మరో 10 శాతం ఇచ్చేద్దాం: డీలిమిటేషన్‌పై కేంద్రం
ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా అన్ని రాష్ట్రాలకూ.. ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల్లో 50 శాతం పెంచే స్తామని కేంద్రం చెబుతోంది.
పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం కేంద్రానికి గుదిబండలా మారింది. ఈ వ్యవహా రా న్ని ఏదో ఒకరకంగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే.. ఈ విషయంలో జనాభా లెక్కల వ్యవ హారం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తే.. తాము నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ పేర్కొంటున్నాయి. ఏపీ మాత్రమే దీనిని సమర్థిస్తోంది.
ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా అన్ని రాష్ట్రాలకూ.. ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల్లో 50 శాతం పెంచే స్తామని కేంద్రం చెబుతోంది. ఫలితంగా జనాభా లెక్కలతో సంబంధం ఉండదని అంటోంది. అంతేకాదు.. తద్వారా అన్ని రాష్ట్రాలకూ న్యాయం జరుగుతుందని అంటున్నారు. అయితే.. దీనిని కూడా.. దక్షిణాది రాష్ట్రాలు తప్పుబడుతున్నాయి. ఉదాహరణకు యూపీలో 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 50 శాతం పెంచితే.. 120కి పెరుగుతాయని.. తమకు తగ్గుతాయని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు మరిన్ని ఎక్కువ స్థానాలు ఇచ్చేలా చూడాలన్నది దక్షిణాది రాష్ట్రాల డిమాండ్. జనాభా నియంత్రణకు దక్షిణాది రాష్ట్రాలు ఎంతో కృషి చేశాయని కూడా అంటున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఎటూ తేలకపోగా.. గత పార్లమెంటు సమావేశాల్లో దీనికి ఉద్దేశించిన బిల్లులు వీగిపోయాయి. ఇక, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అయినా.. ఈ బిల్లును ఆమోదించుకోవాలని కేంద్రం పక్కాగా నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో 50 శాతం బదులుగా జనాభాను నియంత్రించిన రాష్ట్రాల్లో మరో 10 శాతం చొప్పున సీట్లను పెంచేందుకు ఉండే అవకాశంపై ఇప్పుడు అధ్యయనం చేస్తోంది. తద్వారా ఆయా రాష్ట్రాలను శాంతప రిచి అయినా వచ్చే 2029 ఎన్నికల నాటికి ఈ బిల్లును ఆమోదించుకుని అమలు చేయాలన్న సంకల్పం తో ఉంది. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు స్థానాల కంటే .. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు 60 శాతం చొప్పున పెంచాలని నిర్ణయించింది.
ఇదేసమయంలో, ఉత్తరాదిలోని జనాభా నియంత్రణ పాటించని రాష్ట్రాలకు 50 శాతం చొప్పున పెంచాలన్నది కేంద్రం భావన. అయితే.. దీనికి ఉన్న వెసులుబాట్లతోపాటు ఇబ్బందులపైనా అధ్యయనం చేసేందుకు అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినట్టు హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు ఏం తేలుస్తారో చూడాలి. త్వరలోనే వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆ సమయానికి ఈ బిల్లును ఆమోదించుకోవాలన్నది కేంద్రం భావన.