మున్సిపోల్స్ పై జగన్ సూపర్ స్పీడ్.. అందరికంటే ముందుగా అభ్యర్థుల ప్రకటన
మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్న విషయం క్లారిటీ లేకపోయినా, ప్రతిపక్షం వైసీపీ దూకుడు చూపుతోంది.
మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్న విషయం క్లారిటీ లేకపోయినా, ప్రతిపక్షం వైసీపీ దూకుడు చూపుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని ఇతర పార్టీలకన్నా ముందుగా అభ్యర్థుల ఖరారుపై దృష్టిపెట్టిందని అంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ నుంచి మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత జగన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. ఇందులో అనేక విషయాలపై చర్చించిన పార్టీ నేతలు అధికార కూటమిని దీటుగా ఎదుర్కొనేలా అభ్యర్థులు ఎంపిక ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపుతున్నట్లు మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్ రెడ్డి వెల్లడించారు.
అధినేత సమీక్షలు
రాష్ట్రంలో అక్టోబరు, నవంబరు నెలల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్న ప్రభుత్వం కోర్టు నిర్ణయం ఏవిధంగా ఉన్నా ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ నెలలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని మాజీ సీఎం జగన్మోహనరెడ్డి అంచనా వేస్తున్నారని అంటున్నారు. ఈ కారణంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ఆయన తాడేపల్లిలో వరుసగా జిల్లాల నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానికంగానే అభ్యర్థుల ఎంపిక చేసుకోవాలని స్వేచ్ఛ ఇచ్చిన అధినేత కొన్ని కీలక స్థానాల విషయంలో తానే స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారని అంటున్నారు.
తొలి అభ్యర్థి ఆనం
స్థానిక ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో పార్టీలు అప్రమత్తమయ్యాయి. సరైన అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ తొలి పేరు ప్రకటించింది. నెల్లూరు మేయర్ రేసులో ఆనం విజయ్ కుమార్ రెడ్డిని పోటీకి పెడుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. రిజర్వేషన్ ప్రక్రియపై స్పష్టత లేకపోయినా, అధికార పార్టీ నేతలు నెల్లూరు జనరల్ కేటగిరీలోకి వస్తుందన్న అంచనాతో అప్పుడే ప్రచారం చేసుకుంటున్నారని, తాము వెనకబడకూడదనే ఆలోచనతో మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇతర పార్టీలు ఏవీ ఇంతవరకు అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం వెలువరించలేదు. కానీ, వైసీపీ మాత్రం అధికారికంగానే నిర్ణయం తీసుకోవడంతో మున్సిపోల్స్ కు ముందుగా దూసుకువచ్చినట్లు చెబుతున్నారు.
కంగూరు పెడుతున్న కూటమి
స్థానిక ఎన్నికల విషయంలో కూటమి రాజకీయాలు విపక్షాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆ పార్టీ ఎన్నికల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాకపోయినప్పటికీ నెల్లూరు మేయర్ అభ్యర్థిని వైసీపీ ప్రకటించడం చూస్తుంటే, ఎన్నికలను ఆ పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమవుతోందని అంటున్నారు. అధికార పార్టీ ఇంతవరకు ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించకపోయినా, స్థానిక నేతలు అంతా ఓ నిర్ణయం తీసుకుని ఓ నాయకుడిని మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. దీంతో ఆయన నెల్లూరులో అందరినీ కలుస్తూ, మద్దతు కూడగట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వైసీపీ కూడా మేయర్ అభ్యర్థిని ముందుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకుని వెనువెంటనే అమలు చేసినట్లుగా చెబుతున్నారు.
ఆనం ఎందుకు?
నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు నగరంలో ఆనం కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఆ కుటుంబంలో ఒకరికి అవకాశం ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఇరుకన పెట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని అంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ గా ఆవిర్భవించడానికి ముందు మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ఆనం కుటుంబానికి చెందిన వివేకానందరెడ్డి సుదీర్ఘకాలం చైర్మనుగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఈ కారణంగా నగరంలో ఆనం కుటుంబానికి ఉన్న ఆదరణను క్యాష్ చేసుకోవాలని వైసీపీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందనే సంకేతాలు పంపడానికి ఆనం ఎంపిక నిదర్శనంగా చూపొచ్చునని అంటున్నారు.