లాస్ట్ డే కూడా నో రిలీఫ్.. 'క్యాట్'లోనూ పీ.వీ.సునీల్ కుమార్ కు చుక్కెదురు

మరోవైపు మంగళవారం సాయంత్రం పీవీ సునీల్ కుమార్ రిటైర్మెంట్ ను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2026-06-30 12:07 GMT

సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కెరీర్‌లో అత్యంత నిరాశాజనకంగా ముగిసింది. తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్‌లో ఉన్న ఆయన, సర్వీసులో చివరి రోజు కూడా ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించినప్పటికీ, అక్కడ ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. మంగళవారం జరిగిన విచారణలో ట్రిబ్యునల్ ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో సస్పెన్షన్ లో ఉండగానే ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సివచ్చిందని అంటున్నారు. మరోవైపు మంగళవారం సాయంత్రం పీవీ సునీల్ కుమార్ రిటైర్మెంట్ ను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1993 బ్యాచ్ కు చెందిన పీవీ సునీల్ కుమార్ ప్రస్తుతం డీజీ కేడర్ లో ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో పీవీ సునీల్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని, అనుమతి లేకుండా విదేశాలలో ప్రయాణించారని, అప్పటి ఎంపీ, ప్రస్తుత స్పీకర్ రఘురామరాజుపై కస్టడీలో దాడి చేయించారనే ఆరోపణలతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో ఆయన దాదాపు రెండేళ్లుగా ఎటువంటి బాధ్యతలు లేకుండా ఖాళీగానే ఉంటున్నారు. ఇక మంగళవారం ఆయన ఉద్యోగ విరమణ దృష్టిలో పెట్టుకుని అయినా పోస్టింగ్ ఇస్తారని భావించారు. సునీల్ కుమార్ సైతం తన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టులో పోరాటం చేశారు.

అయితే, సునీల్ కుమార్ పై మోపిన అభియోగాలు తీవ్రంగా ఉండటం, ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలించిన పరిపాలన ట్రిబ్యునల్ ఆయన పిటిషన్ ను తిరస్కరించిందని చెబుతున్నారు. క్యాట్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని ప్రభుత్వం చెప్పినా, సస్పెన్షన్ ఎత్తివేతపై కేట్ ఎటాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ లోనే ఉద్యోగ విరమణ చేయాల్సివచ్చిందని అంటున్నారు. ఫలితంగా ఆయన పదవీ విరమణ ప్రయోజనాలు అన్నీ పెండింగులో ఉండిపోయే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు పీవీ సునీల్ కుమార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను నిలుపుదల చేయాలని ఆయన భార్య అరుణ కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం సునీల్ కుమార్ నుంచి దూరంగా ఉంటున్న ఆమె తన జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని సునీల్ కుమార్ పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 2017లో సునీల్ కుమార్ పై ఆమె గృహ హింస కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. రిటైర్మెంటు రోజు నాడు ఆమె ఇచ్చిన షాక్ తో పాటు కేట్ లో సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ఎటువంటి తీర్పు రాకపోవడంతో సునీల్ కుమార్ చిల్లిగవ్వ కూడా తీసుకోకుండా రిటైర్ కావాల్సివచ్చిందని అంటున్నారు.

Tags:    

Similar News