దేశీయ మార్కెట్ లో దూసుకెళుతున్న యాపిల్
స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లలో.. కాస్త అప్ గ్రేడ్ అవ్వాలన్న ఆలోచన మదిలోకి వచ్చినంతనే కనిపించే ఆప్షన్ యాపిల్ (ఐఫోన్) మాత్రమే.;
స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లలో.. కాస్త అప్ గ్రేడ్ అవ్వాలన్న ఆలోచన మదిలోకి వచ్చినంతనే కనిపించే ఆప్షన్ యాపిల్ (ఐఫోన్) మాత్రమే. ఈ మాటకు బలం చేకూరేలా తాజాగా విడుదలైన నివేదికలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్న విషయాన్ని కౌంటర్ పాయిట్ రీసెర్చ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది. దేశీయ మార్కెట్ లో యాపిల్ వాటా గణనీయంగా పెరగటమే కాదు.. ప్రీమియం స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా పేర్కొంది.
స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు విలువ పరంగా చూస్తే.. భారతదేశంలో 2024లో యాపిల్ వాటా 23 శాతంగా ఉండేది. 2025 చివరి నాటికి అది కాస్తా ఏకంగా 28 శాతానికి చేరుకున్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. యాపిల్ మార్కెట్ వాటా పెరగటంలో ఐఫోన్ 16 కీలక భూమిక పోషించినట్లుగా గుర్తించారు. 2025లో అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా ఐఫోన్ 16 నిలిచింది. దీనికి తోడు ఫెస్టివల్ ప్రమోషన్లు.. ఫైనాన్స్.. వాయిదాల్లో చెల్లించే విధానం కూడా యాపిల్ ను అగ్రస్థానంలో నిలబెట్టినట్లుగా పేర్కొంటున్నారు.
2025లో దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 1 శాతం పెరిగితే.. విలువ పరంగా 8 శాతం పెరిగినట్లుగా రిపోర్టు వెల్లడించింది. దేశంలో ప్రీమియం సెగ్మెంట్ లో మూడింట రెండొంతుల కొనుగోళ్లు ఫైనాన్స్ ద్వారానే జరుగుతున్నట్లుగా గుర్తించారు ప్రీమియం ఫోన్లకు అప్ గ్రేడ్ అయ్యేందుకు వాయిదాల పద్దతిలో చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే యాపిల్ అగ్రస్థానంలో ఉంటే.. ఫోల్డబుల్ ఫోన్ సెగ్మెంట్ లో శాంసంగ్ సంఖ్యాపరంగా 88 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్లుగా తేల్చారు. ఇదిలా ఉంటే మోటరోలా వేగంగా పెరుగుతున్న బ్రాండ్ గా నిలిచింది.