మోడీ మంత్రి వర్గంలోకి జనసేన...ఎవరికి చాన్స్ ?
కేంద్రంలో నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అన్నీ కుదిరితే తొందరలోనే మంత్రి వర్గాన్ని విస్తరించాలని ప్రధాని చూస్తున్నారు అని వార్తలు వస్తున్నారు.;
కేంద్రంలో నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అన్నీ కుదిరితే తొందరలోనే మంత్రి వర్గాన్ని విస్తరించాలని ప్రధాని చూస్తున్నారు అని వార్తలు వస్తున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం గా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారు. ఆయన వెయిటింగ్ సెంట్రల్ మినిస్టర్ గా ప్రచారంలో ఉంది. ఇక ఏపీ నుంచి కూడా కేంద్ర మంత్రివర్గంలో మరో బెర్త్ కన్ ఫర్మ్ అవుతుందని అంటున్నారు. ఆ చాన్స్ కచ్చితంగా జనసేనకే అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
ముగ్గురు కేంద్ర మంత్రులు :
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. అందులో రెండు టీడీపీకి ఉన్నాయి. టీడీపీకి ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. మరో సహాయ మంత్రి పదవి బీజేపీకి ఇచ్చారు. ఇక కూటమిలో కీలక మిత్రుడుగా ఉన్న జనసేనకు ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది అని అంటున్నారు. 2024 జూన్ 9న ఏర్పాటు అయిన మోడీ మంత్రివర్గంలో దాదాపుగా మిత్రులు అందరికీ కేంద్ర బెర్తులు దక్కాయి. ఒక ఎంపీ ఉన్న వారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు. అలాంటిది జనసేనకు మొదటి విడతలోనే ఇవ్వాలి. కానీ జనసేన అప్పుడు కోరుకోలేదని చెబుతారు. అయితే ఈసారి మాత్రం జనసేనకు కేంద్ర మంత్రి పదవి పక్కా అని వార్తలు వస్తున్నాయి.
ఎవరా లక్కీ మినిస్టర్ :
ఇక జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మచిలీ పట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఒకరు, ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు, పైగా అనుభవం ఉంది. దాంతో ఆయనకు చాన్స్ ఇస్తారా అన్న చర్చ అయితే బాగా వస్తోంది. ఇక జనసేనకు చెందిన మరో ఎంపీ కాకినాడ నుంచి గెలిచిన ఉదయ్ శ్రీనివాస్. ఆయన తొలిసారి గెలిచారు. అయితే ఇవ్వాలని అనుకుంటే ఆయనకు కూడా చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. ఈ ఇద్దరూ కాకుండా జనసేనకు జూన్ లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు కచ్చితంగా దక్కబోతోంది. దాంతో రాజ్యసభ ద్వారా జనసేన ఎంపీగా ఎవరు వస్తారు అన్నది అయితే తెలియదు. కానీ ప్రచారంలో ఉన్న పేరు అయితే లింగమనేని రమేష్ అని అంటున్నారు. ఒకవేళ ఆయన అయితే ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవికి అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు.
టీడీపీ కూడా రేసులో :
ఇక ఏపీలో రెండు కేంద్ర మంత్రి పదవులు ఉన్న టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. ఈసారి కనుక చాన్స్ ఇస్తే దానిని సామాజిక ప్రాంతీయ కోణంలో నుంచి ఆలోచించి రాయలసీమకు ఇస్తారు అని అంటున్నారు. అలాగే మహిళా ఎంపీకి ఈ పదవి దక్కే చాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏపీ నుంచి మిత్రులకు 18 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పటికి మూడు మంత్రి పదవులు ఇచ్చారు జనసేనకు ఇస్తే నాలుగు కేంద్ర మంత్రి పదవులు అవుతాయి. అలా కాకుండా అయిదవ కేంద్ర మంత్రి పదవి ఇస్తారా అన్నది అయితే ఒక చర్చ. చూడాలి మరి కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో.
కాబోయే మంత్రిగా :
ఇక ఏపీ రాజకీయాలు తీసుకుంటే రెండేళ్ళ తరువాత కచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా మంత్రి వర్గాన్ని విస్తరిస్తుంది అని అంటున్నారు. దాంతో బీజేపీకి ఈసారి తప్పనిసరిగా రెండవ బెర్త్ దక్కుతుంది అని అంటున్నారు. ఈ లెక్క తీసుకుంటే బీజేపీ సీనియర్ నేత మాజీ ఏపీ ప్రెసిడెంట్ అయిన సోము వీర్రాజు పేరు బలంగా వినిపిస్తోంది. సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారు, కేంద్ర పెద్దలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆయన 2015 నుంచి 2021 దేఅకా తొలిసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇపుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఇంతటి సీనియారిటీ ఉన్నా అధికార వైభోగాలు అయితే ఏనాడూ ఆయనకు దక్కలేదు,
ఫైర్ బ్రాండ్ లీడర్ గా :
దాంతో సామాజిక ప్రాంతీయ సమీకరణలు అన్నీ కుదురుతున్న వేళ బీజేపీ ఆర్ఎస్ఎస్ పెద్దల ఆసీస్సులు ఉన్న క్రమంలో సోము వీర్రాజుకు మంత్రి పదవి దక్కడం ఖాయమని అంటున్నారు. బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న సోముకు కనుక పదవి ఇస్తే కూటమిని మరింత గట్టిగా వెనకేసుకుని వచ్చే మంచి మిత్రుడు దొరుకుతారు అని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే రానున్న కాలంలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో అటు జనసేనకు కేంద్రంలో చాన్స్ వస్తే ఇటు ఏపీలో సోము వీర్రాజు మంత్రి అవుతారు అని గట్టిగా వినిపిస్తున్న మాటగా ఉంది.