టీవీ కొనాలన్న ప్లాన్ ఉంటే కొత్త ఏడాదికి ముందే కొనేయాలా?
మరో రెండు వారాలు మాత్రమే. కొత్త ఏడాదిలో అడుగు పెట్టేందుకు. కొత్త సంవత్సరం వస్తుందంటేనే.. ఆదో ఆనందంతో పాటు.. మరింత ఎక్సైట్ మెంట్ మామూలే.;
మరో రెండు వారాలు మాత్రమే. కొత్త ఏడాదిలో అడుగు పెట్టేందుకు. కొత్త సంవత్సరం వస్తుందంటేనే.. ఆదో ఆనందంతో పాటు.. మరింత ఎక్సైట్ మెంట్ మామూలే. వీటిని పక్కన పెడితే.. కొన్ని చికాకులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు చెప్పేది ఆ కోవకు చెందిందే. కొత్త సంవత్సరంలో టీవీల ధరలు పెరనున్నట్లుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు ఇటీవలకాలంలో చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావిస్తున్నారు.
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం.. మెమరీ చిప్ ల కొరత లాంటి అంశాలతో టీవీల ధరలకు రెక్కలు ఖాయమంటున్నారు. 2026 జనవరి నుంచి టీవీల ధరలు మూడు నుంచి నాలుగు శాతం వరకు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.90ను దాటేయటం తెలిసిందే. మరో వైపు టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్.. సెమీ కండక్టర్ చిప్ లు.. మదర్ బోర్డులు లాంటివి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ధరల భారం పడనుంది.
దీనికి తోడు ఏఐ సర్వర్లకు హై బ్యాండ్ విడ్త్ మెమరీ చిప్ ల డిమాండ్ భారీగా ఉంది. దీంతో తయారీదారులు ఆ తరహా చిప్ తయారీపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీనికి కారణం.. అధిక లాభాల్నిఅందించటమే. దీంతో.. టీవీల తయారీలో ఉపయోగించే లెగసీ డివైస్ల సరఫరా తగ్గినట్లుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రభావం టీవీల ధరల మీద పడుతుందని.. ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.
ఇప్పటికే టీవీల ధరల పెంపు అంశాన్ని తమ డీలర్లకు టీవీ కంపెనీ సమాచారం ఇస్తున్నాయి. గడిచిన మూడేళ్లలో మెమరీ చిప్ ల ధర 500 శాతం మేర పెరిగినట్లుగా థామ్సన్.. కోడక్ వంటి టీవీల తయారీ లైసెన్సు ఉన్న సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ఈ పరిణామాలతో కనిష్ఠంగా మూడు శాతం.. గరిష్ఠంగా 10 శాతం వరకు ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. రాబోయే ఆర్నెల్లలో చిప్ ల ధరల పెరుగుతూ ఉంటాయని.. దీని ప్రభావం టీవీ ధరల మీద ఉంటుందని చెబుతున్నారు. పలు బ్రాండ్ల టీవీలకు ఒరిజినల్ డిజైన్ తయారీదారుగా ఉన్న వీడియో టెక్స్ సైతం మెమరీ చిప్ ల లభ్యత తక్కువగా ఉందని.. దీని ప్రభావం టీవీల ధరల మీద కచ్ఛితంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కొత్త టీవీ ప్లానింగ్ ఉంటే.. కొత్త ఏడాదికి ముందే పూర్తి చేయటం మంచిదని చెప్పక తప్పదు.