దళపతికి వరుస చిక్కులు.. తాజాగా మంత్రి వంతు!

అయితే ఈ సారి ముఖ్యమంత్రికి బదులుగా ఆయన మంత్రివర్గ సహచరుడు శరత్ కుమార్ విపక్షానికి టార్గెట్ అయ్యారని చెబుతున్నారు.

Update: 2026-06-30 12:04 GMT

దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. సినీ రంగంలో తనతో కలిసి పనిచేసిన వారికి ప్రభుత్వంలో పదవులు ఇస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి విజయ్ తాజాగా అంతకుమించిన సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సారి ముఖ్యమంత్రికి బదులుగా ఆయన మంత్రివర్గ సహచరుడు శరత్ కుమార్ విపక్షానికి టార్గెట్ అయ్యారని చెబుతున్నారు. మంత్రి శరత్ కుమార్ బహిరంగంగా డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపిస్తూ విపక్షం డీఎంకే ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. మంత్రి శరత్ కుమార్ కు ఆ పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని, ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ తాజా వివాదం ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

తమిళనాడు కేబినెట్ మంత్రిగా ఉన్న శరత్ కుమార్ ఒక పాత వీడియోతో రాజకీయ వివాదంలో చిక్కుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో, మంత్రి శరత్ కుమార్ ఫోన్ స్క్రీన్ పై తెల్లటి పొడిని ఉంచి, దానిని ఏటీఎం కార్డుతో మెత్తగా చేస్తున్నట్లున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పక్కనే 500 రూపాయల నోటు కూడా ఉండటంతో, ఆయన బహిరంగంగా మాదకద్రవ్యాలను వాడుతున్నారనే విపక్షాల విమర్శలకు బలం చేకూరిందని అంటున్నారు. అయితే ఈ దృశ్యాలు రెండేళ్ల క్రితం ఐపీఎల్ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

మంత్రి శరత్ కుమార్ వివరణ:

అయితే తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి శరత్ కుమార్ స్పందించారు. ఆ వీడియో సుమారు రెండు సంవత్సరాల క్రితం నాటిదని ఆయన స్పష్టం చేశారు. తన కుమార్తె అనారోగ్యంతో ఉందని, ఆమెకు మాత్ర మింగడం ఇబ్బందిగా ఉన్నందున, దానిని పొడి చేసి ఇచ్చానని వైరల్ వీడియోపై వివరణ ఇచ్చారు. తాను డ్రగ్స్ వాడుతున్నాననే ఆరోపణలు అవాస్తవమని, రాజకీయ దురుద్దేశంతోనే పాత వీడియోను వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏ విచారణకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు విపక్షం మాత్రం మంత్రి వాదనతో ఏకీభవించడం లేదు. మంత్రిపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన డీఎంకే గత రెండు రోజులుగా తమిళనాడులోని విరుదునగర్, మధురై, తూత్తుకుడి వంటి పలు ప్రాంతాల్లో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఈ పరిణామాలతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నదని అంటున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో మంత్రిపై ఇటువంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.

Tags:    

Similar News