ఒకే రోజు నాలుగు అద్భుతాలు.. సూర్యగ్రహణం స్పెషల్ ఇదే!

ఖగోళ ప్రేమికులకు, అంతరిక్ష పరిశోధకులకు ఆగస్టు 12వ తేదీ ఒక మరువలేని ప్రత్యేకమైన రోజుగా నిలవబోతోంది.

Update: 2026-08-08 17:59 GMT

ఖగోళ ప్రేమికులకు, అంతరిక్ష పరిశోధకులకు ఆగస్టు 12వ తేదీ ఒక మరువలేని ప్రత్యేకమైన రోజుగా నిలవబోతోంది. ఈ ఒక్కరోజే విశ్వంలో ఏకంగా నాలుగు అరుదైన ఖగోళ అద్భుతాలు ఒకదాని వెంట ఒకటి చోటుచేసుకోనున్నాయి. సంపూర్ణ సూర్యగ్రహణంతో పాటు గ్రహాల అమరిక, అమావాస్య, మరియు పెర్సీడ్ ఉల్కాపాతం ఒకే రోజు సంభవించనుండటంతో ప్రపంచవ్యాప్తంగా స్కైగేజర్లు, శాస్త్రవేత్తలు ఈ అరుదైన దృశ్యాలను వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే?:

ఈ అద్భుతాల్లో మొదటిది సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. రష్యా ఉత్తర ప్రాంతాలు, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్‌లలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం చాలా స్పష్టంగా కనువిందు చేయనుంది. ఇక అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని పలు దేశాల ప్రజలకు పాక్షిక సూర్యగ్రహణం దర్శనమిస్తుంది. స్పెయిన్‌లోని లియోన్, వలెన్సియా, ఐస్‌లాండ్‌లోని రేక్‌జావిక్ నగరాల్లో ఈ దృశ్యం మరీ ప్రకాశవంతంగా కనిపించనుంది.

ఆకాశంలో గ్రహాల విచిత్ర అమరిక:

సూర్యగ్రహణానికి ముందే ఆకాశంలో మరో వింత ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోని బుధుడు, గురుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అనే ఆరు గ్రహాలు ఒకే సరళరేఖ పైకి రానున్నాయి. దీనిని ‘ప్లానెటరీ అలైన్‌మెంట్’ అని పిలుస్తారు. ఇక తెల్లవారుజామున సంభవించే ఈ ఘట్టంలో అంగారకుడు, బుధుడు, గురుడు, శని గ్రహాలను మనం సాధారణ కంటితోనే చూడవచ్చు. యురేనస్, నెప్ట్యూన్‌లను చూడటానికి మాత్రం టెలిస్కోప్ అవసరమవుతుంది.

అమావాస్య చీకటి.. పెర్సీడ్ ఉల్కాపాతం:

అదే రోజు రాత్రి వేళ అమావాస్య ఏర్పడబోతోంది. చంద్రుడి వెలుతురు లేకపోవడం వల్ల ఆకాశం కటిక చీకటిగా మారుతుంది. ఈ చీకటి వాతావరణంలో పెర్సీడ్ ఉల్కాపాతం అద్భుతంగా కనిపిస్తుంది. 'స్విఫ్ట్ టటిల్' అనే తోకచుక్క వదిలిన శకలాలు భూ వాతావరణంలోకి దూసుకొచ్చి మండిపోతూ కాంతి రేఖలుగా మారతాయి. ఇక ఆకాశం ప్రశాంతంగా ఉంటే గంటకు దాదాపు 100 ఉల్కలను కనులారా చూడవచ్చు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈశాన్య దిశలోని పర్సియస్ నక్షత్ర మండలంలో ఇవి కనిపిస్తాయి.

అరుదైన ఖగోళ సంఘటనలు:

ఈ నాలుగు వింతలను ఒకేసారి ఒకే చోట నుంచి చూడటం సాధ్యం కాకపోయినా, ఇవన్నీ ఒకే రోజున జరగడం చాలా అరుదైన విషయం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఒకే రాత్రిలో సంభవించే ఈ అద్భుతాలు అంతరిక్ష పరిశోధకులకు, వీక్షకులకు మరువలేని అనుభూతిని అందించనున్నాయి.

ఖగోళ ప్రేమికులకు పండగే:

సూర్యగ్రహణం, గ్రహాల అమరిక, అమావాస్య చీకట్లో ఉల్కాపాతం.. ఇలా వరుసగా చోటుచేసుకునే ఈ సంఘటనలు విశ్వం యొక్క అనంతమైన వింతలను మరోసారి నిరూపిస్తున్నాయి. ఇక ఆగస్టు 12న ఆకాశంలో ఆవిష్కృతమయ్యే ఈ వింతల కలయిక ఖగోళ ప్రేమికులకు నిజంగా ఒక గొప్ప పండగ లాంటిదని చెప్పవచ్చు..

Tags:    

Similar News