కారం పొడితో పోలింగ్ బూత్‌లకు ....ఇదేమి పోరాటం వైసీపీ నాయకా ?
| పల్నాడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ బూత్‌లకు వెళ్లే మహిళా కార్యకర్తలు చీరల్లో కారం పొడి ప్యాకెట్లు ఉంచుకోవాలని సూచించారు. ఎవరైనా ఇబ్బంది పెడితే కారం చల్లాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 48 వార్డుల్లో వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ మీద అయితే రప్పా రప్పా అన్న ముద్ర ఇప్పటికే ఉంది. ఆ పార్టీ నేతలు ఉత్సాహం ఎక్కువై రప్పా రప్పా అన్నారు. అది కాస్తా ఫుల్ నెగిటివ్ అయిపోయింది. ఈ రోజుకీ అది కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. ఇక తమ పార్టీ వారిని సమర్ధించుకునే ప్రయత్నంలో ఒక సందర్భంలో వైసీపీ అధినేత జగన్ కూడా రప్పా రప్పా డైలాగ్ వాడి అందులో తప్పేముందు సినిమా డైలాగే కదా అనేశారు. ఇలా వైసీపీ నేతలు అరచాకాలు చేస్తారు అని టీడీపీ ఇప్పటికే గట్టిగా విమర్శలు చేస్తూనే ఉంటుంది. అయితే ఇంకా వైసీపీ నేతలు హాట్ కామెంట్స్ అలాగే కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే రెండవ విడత మునిసిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత శ్రీనివాస రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కారం పొడి పొట్లాలతో :
ఆయన మాట్లాడుతూ పోలింగ్ బూత్‌లకు వెళ్లే మహిళా కార్యకర్తలు తమ వెంట కారం పొడి ప్యాకెట్లను ఉంచుకోవాలని విచిత్రమైన సూచన చేశారు. ఎందుకు అంటే ఎవరైనా వారిని బెదిరించినా ఇబ్బంది పెట్టినా ఆ కారం పొట్లాలను ఉపయోగించాలని మాజీ ఎమ్మెల్యే సలహా ఇచ్చారు అన్న మాట. ఇక ఆడవారు అయితే చీరల్లో కారం పొడి ప్యాకెట్లను ఉంచుకోండని కూడా చెప్పుకొచ్చారు. పోలింగ్ బూత్ లలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తే ఇక కారం పొట్లాలు తీసి చల్లేయండి అంటూ చెప్పాల్సింది చెప్పేశారు. మీరేమీ భయపడకండి ఏమీ కాదు నేనున్నాను అంటూ సదరు మాజీ ఎమ్మెల్యే ఆయన మహిళా కార్యకర్తలకు అభయం కూడా ఇచ్చేశారు. ఇదంతా ఎందుకు అంటే పల్నాడు జిల్లాలోని పట్టణంలో నవంబర్ 26న పోలింగ్ జరగనుంది. దాని కోసం తమ కార్యకర్తలకు ఇచ్చే పోరాట సందేశం అన్న మాట.
టీడీపీ అడ్డుకుంటోందని :
ఇక పల్నాడులోని మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉన్నాయి. అక్కడ పోలింగ్ సందర్భంగా తమ పార్టీ వారిని అడ్డుకోకుండా మాజీ ఎమ్మెల్యే ఇలా ప్లాన్ చెప్పారని అంటున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ వైసీపీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తమ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తోంటే వారిని ఇబ్బందుల పాలు చేస్తోందని అలాగే వారి నామినేషన్లను తిరస్కరించేలా కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. అదే విధంగా అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి, ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందని కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
మేమే గెలుస్తామంటూ :
మరో వైపు చూస్తే తామె ఎక్కువ వార్డులు గెలుస్తామని చెబుతున్న శ్రీనివాసరెడ్డి ఈ కారం పొడి పొట్లాల ప్లాన్ గురించి తమ క్యాడర్ కి సూచనలు ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా ఉంది మరి. మొత్తం 48 వార్డుల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని, మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని కూడా దక్కించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాంటప్పుడు ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. నిజానికి చూస్తే పల్నాడు లాంటివి సున్నితమైన ప్రాంతలు, అలాంటి చోట్ల రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తే కనుక అది మరింత ఘర్షణలకు దారి తీస్తుంది కదా అని అంటున్నారు. మరి దీని మీద ఎన్నికల సంఘం అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలని అంటున్నారు.