చిలిపి చేష్ఠ కాదు.. బరితెగింపు: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కిస్!
ఈ ఘటన తీవ్ర విమర్శలకు దారితీయడంలో సీపీ సజ్జనార్ స్పందించారు. ఇది ముమ్మాటికీ ఖండించాల్సిన విషయమని.. మహిళా భద్రతకు పోలీసులు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు.
చిలిపి చేష్ఠలు వేరు.. బరితెగింపులు వేరు. సభ్య సమాజం సిగ్గుపడేలా.. ఓ సెక్యూరిటీ గార్డు వ్యవహరించిన తీరుపై హైదరాబాద్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమకు రక్షణ కల్పించాల్సిన భద్రతా సిబ్బందే.. లైంగిక వేధింపులకు పాల్పడడం ఏంటని.. సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన మహిళా ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.
ఏం జరిగింది?
క్యాబ్ ఎక్కుతున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు సెక్యూరిటీ గార్డు ఒకరు ముద్దుపెట్టిన ఘటన హైదరాబాద్ వ్యాప్తం గా సంచలనం సృష్టించింది. మహిళలకు సెక్యూరిటీగా వ్యవహరించాల్సిన గార్డే.. ఇలా ఆమెను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. కొందరు ప్రబుద్ధులు దీనిని చిలిపి చేష్ట అంటూ.. వ్యాఖ్యానిస్తుండడంతో మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గచ్చిబౌలి ఇందిరానగర్‌లో క్యాబ్ ఎక్కుతున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (24)ను సెక్యూరిటీ గార్డు దగ్గరకు లాక్కుని ముద్దుపెట్టాడు. దీంతో సదరు మహిళ ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. తనకు భద్రత కల్పించాల్సిన గార్డు ఇలా వ్యవహరించడంతో ఆమెకు ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో ఒక్కసారిగా అరుపులు కేకలు పెట్టారు. ఈ అరుపులు కేకలకు చుట్టుపక్కల వారు వచ్చే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన సెక్యూరిటీ గార్డ్ అక్కడ నుంచి ఉడాయించాడు.
సీపీ సీరియస్..
ఈ ఘటన తీవ్ర విమర్శలకు దారితీయడంలో సీపీ సజ్జనార్ స్పందించారు. ఇది ముమ్మాటికీ ఖండించాల్సిన విషయమని.. మహిళా భద్రతకు పోలీసులు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గచ్చిబౌలి పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిపారు. కాగా....సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. బీఆర్ ఎస్ విమర్శలు గుప్పించింది.