ఆ విమ‌ర్శ‌లు చ‌ట్ట విరుద్ధం కాదు: తెలంగాణ స‌ర్కారుకు సుప్రీం

గ‌తంలో సీఎం రేవంత్ రెడ్డి స‌హా.. అధికార పార్టీకి చెందిన ప‌లువురు నాయ‌కుల‌పై కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ లు గుప్పించారు.;

Update: 2026-02-03 04:38 GMT

తెలంగాణ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు సూటి ప్ర‌శ్న సంధించింది. పౌరుల ప్రాధ‌మిక హ‌క్కుల‌ను హ‌రించేలా కేసులు ఎలా న‌మోదు చేస్తార‌ని ప్ర‌శ్నించింది. రాజ్యాంగం ప్ర‌సాదించిన ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ఎలా అడ్డుకుంటార‌ని నిల‌దీసింది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా కేసుల విష‌యంపై పోలీసులు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు.. రాజ‌కీయ విమ‌ర్శ‌లు చ‌ట్ట విరుద్ధం కూడా కాద‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం. ``రాజ‌కీయ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌కుండా ఉంటామ‌ని ప్ర‌భుత్వంలోని నాయ‌కులు చెప్ప‌గ‌ల‌రా?`` అని ప్ర‌శ్నించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

ఏం జ‌రిగింది?

గ‌తంలో సీఎం రేవంత్ రెడ్డి స‌హా.. అధికార పార్టీకి చెందిన ప‌లువురు నాయ‌కుల‌పై కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ లు గుప్పించారు. దీంతో ప‌లు జిల్లాల్లో పోలీసులు.. వారిపై కేసులు న‌మోదు చేశారు. అయితే.. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రిస్తు న్నారంటూ.. స‌ద‌రు వ్య‌క్తులు హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌మ‌పై న‌మోదైన కేసులను కొట్టివేయాల‌ని కోరారు. ఈ వ్య‌వ‌హారంపై సుదీర్ఘ విచార‌ణ జ‌రిపిన కోర్టు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు కూడా కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. వీటిలో ప్ర‌ధానంగా కేసుల న‌మోదును యాంత్రికంగా చేయ‌డానికి వీల్లేద‌ని తెలిపింది.

విచార‌ణ కూడా ఇష్టానుసారంగా చేయ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. అస‌లు కేసు న‌మోదుకు ముందే.. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌ను సంప్ర‌దించాల‌ని ఆదేశించింది. ఇలా అనేక మార్గ‌ద‌ర్శ‌కాల‌తో హైకోర్టు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో సోష‌ల్ మీడియాలో రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసేవారికి మ‌రింత అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు అయింది. అంతేకాదు.. హైకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు.. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను ఫార్వ‌ర్డ్ చేసినా ఎలాంటి కేసు పెట్ట‌డానికి వీల్లేదు. దీంతో ఆత్మ ర‌క్ష‌ణలో ప‌డిన రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం.. హైకోర్టు ఇచ్చిన మార్గ‌ద ర్శ‌కాల‌పై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

దీనిపై సోమ‌వారం సుదీర్ఘంగా విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌మ‌ర్థించింది. అంతేకాదు.. వాటిని మార్చాల్సిన అవ‌సరం లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 19, 20, 21లోని ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించిన కోర్టు.. పౌరులకు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టే హక్కు ఉంద‌ని.. రాజ్యాంగ ప‌ర‌మైన విమ‌ర్శ‌లు కూడా చ‌ట్ట‌బ‌ద్ద‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. తెలంగాణ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సైతం కొట్టి వేసింది.

Tags:    

Similar News