కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?
| పంచాయతీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ స్వేచ్ఛ ఇవ్వడం కూటమిలో చర్చనీయాంశమైంది. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ.. పంచాయతీల్లో మాత్రం విడివిడిగా బరిలోకి దిగే పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయంతో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
స్థానిక ఎన్నికల చివరి అంకంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. స్థానిక ఎన్నికల్లో భాగంగా మున్సిపల్, పరిషత్ పోరును పకడ్బందీగా నడిపించిన జనసేనాని పవన్ పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి ఎవరికి వారే అని నినదించడంతో గ్రామీణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయని అంటున్నారు. పట్టణ సంస్థలతోపాటు పరిషత్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయడంతో ఓట్లు సంఘటితమై తిరుగులేని విజయాలు నమోదు చేసుకున్నారు. అయితే పంచాయతీలకు వచ్చేసరికి పార్టీతో సంబంధం లేదని జనసేనాని స్వయంగా తేల్చిచెప్పడంతో చాలాచోట్ల పోరు రసవత్తరంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వార్ వన్ సైడ్ అవుతుందని భావించిన చోట జనసేన ఎంట్రీతో లెక్కలన్నీ మారిపోయాయని అంటున్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్నారు. 26వ తేదీ గురువారం 3240 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ నెల 29న రెండో విడత, వచ్చేనెల 2న మూడో విడత ఎన్నికలతో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. అయితే మున్సిపల్, పరిషత్ ఎన్నికలు మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమిగా మూడు పార్టీలు వారు కలిసి పోటీ చేస్తారని భావించారు. గ్రామ, మండలస్థాయిలో చర్చలు కూడా చేసుకుని చాలా మంది సర్దుకుపోయారు. అయితే కొన్ని చోట్ల జనసైనికులను తొక్కేస్తున్నారనే ఆలోచనతో పోటీకి సిద్ధమయ్యారు. అయితే కూటమి ధర్మమని వారిని వెనక్కి తగ్గించొచ్చని టీడీపీ నేతలు భావించగా, జనసేనాని పవన్ మాత్రం టీడీపీకి షాక్ ఇస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు సంబంధం లేదన్న ఆలోచనతో పార్టీ తరఫున పోటీకి ఆసక్తి చూపిన వారిని ప్రోత్సహించాలని పవన్ తీసుకున్న నిర్ణయం కూటమిలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఊహించని విధంగా వెలువడిన ప్రకటనతో టీడీపీలో గ్రామస్థాయి నాయకులు షాక్ కు గురయ్యారని అంటున్నారు. మండల పరిషత్ ఎన్నికల్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కొన్నిచోట్ల జనసేనకు తాము మద్దతు పలికామని, ఇప్పుడు జనసేన పార్టీ పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంచాయతీ ఎన్నికల్లో తాము నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోందని గగ్గోలు పెడుతున్నారు. అయితే జనసేన నాయకులు మాత్రం తమ అధినేత తీసుకున్న నిర్ణయం సరైనదేనని భావిస్తున్నారు.
పార్టీలకు సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కేడర్ కు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల గ్రామస్థాయిలో జనసేన బలపడే అవకాశం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ నిస్తేజంగా ఉండటం వల్ల, తాము ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ పార్టీ మద్దతుదారులు తమవైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని జనసేన వర్గాలు ఆశిస్తున్నాయి. దీనిద్వారా గ్రామస్థాయిలో పార్టీ బలపడే అవకాశం ఉంటుందని అంటున్నారు. గెలుపోటములను పక్కన పెడితే పార్టీ ఓటింగ్ పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అంతిమంగా ఇది కూటమిలో మరింత బలపడటానికి భవిష్యత్తులో సొంతంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.