చాలా కాలంగా అవార్డులు ఇవ్వ‌డం లేదు: ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి!

అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అవార్డుల పునరుద్ధరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-08-08 18:03 GMT

అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అవార్డుల పునరుద్ధరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఉగాది పురస్కారాలతో పాటు పలు రంగాలకు చెందిన అవార్డులు నిలిచిపోయాయని ఒప్పుకున్న ఆయన, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ పురస్కారాలన్నింటినీ తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతలో ఉన్న కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని విధాలా మద్దతు ఇస్తుందని, కళారంగాన్ని ఆదరించే వారికి సరైన అవకాశాలు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ముఖ్యంగా 2017 నుండి పెండింగ్‌లో ఉన్న ప్రతిష్టాత్మక `నంది అవార్డుల` పునరుద్ధరణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని మంత్రి కందుల దుర్గేష్ ధృవీకరించారు. సినీ పరిశ్రమ పెద్దలతో జరిపిన విస్తృత చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చలనచిత్ర రంగానికి ఇచ్చే నంది అవార్డులతో పాటు బుల్లితెర (టీవీ) అవార్డులు, నంది నాటకోత్సవాలు.. కందుకూరి థియేటర్ పురస్కారాలను కూడా ఒకేసారి పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాంప్రదాయ పద్ధతిలోనే అవార్డులు ఇవ్వాలా లేదా ఆధునిక మార్పులతో కేటగిరీలను సరిదిద్దాలా అనే అంశంపై ప్రభుత్వం ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తోంది.

అయితే ప్రభుత్వం కేవలం అవార్డుల ప్రకటనలకే పరిమితం కాకుండా నాటకరంగం, బుల్లితెర, సినీ పరిశ్రమలోని వృద్ధ కళాకారుల సంక్షేమంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టేజ్ డ్రామా- థియేటర్ ఆర్టిస్టులకు పింఛన్లు, స్టైఫండ్లు అందించి ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అనే ప్రాక్టికల్ విషయాలపై మంత్రి స్పందిస్తే బాగుండేదని కళాకారులు భావిస్తున్నారు. కనీసం నిరుపేద కళాకారులు స్వగృహం ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఆరోగ్య భద్రత కల్పించడం వంటి క్షేత్రస్థాయి సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.

గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా అవార్డులు ఇవ్వకపోవడంతో సినీ వర్గాల్లోనూ, కళాకారుల్లోనూ వీటిపై ఆసక్తి బాగా తగ్గిపోయింది. పురస్కారాలను సకాలంలో ప్రదానం చేయకపోవడం వల్ల అవార్డులు తీసుకోవాలనే ఉత్సాహం కళాకారుల్లో నీరుగారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఏళ్లుగా బకాయి ఉన్న నంది అవార్డులను 2026 నాటికి పూర్తిస్థాయిలో పారదర్శకంగా ప్రదానం చేస్తారా లేదా అనే దానిపై ఇండస్ట్రీలో ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. గత ప్రభుత్వంపై సాకులు చెప్పడం కంటే...ప్రస్తుత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వీటిని నిర్వహిస్తుందనేదే ఇప్పుడు ముఖ్యం.

మరోవైపు నంది అవార్డుల ప్రదానంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో స్థానికంగా సినిమా రంగ అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ కొత్త టాలీవుడ్ ఎక్క‌డ నెల‌కొల్పుతారో సినిమాటోగ్ర‌ఫీ మంత్రికి అయినా క్లారిటీ ఉంటే బావుండేద‌ని కూడా నెటిజ‌నులు సెటైర్లు వేస్తున్నారు. స్టూడియోలు, డబ్బింగ్ రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమిచ్చేలా ఒక నూతన `ఫిల్మ్ పాలసీ`ని తీసుకురావడానికి ప్రభుత్వం ఎలాంటి క‌మిట్ మెంట్ తో ఉంది? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. అవార్డులను మళ్లీ పట్టాలెక్కించడంతో పాటు విశాఖపట్నం, అమరావతి లేదా గోదావ‌రి-కృష్ణ బేసిన్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ వసతులు పెంచితేనే ఏపీలో సినిమా రంగానికి పూర్వ వైభవం వస్తుంది. కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా కళాకారుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం ఈ చర్యలను ముందుకు తీసుకెళ్లాలని కళాలోకం ఆశిస్తోంది.

Tags:    

Similar News