక్షన్ మార్కెట్లు ఇస్తున్న ‘75% షాక్’తో వైట్ హౌస్‌లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం పీక్స్‌కి చేరింది. దీంతో అమెరికా రాజకీయ యవనికపై అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. ఈరోజు జరుగుతున్న అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ లో దేశ అత్యున్నత చట్టసభ అయిన 'సెనేట్'ను కైవసం చేసుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. తాజా ప్రిడిక్షన్ మార్కెట్ అంచనాలు.. అంతర్జాతీయ రాజకీయ విశ్లేషణల ప్రకారం.. ఈసారి సెనేట్‌లో డెమోక్రాట్లు మెజారిటీ సాధించే అవకాశాలు ఏకంగా 75 శాతానికి చేరుకున్నాయి. దీనికి భిన్నంగా అధికార రిపబ్లికన్ పార్టీ విజయావకాశాలు కేవలం 25 శాతానికే పరిమితం కావడం వాషింగ్టన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
అమెరికా పాలనా యంత్రాంగంలో సెనేట్‌కు అత్యంత కీలకమైన స్థానం ఉంది. అధ్యక్షుడి ప్రతిపాదనలు.. ఫెడరల్ న్యాయమూర్తుల నియామకాలు.. విదేశీ ఒప్పందాలు.. కీలక బిల్లుల ఆమోదంలో సెనేట్ పట్టు సాధించడం ప్రాథమిక అవసరం. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 53-47 స్థానాల ఆధిక్యం ఉన్నప్పటికీ.. ఈసారి పరిస్థితి తలకిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, మిషిగన్, మైన్, ఒహియో, అయోవా, కాన్సాస్, సౌత్ కరోలినా వంటి కీలక రాష్ట్రాల్లో రసవత్తర పోరు జరుగుతోంది. ఈ స్వైప్ స్టేట్స్‌లో డెమోక్రాట్ అభ్యర్థులు సాధిస్తున్న ఆదరణ రిపబ్లికన్ల విజయావకాశాలను దెబ్బతీస్తోంది.
ఒకవేళ ప్రిడిక్షన్ మార్కెట్ అంచనాలు నిజమై.. డెమోక్రాట్లు సెనేట్‌లో స్పష్టమైన మెజారిటీ సాధిస్తే.. అది అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తీవ్రమైన రాజకీయ ముప్పుగా పరిణమించనుంది. వైట్ హౌస్ ఆమోదించాలనుకునే పలు కీలక చట్టాలు, ఆర్థిక విధానాలు, నియామకాలకు సెనేట్ వేదికగా తీవ్ర ప్రతిబంధకాలు ఎదురవుతాయి. అంతేకాకుండా ప్రభుత్వంపై కాంగ్రెస్ పర్యవేక్షణ, విచారణలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. ఇది ట్రంప్ మిగిలిన పదవీకాలంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ప్రిడిక్షన్ మార్కెట్లు డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇవి కేవలం ముందస్తు అంచనాలు మాత్రమే. ఓటింగ్ సరళి, పోలింగ్ శాతం, చివరి నిమిషంలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలు తుది ఫలితాన్ని మార్చగలవు.
ఈ మధ్యంతర ఎన్నికలు ట్రంప్ పాలనా తీరుకు ఒక పరీక్షగా మారడమే కాకుండా రాబోయే రోజుల్లో అమెరికా రాజకీయాల దిశానిర్దేశాన్ని మార్చే కీలక ఘట్టంగా నిలవనున్నాయి.