రియల్ లైఫ్ ‘బ్యాట్‌మ్యాన్’ హల్‌చల్.. 10 రోజుల్లో ఐదుగురు దొంగలకు చుక్కలు చూపించిన మిస్టరీ హీరో

సినిమాల్లో అన్యాయాన్ని ఎదిరించే సూపర్ హీరోలను చూసి మనం మురిసిపోతుంటాం. చట్టం తన పని తాను చేసుకుపోయే లోపే.. విలన్ల ఆటకట్టించే 'విజిలాంటీ' పాత్రలను స్క్రీన్‌పై చూసి చప్పట్లు కొడతాం.

Update: 2026-06-30 12:12 GMT

సినిమాల్లో అన్యాయాన్ని ఎదిరించే సూపర్ హీరోలను చూసి మనం మురిసిపోతుంటాం. చట్టం తన పని తాను చేసుకుపోయే లోపే.. విలన్ల ఆటకట్టించే 'విజిలాంటీ' పాత్రలను స్క్రీన్‌పై చూసి చప్పట్లు కొడతాం. కానీ సరిగ్గా అలాంటి సీనే ఇప్పుడు నిజ జీవితంలో రిపీట్ అయితే? అచ్చం ఇలాంటి సంచలన ఘటనే మెక్సికోలో చోటుచేసుకుంది. అక్కడ ఒక రహస్య వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు స్థానిక ప్రజల్లోనూ హాట్ టాపిక్‌గా మారాడు. అతడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు పేరు ఏమిటి? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. కానీ అతడు చేస్తున్న పనులు చూసి ప్రజలంతా అతడిని "మెక్సికో బ్యాట్‌మ్యాన్" అని పిలుస్తున్నారు. కేవలం పది రోజుల వ్యవధిలో ఐదుగురు బైక్ దొంగలను పట్టుకుని, వారికి వినూత్నంగా శిక్షలు వేస్తూ వార్తల్లో నిలిచాడు.

దొంగల ముఠాలకు సింహస్వప్నం

మెక్సికోలోని మొరెనో ప్రాంతంలో ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాల చోరీలు భారీగా పెరిగాయి. రోడ్లపై పార్క్ చేసిన బైక్‌లను అత్యంత చాకచక్యంగా దొంగిలించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నప్పటికీ గస్తీ పెంచినా దొంగలను పట్టుకోవడంలో పెద్దగా ఫలితం కనిపించలేదు.

ఇలాంటి క్లిష్ట సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి రంగంలోకి దిగాడు. హాలీవుడ్ క్యారెక్టర్ 'బ్యాట్‌మ్యాన్'ను తలపించే దుస్తులు ధరించి, రాత్రి వేళల్లో బైక్ దొంగలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం ప్రారంభించాడు. అయితే అతడు వారిని కేవలం పట్టుకోవడమే కాదు.. గట్టిగా బుద్ధి చెప్పి.. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలకు భారీ ప్లాస్టర్లు, టేపులతో కట్టేస్తున్నాడు. వారు దొంగిలించిన బైక్‌లను కూడా పక్కనే ఉంచి వారు చేసిన నేరాన్ని ప్రజలందరికీ బహిర్గతం చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో సెలబ్రిటీ.. పోలీసులకు తలనొప్పి

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కేవలం పది రోజుల్లోనే ఇలాంటి ఐదు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి ఘటనలోనూ దొంగలను కట్టేసిన పద్ధతి ఒకేలా ఉండటంతో ఇదంతా ఒకే వ్యక్తి చేస్తున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో కనిపెట్టడం వారి వల్ల కావడం లేదు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ రహస్య వ్యక్తికి భారీగా మద్దతు లభిస్తోంది. నెటిజన్లు అతడిని రియల్ హీరోగా కొనియాడుతున్నారు. "ప్రజల కోసం వచ్చిన నిజమైన రక్షకుడు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. దొంగల గుండెల్లో భయం పుట్టించడానికి ఇలాంటి విజిలాంటీలు అవసరమని మరికొందరు సమర్థిస్తున్నారు.

"నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం చట్ట ప్రకారం పోలీసుల బాధ్యత. ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మరో నేరంగా పరిగణించబడుతుంది. ఈ రహస్య వ్యక్తిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి" అని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

హీరోనా? విజిలాంటీనా?

ప్రస్తుతం మెక్సికోలో ఈ "బ్యాట్‌మ్యాన్" కథ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అతడు నిజంగా ప్రజలకు సహాయం చేస్తున్న ఒక హీరోనా? లేక చట్టాన్ని అతిక్రమిస్తున్న విజిలాంటీనా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఈ మిస్టరీ హీరో సృష్టించిన భయంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో బైక్ దొంగతనాలు తగ్గుముఖం పట్టడం విశేషం!

Tags:    

Similar News