రాడార్‌లకు చిక్కని మిస్సైల్ దాడి.. ‘బ్లూ స్పారో’తోనే ఖమేనీ అంతం.. ఆ క్షిపణి కథ ఇదీ
సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ఈ దాడి మిడిల్ ఈస్ట్ యుద్ధ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఇరాన్ ను యుద్ధంలోకి దించింది.;
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘బ్లూ స్పారో’ మిస్సైల్‌తో జరిగిన దాడిలో ఖమేనీ మృతి చెందినట్లు అంతర్జాతీయ భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ఈ దాడి మిడిల్ ఈస్ట్ యుద్ధ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఇరాన్ ను యుద్ధంలోకి దించింది.
అమెరికా–ఇజ్రాయెల్ వ్యూహాత్మక సహకారంతో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఖమేనీ కదలికలను చాలా కాలంగా నిఘా సంస్థలు గమనిస్తున్నట్లు సమాచారం. ఖమేనీ నివాస సముదాయం, భద్రతా వ్యవస్థలు, రక్షణ ఏర్పాట్లు వంటి వివరాలను మోసాద్, సీఐఏ, ఇజ్రాయెల్ సైబర్ యూనిట్ 8200 వంటి సంస్థలు దీర్ఘకాలంగా విశ్లేషించాయి. చివరకు సరైన సమయం కోసం ఎదురుచూసి భారీ దాడికి రూపకల్పన చేశాయి.
బ్లూ స్పారో ప్రయోగం
ఫిబ్రవరి 28 ఉదయం జరిగిన ఈ దాడిలో ఇజ్రాయెల్ యుద్ధవిమానాల నుంచి ‘బ్లూ స్పారో’ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు సమాచారం. దాదాపు 1900 నుంచి 2000 కిలోల బరువు ఉన్న ఈ మిస్సైల్ సుమారు 2000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను చేరుకోగలదు. సాధారణ బాలిస్టిక్ మిస్సైళ్లలా నేరుగా ప్రయాణించకుండా, ఇది ముందుగా వాయుమండల అంచులకు చేరి అక్కడి నుంచి అత్యంత వేగంతో లక్ష్యంపైకి నిటారుగా దూసుకొస్తుంది.
ఈ మిస్సైల్ హైపర్‌సోనిక్ వేగం (మాక్–5కు పైగా)తో దూసుకొచ్చే కారణంగా రాడార్ వ్యవస్థలు గుర్తించేలోపే లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. మొదటగా ఇది ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థలను పరీక్షించేందుకు రూపొందించబడింది. అయితే ప్రస్తుతం దీనిని దాడి ఆయుధంగా కూడా వినియోగిస్తున్నట్లు భద్రతా నిపుణులు చెబుతున్నారు.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ
ఈ దాడిని “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో అమలు చేసినట్లు సమాచారం. దాడి సమయంలో ఒకేసారి 30కి పైగా మిస్సైళ్లు ప్రయోగించబడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. బ్లూ స్పారోతో పాటు బ్లాక్ స్పారో, రాంపేజ్ వంటి ఇతర ఆయుధాలు కూడా వినియోగించినట్లు తెలుస్తోంది. ముందుగా సైబర్ దాడుల ద్వారా ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీశారని సమాచారం.
దాడి సమయంలో ఖమేనీ నివాస సముదాయంలోని భూగర్భ బంకర్‌లు కూడా ధ్వంసమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కీలక భద్రతా అధికారులు కూడా మరణించినట్లు సమాచారం.
ఇరాన్ రక్షణ వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయి?
ఇరాన్ వద్ద ఉన్న ఎస్–300, బుక్ వంటి రక్షణ వ్యవస్థలు ఈ దాడిని అడ్డుకోలేకపోయాయి. ఎందుకంటే బ్లూ స్పారో మిస్సైల్ సాధారణ మార్గంలో కాకుండా అంతరిక్ష సరిహద్దు వరకు వెళ్లి అక్కడి నుంచి నిటారుగా దూసుకొస్తుంది. ఈ ట్రాజెక్టరీ కారణంగా రాడార్ వ్యవస్థలు దాన్ని సమయానికి గుర్తించలేకపోయాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
అదే సమయంలో ముందస్తు దాడుల్లో ఇరాన్ రాడార్ స్టేషన్లు, కమాండ్ సెంటర్లు దెబ్బతిన్నాయని కూడా సమాచారం. దీంతో రక్షణ వ్యవస్థలు పూర్తిగా స్పందించేలోపే ప్రధాన లక్ష్యం ధ్వంసమైంది.
మిడిల్ ఈస్ట్‌లో కొత్త ఉద్రిక్తతలు
ఖమేనీ మరణంతో ఇరాన్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాపదినాలు ప్రకటించినట్లు సమాచారం. మరోవైపు ప్రతీకార దాడులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఇరాన్ మిస్సైల్ దాడులు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఘటనతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతరిక్ష సరిహద్దు నుంచి దాడి చేసే ఈ తరహా సాంకేతికత భవిష్యత్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించవచ్చని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.