వీఆర్వోపై రెచ్చిపోయిన వైసీపీ నేత.. ఆడియో వైరల్

కేసులో ప్రభుత్వం హడలెత్తిస్తున్నా, కొందరు వైసీపీ నేతలు తమ వివాదాస్పద వైఖరి మానుకోలేకపోతున్నారు.;

Update: 2025-08-05 11:37 GMT

కేసులో ప్రభుత్వం హడలెత్తిస్తున్నా, కొందరు వైసీపీ నేతలు తమ వివాదాస్పద వైఖరి మానుకోలేకపోతున్నారు. తిట్లు, బెదిరింపులతో బరి తెగిస్తున్నారు. వరుస కేసులతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా వైసీపీ నేతల తీరు మారడం లేదన్న విమర్శలకు తాజా ఉదంతం ఓ ఉదాహరణగా చెబుతున్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల వీఆర్వో గంధం అరుణ్ రెడ్డిపై బొల్లాపల్లి మండల వైసీపీ కన్వీనర్ కాకర్ల నారాయణరెడ్డి రెచ్చిపోయారు. నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా సచివాలయానికి ఉరివేసి చంపేస్తానని బెదిరించాడు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశమైంది.

రేమిడిచర్ల వీఆర్వో అరుణ్ రెడ్డికి ఫోన్ చేసిన కాకర్ల నారాయణరెడ్డి ఉన్నపళంగా తాను కోరిన సర్టిఫికెట్లు ఇంటికి తెచ్చివ్వాలని ఆదేశించారు. తాను అందుబాటులో లేనని వేరేవారికి సర్టిఫికెట్ అందజేశానని వీఆర్వో సర్ది చెబుతున్నా వినని నారాయణరెడ్డి.. గంటలోగా తాను చెప్పిన సర్టిఫికెట్ ను ఇవ్వాలని లేదంటే, గుమ్మడికాయ వేలాడ దీసినట్లు నీ శవాన్ని వేలాడదీస్తానని హెచ్చరించారు. నువ్వు వీఆర్వోవా? పెద్ద కలెక్టర్ వా? అంటూ ప్రశ్నించిన నారాయణరెడ్డి నువ్వు ఎంత, నీ బతుకు ఎంత అంటూ వీఆర్వోను దూషించారు.

ఎమ్మార్వో తనకు వేరే పని అప్పగించారని, అందువల్ల మీరు అడిగిన సర్టిఫికెట్ ను సంతకం చేసి వేరే వ్యక్తికి అప్పగించానని వీఆర్వో ఎంత చెప్పినా వినిపించుకోని వైసీపీ నేత నారాయణరెడ్డి నోటికొచ్చినట్లు దూషిస్తూ నీకు నేను ఎక్కువ? ఎమ్మార్వో చెప్పిన పని ఎక్కువా? అంటూ నిలదీశారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ నేత వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక నారాయణరెడ్డి ఫోన్ సంభాషణ లీక్ కావడంతో సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికారం కోల్పోయి ఏడాది దాటినా ఇంకా తమదే పవర్ అన్నట్లు కొందరు వైసీపీ నేతలువ్యవహరిస్తున్న తీరుతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని కార్యకర్తలు మండిపడుతున్నారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతూ తాము చిక్కుల్లో పడటమే కాకుండా, పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News