ఏఐ బబుల్ పేలుతోందా? ఫోర్డ్ లో అదే జరిగిందా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలియాస్ కృత్రిమ మేధతో మనిషి స్థానాన్ని భర్తీ చేయనున్న వైనంపై ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల సంగతి తెలిసిందే.
కొత్త టెక్నాలజీ వచ్చేసింది. ఇంకేం.. మనుషులు అక్కర్లేదు. వారి స్థానంలో యంత్రాల్ని పెట్టేస్తే సరి. యంత్రుడ్నితయారు చేసిన మనిషికి గడ్డు పరిస్థితులు తలెత్తటం ఖాయమని.. మనిషి స్థానాన్ని అక్రమించే క్రమంలో ఏఐ ఒక అడుగుగా కొందరు విశ్లేషించటం తెలిసిందే. అయితే.. మనిషిని రీప్లేస్ చేసే సామర్థ్యం ఏ యంత్రానికి పూర్తిగా ఉండదన్న విషయాన్ని కొందరు బలంగా నమ్మే పరిస్థితి. ఇలాంటి వారి వాదన నిజమనే ఆసక్తికర అంశం తాజాగా వెలుగు చూసింది. గడిచిన కొంతకాలంగా ఎక్కడ చూసినా.. ఏ రంగాన్ని చూసినా.. ఏఐ.. ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలియాస్ కృత్రిమ మేధతో మనిషి స్థానాన్ని భర్తీ చేయనున్న వైనంపై ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల సంగతి తెలిసిందే.
అయితే.. ఇదంతా ఒక బబుల్ అని.. ఏఐ వాస్తవ కటౌట్ కు మించి హైప్ క్రియేట్ చేశారా? అన్న సందేహానికి బలం చేకూరే పరిణామాలు మొదలయ్యాయి. కొందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఏఐ పరిమితులు ప్రపంచానికి తెలిసే పరిస్థితి రానున్న ఆర్నెల్లలో మరింత బాగా అర్థమవుతాయని చెబుతున్నారు. తాజాగా ప్రముఖ వాహన సంస్థ ఫోర్డ్స్ ఈ విషయాన్ని తన నిర్ణయంతో చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.
ఏఐ వెంట అందరూ పరుగులు తీస్తున్న వేళ.. అప్పుడెప్పుడో యంత్రుడి సాయంతో మనిషికి ప్రత్యామ్నాయంగా పని చేయించటానికి ఫోర్డ్స్ సంస్థ ఏఐ ఆధారిత కెమెరాలను క్యాలిటీ ఎస్కూరెన్స్ విభాగంలో ఏర్పాటు చేసింది. దాదాపు 900 ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోకుండా పని పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో ఫోర్డ్స్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి కుమార్ గల్హోత్రా సైతం గొప్పగా ప్రకటించారు.
కట్ చేస్తే.. తాజాగా 300 మంది క్వాలిటీ ఇంజనీర్లను జాబ్ లోకి తీసుకున్న వైనాన్ని బ్లూమ్‌బెర్గ్ వార్తాసంస్థ కథనంతో వెలుగు చూసింది. చాలామంది వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ వెనక్కి నెట్టేస్తున్నట్లుగా చెప్పినప్పటికి.. ఏడాది కూడా పూర్తి కాక ముందే అసలు విషయాన్ని ఫోర్డ్ అర్థం చేసుకుంది. వాహనాల నాణ్యత తనిఖీ విషయంలో ఏఐ ఆధారిత కెమెరాల కంటే మనిషి చేసే నాణ్యత చెక్ అత్యంత మెరుగ్గా ఉన్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. ఇంతకాలం మనిషికి బదులుగా వాడిన ఏఐ కెమేరాల స్థానంలో తిరిగి క్వాలిటీ ఇంజినీర్లను హైర్ చేసుకుంది. పాత ఇంజనీర్లను నియమించుకున్నామని.. దాదాపు 350 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసినట్లుగా పేర్కొంది.
ఏఐ అద్భుతమే అయినప్పటికి.. దాని పని తీరు దానికి మనం ఇచ్చే శిక్షణకు తగ్గట్లు ఉంటుందని ఫోర్డ్స్ పెద్దలు చెబుతున్నారు. తమ సంస్థలో అత్యంత అనుభవజ్ఞులైన ఉద్యోగుల స్థానంలో నియమించిన ఏఐ ఆధారిత వ్యవస్థ ఆశించినంత స్థాయిలో పని చేయలేదని ఫోర్డ్ వెహికల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ ఉపాధ్యక్షుడు చార్లెస్ పూన్ వెల్లడించారు. అంతేకాదు ఆయన మరిన్ని ఆసక్తికర అంశాల్ని పేర్కొన్నారు. ఏఐను ప్రవేశపెట్టి.. తమకున్న డిజైన్ అవసరాలను ఇన్ పుట్ గా ఇస్తే అది అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తిని తయారుచేస్తుందని తాము తప్పుగా భావించిన వైనాన్ని అంగీకరించటం గమనార్హం.
ఏఐకు మరింత శిక్షణ ఇచ్చేందుకు.. దాని పని తీరు మరింత మెరుగుపర్చేందుకు అత్యంత అనుభవజ్ఞులైన నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పించాలన్న ఉద్దేశంతో పాత ఇంజినీర్లను.. వారికి తోడుగా కొంతమంది యువ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఫోర్డ్ విషయంలో జరిగింది.. రానున్న రోజుల్లో మరిన్ని రంగాల్లోని కంపెనీలకు ఇలాంటి అనుభవమే తయారైతే..ఏఐతో ఉద్యోగాలు పోయే ట్రెండ్ నుంచి కొత్త ఉద్యోగాలు వచ్చే కొత్త ట్రెండ్ షురు అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే.. కొత్త సాంకేతిక పని వేగాన్ని పెంచుతుంది. అయితే.. అందుకు మనిషి అవసరం తప్పక అవసరమన్న విషయం ఏఐ సైతం నిరూపించినట్లు అవుతుందని చెప్పక తప్పదు.