విండోస్ 10 వాడుతున్నారా? మీకు ఈ మెసేజ్ వచ్చిందా?

ఇలాంటి వేళ విండోస్ 10 ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)ను వాడుతుంటే ఏం చేయాలి? ఒక వేళ అప్డేట్ కాకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? లాంటి అంశాల్లోకి వెళితే..;

Update: 2025-10-03 04:44 GMT

డెస్కు టాప్.. ల్యాప్ టాప్.. సిస్టం ఏదైనా కావొచ్చు. మీరు విండోస్ 10 వినియోగిస్తున్నారా? మీ సిస్టంను ఓపెన్ చేసినంతనే ఒక అలెర్టు వచ్చిందా? ఒకవేళ రాకున్నా.. విండోస్ 10 వాడే వారంతా ఒక అంశంపై అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అదేమంటే.. విండోస్ 10 వాడుతున్న వారందరికి తన సపోర్టును నిలిపివేయనుంది మైక్రోసాఫ్ట్. అందుకు తుది గడువు ఈ నెల 14 వరకే. ఆ తర్వాత నుంచి ఎలాంటి సెక్యూరిటీ అప్ డేట్స్ విడుదల చేయమని స్పష్టం చేస్తోంది. ఇలాంటి వేళ విండోస్ 10 ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)ను వాడుతుంటే ఏం చేయాలి? ఒక వేళ అప్డేట్ కాకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? లాంటి అంశాల్లోకి వెళితే..

ఏమిటీ అప్డేట్..? ఎందుకు?

రెండేళ్ల క్రితమే మైక్రోసాఫ్ట్ విండోస్ 10 మీద ఒక అలెర్టు ఇచ్చింది. దాని సారాంశం.. రానున్న రోజుల్లో విండోస్ 10 సపోర్టును తాము నిలిపివేస్తామని. గడువు ముగిసిన తర్వాత నుంచి విండోస్ 10 పని చేయదా? అంటే.. కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకుంటే.. మైక్రోసాఫ్ట్ తన సపోర్టును నిలిపి వేసినా..ఎప్పటిలానే ఓఎస్ పని చేస్తుంది. కాకుంటే.. సెక్యూరిటీ అప్ డేట్స్ రావు.

అప్పుడేం జరుగుతుంది?

ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో వచ్చి పడే మాల్ వేర్ ప్రభావానికి గురి కాకుండా ఓఎస్ ను అప్డేట్ చేసే మైక్రోసాఫ్ట్.. అక్టోబరు 14 తర్వాత నుంచి అప్డేట్ ఇవ్వదు.దీని కారణంగా సెక్యూరిటీపరమైన రిస్కులు.. మాల్ వేర్.. కంపాటబిలిటీ లాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్ లైన్ బ్రౌజింగ్ చేయనోళ్లు అనేటోళ్లు ఉండరు. ఇలాంటి వారందరికి రిస్కు పొంచి ఉంటుంది.

సెక్యూరిటీ అప్డేట్ ఆపేసినా..?

అక్టోబరు 14 నుంచి భద్రతాపరమైన అప్డేట్స్ ఆపేస్తామని మైక్రోసాఫ్ట్ చెప్పినప్పటికి సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అప్ డేట్స్ మాత్రం 2028 అక్టోబరు వరకు కంటిన్యూ చేస్తుంది. అయితే.. ఇది అందించే సెక్యూరిటీ ప్రాథమిక స్థాయిలోనే ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ అప్ డేట్స్ తో పోలిస్తే యాంటీ వైరస్ లు ఇచ్చే భద్రతఅంతంత మాత్రమే.

మరిప్పుడు ఏం చేయాలి?

పూర్తిస్థాయిలో భద్రత కోరుకునే వారు.. అనవసరమైన రిస్కు వద్దనుకునేవారు ఎక్సటెండెడ్ సెక్యూరిటీ అప్ డేట్స్ ప్రోగ్రామ్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.అయితే.. ఇది ఏ మాత్రం ఉచితం కాదు. కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 2025 అక్టోబరు 15 నుంచి డివైజ్ సెట్టింగ్స్ లో సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ అసలు లక్ష్యమిదేనా?

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను లక్షలాది మంది వినియోగిస్తున్నారు. వారందరిని విండోస్ 11కు అప్ గ్రేడ్ అయ్యేలా చూడాలన్నదే మైక్రోసాఫ్ట్ లక్ష్యం. అందుకే.. విండోస్ 11కు అప్ గ్రేడ్ కాకుంటే సెక్యూరిటీ ఆప్ డేట్స్ ఆపేస్తానని చెబుతోంది. ఇలాంటివేళ విండోస్ 10 మీదనే కంటిన్యూ అవుతామని డిసైడ్ అయితే.. డబ్బులు పెట్టి ఎక్స్ టెండెడ్ సెక్యూరిటీ అప్ డేట్స్ ప్రోగ్రామ్ కింద చందా తీసుకోవాల్సిందే.

పరిమితులు ఏమైనా ఉన్నాయా?

విండోస్ 11కు అప్ గ్రేడ్ కాకుండా.. విండోస్ 10లోనే కంటిన్యూ అవుతూ.. చందా తీసుకుంటే పరిస్థితేంటి? దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? అంటే.. ఉన్నాయనే చెప్పాలి. ఎక్స్ టెండెడ్ సెక్యూరిటీ అప్ డేట్స్ ప్రోగ్రాం కింద కొత్త ఫీచర్లు ఏమీ రావు. డిజైన్ మార్పిడి రిక్వెస్టులు.. నాన్ సెక్యూరిటీ రిక్వెస్టులు కానీ అందించదు. సో.. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ముందు ఉన్న దారులు రెండే.. ఒకటి విండోస్ 11కు అప్ గ్రేడ్ కావటం. రెండోది.. విండోస్ 10లో కంటిన్యూ అవుతూ చందా కట్టి కొన్ని పరిమితులతో సిస్టంను రన్ చేసుకోవటం. ఏదైనా అక్టోబరు 14కు ముందే నిర్ణయం తీసుకోవటం మాత్రం చాలా ముఖ్యం.

Tags:    

Similar News