అన్న మీద పవన్ కోపం నిజమే
తిరుమల లడ్డు వ్యవహారం మీద నాగబాబు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. జగన్ అండ్ కో మీద తీవ్ర విమర్శలు గుప్పించారు.;
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఎంత చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. లడ్డు కోసం కల్తీ నెయ్యిని వాడారని.. ఆ నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించడంతో దుమారం రేగింది. దీనిపై ప్రత్యేక విచారణ బృందం (సిట్)తో పాటు సీబీఐ కూడా విచారణ జరిపాయి. ఐతే జంతు కొవ్వులు కలిసినట్లుగా స్పష్టత లేకపోయినప్పటికీ.. వైసీపీ హయాంలో టీటీడీ వాడింది అసలు నెయ్యే కాదని.. అదొక కెమికల్ మిశ్రమం అని సిట్ నివేదిక తేల్చింది. ఐతే వైసీపీ వాళ్లు మాత్రం అదసలు నెయ్యే కాదన్న విషయాన్ని పక్కన పెట్టి.. జంతు కొవ్వులు లేకపోవడం మీద ఎదురుదాడి మొదలుపెట్టారు. దీని మీద ఇటు టీడీపీ, అటు జనసేన నాయకులు సరిగ్గా స్పందించలేదనే విమర్శలు వచ్చాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జనసేన సమావేశంలో తన పార్టీ నేతల మీద ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని.. చివరికి తన అన్నయ్య, ఎమ్మెల్సీ నాగబాబును మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. అన్నయ్య మీద పవన్ కోపం నిజమే అని ఇప్పుడు బయటికి వచ్చిన ఒక వీడియోతో స్పష్టమైంది.
తిరుమల లడ్డు వ్యవహారం మీద నాగబాబు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. జగన్ అండ్ కో మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హిందూ ద్రోహి అని ఆయన అభిప్రాయపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని జగన్ తిరుమలకు రావడమే ఆపేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
‘‘వైసీపీ హయాంలో తిరుమలలో చాలా దారుణాలు జరిగాయి. రూం చార్జీలు ఇష్టారాజ్యాంగా పెంచేశారు. ఇది సామాన్యులను భగవంతుడు నుంచి దూరం చేయడం కాదా? ఎక్కడ కొండ కనిపిస్తే అక్కడ గుండు కొట్టేయడమే అలవాటుగా మార్చుకున్నారు. డిక్లరేషన్‌ను గౌరవించడం మన సాంప్రదాయం. పవన్ కల్యాణ్ తన సతీమణి, పిల్లలను తీసుకువెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చారు.
ఆయనకంటే నువ్వు గొప్పోడివా? నీ మంత్రి ‘తిరుమల నీ అమ్మ మొగుడు కట్టాడా?’ అంటూ మాట్లాడతాడా? అలా తలపొగరుతో మాట్లాడినందుకే 151లో మధ్యలో 5 తీసేసి 11 సీట్లే ప్రజలు ఇచ్చారు. అయినా ఏం మారలేదు. డిక్లరేషన్ అడిగారని తిరుమల పర్యటన మానుకున్న చరిత్ర మీది’’ అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.