స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు దెబ్బేయనున్న ‘మెమొరీ’

ఇటీవల కాలంలో అనిశ్చితి అంతకంతకూ పెరిగిపోతోంది. ఏవైపు నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందన్నది అర్థం కానట్లుగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.;

Update: 2026-01-15 12:30 GMT

ఇటీవల కాలంలో అనిశ్చితి అంతకంతకూ పెరిగిపోతోంది. ఏవైపు నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందన్నది అర్థం కానట్లుగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అంతా సవ్యంగా ఉందని భావించేలోపే.. అనూహ్య పరిణామాలు తెర మీదకు రావటం.. పిడుగు లాంటి నిర్ణయాలు జనాల మీద పడటం మామూలైంది. 2020లో అనూహ్య రీతిలో విరుచుకుపడిన కరోనా.. ప్రపంచ గమనాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో తెలిసిందే. ఆ సమయానికి స్టార్ట్ ఫోన్ ధరలు అందరికి అందుబాటులోకి వస్తున్నట్లే వచ్చి.. కరోనా పరిణామాలతో ధరలు పెరిగిపోవటం తెలిసిందే. తాజాగా అలాంటి కష్టం మరోసారి రిపీట్ కానుంది.

ఇటీవల కాలంలో పెరిగిన ఏఐతో.. అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో ఊహించని సమస్యను తీసుకొచ్చింది. అదేమంటే.. ఏఐ టెక్నాలజీకి భారీగా మెమొరీ చిప్ ల అవసరం వచ్చి పడింది. దీంతో.. టెక్ కంపెనీలకు భారీగా మెమొరీ చిప్ ల అవసరం వచ్చి పడింది. అనుకున్నంతనే మెమొరీ చిప్ ఉత్పత్తి పెరిగే వీల్లేదు. క్రమపద్దతిలోనే వీటి ఉత్పత్తిని పెంచే పరిస్థితి. దీంతో.. మెమొరీ కార్డులకు భారీ డిమాండ్ మొదలైంది. దీంతో.. వీటి ధరలకు రెక్కలు వచ్చాయి.

ఇదిప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి స్మార్ట్ ఫోన్లు వాడే వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టే పరిస్థితి. అదెలా అంటే.. స్మార్ట్ ఫోన్లకు వినియోగించే మెమొరీ కార్డులు గతంలో మాదిరి కాకుండా.. వాటికి పెరిగిన డిమాండ్ తో ధరలు పెరిగాయి. ఆ భారం చివరకు వినియోగదారుల మీద పడనుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని నథింగ్ సీఈవో కార్ల్ పై తన సుదీర్ఘ పోస్టులో వివరించారు. ఆయన పోస్టును చదివితే స్మార్ట్ ఫోన్ల ధరలు ఎంత భారీగా పెరగనున్నాయి? అన్న అంశంపై క్లారిటీ వస్తుందని చెప్పాలి.

ఇంతకూ ఆయన ఏమన్నారంటే..

- గడిచిన పదిహేనేళ్లగా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో ఒకే ట్రెండ్ సాగుతూ వచ్చింది. మెమొరీ.. డిస్ ప్లే ధరలు ఏ ఏడాదికేడాది తగ్గుతుండటంతో ధరలు పెరగకుండానే మెరుగైన స్పెసిఫికేషన్ తో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి.

- ఈ కొత్త సంవత్సరం నుంచి అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. మెమొరీ ధరలు ఊహించని విధంగా పెరిగాయి. ఏఐ కంపెనీల నుంచి అనుకోని పోటీ ఎదురైంది. వాటి అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి లేదు. దీంతో.. స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే చిప్స్ కు డిమాండ్ ఏర్పడింది.

- మెమొరీ చిప్ లు ఉత్పత్తి చేసే కంపెనీలతో దీర్ఘకాలిక ఒప్పందాల్ని టెక్ కంపెనీలు కుదుర్చుకున్నాయి. ఫలితంగా మెమొరీ చిప్ ధరలు గత ఏడాది కంటే మూడు రెట్లు పెరిగాయి. ఇది స్మార్ట్ ఫోన్ తయారీదారులకు పెద్ద సవాలు. దీంతో ధరలు పెంచాలా? స్పెసిఫికేషన్స్ తగ్గించాలా? అన్న అంశంపై చర్చ సాగుతోంది.

- తాజా పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ ధరల్ని 30 శాతం మేర పెంచే వీలుంది. అంతకంటే ఎక్కువగా పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ధరలు పెంచకూడదని కంపెనీలు భావిస్తే.. స్పెసిఫికేషన్స్ తగ్గించటం ఖాయం. దీని కారణంగా బడ్జెట్.. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.

Tags:    

Similar News