దేశంలో తొలిసారి సముద్రంలో ఎయిర్ పోర్టు.. ఎక్కడంటే?
ఇందుకు మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లా కోరే బీచ్ వేదిక కానుంది. దీనికి సంబంధించిన డీపీఆర్ సమర్పించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అధికారుల్ని ఆదేశించారు.
అవును.. ఇప్పుడు చెప్పే విమానాశ్రయం రోటీన్ కు భిన్నం. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈ తరహా ఎయిర్ పోర్టులు ఉన్నప్పటికి.. మన దేశంలో మాత్రం ఇదే తొలిసారి. ఇంతకూ ఆ ప్రత్యేకత ఏమంటారా? అక్కడికే వస్తున్నాం. దేశంలోనే తొలిసారి సముద్రంలో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లా కోరే బీచ్ వేదిక కానుంది. దీనికి సంబంధించిన డీపీఆర్ సమర్పించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అధికారుల్ని ఆదేశించారు.
సముద్రంలో ఎయిర్ పోర్టును ఎలా నిర్మిస్తారు? అదెలా సాధ్యం? టన్నుల బరువైన లోహ విహంగాన్ని సముద్రంలో ఎలా ల్యాండ్ చేస్తారన్న సందేహాలు రావొచ్చు. అదెలా సాధ్యమన్న విషయంలోకి వెళితే.. సముద్రంలో ఎయిర్ పోర్టు అంటే.. సముద్రంలో లోతు తక్కువగా ఉండే ప్రాంతాన్ని మట్టితో పూడ్చేస్తారు. దానిపైన ఎయిర్ పోర్టును నిర్మిస్తారు. ఈ తరహా ఎయిర్ పోర్టులు మన దేశంలో ఇదే మొదటిది. అయితే.. ఇప్పటికే జపాన్.. హాంకాంగ్.. దక్షిణ కొరియా దేశాల్లో ఈ తరహా విమానాశ్రయాలు తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నాయి.
ఈ విమానాశ్రయాల్లో మూడు వైపులా సముద్రం ఉండి.. ఒకవైపు మాత్రం ఎయిర్ పోర్టు ఉంటుందన్న మాట. దేశ ఆర్థిక రాజధాని ముంబయి లాంటి మహానగరంలో భూభాగం చాలా పరిమితం. ఈ నేపథ్యంలో ముంబయికి ఉత్తరాన 120 కి.మీ. దూరంలో ఉండే కోరే బీచ్ లో ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మించాలన్న ప్రతిపాదన ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.45 వేల కోట్లుగా చెబుతున్నారు.
ఈ ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా సముద్రంలోని కొంత భాగాన్ని పూడ్చేస్తారు. నిజానికి సముద్రాన్ని పూడ్చి.. కొత్త భూభాగాన్ని నిర్మించేందుకే దాదాపు పాతిక లక్షల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. మిగిలిన రూ.20వేల కోట్లతో ఎయిర్ పోర్టు మౌలిక సదుపాయాలు.. టర్నినళ్లు.. రన్ వేలు మొదలైనవి నిర్మిస్తారని చెబుతున్నారు. ఈ సరికొత్త ఎయిర్ పోర్టు ద్వారా ఏడాదిలో సుమారు 9 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. దీన్ని ఒక ప్రధానమైన ఎయిర్ కార్గో హబ్ గా రూపొందించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోని తొలి సముద్ర ఎయిర్ పోర్టు పూర్తైతే.. మహారాష్ట్ర రూపురేఖలు మారిపోతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఇది కార్యరూపం ఎప్పటికి దాలుస్తుందో చూడాలి.