3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలట

సాధారణం కంటే దాదాపు 43 శాతానికి పైనే తెలంగాణలో వర్షపాత లోటు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్ లో 38 శాతం వరకు ఉంది.

Update: 2026-09-24 03:54 GMT

వర్షాకాలంలో వేసవిని చూసిన అరుదైన అనుభవం ఈ ఏడాది తెలుగు ప్రజలకు ఎదురైంది. ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన వర్షాభావం ఎదుర్కొంటున్న వేళ.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలకు కారణం కానుంది. పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్.. దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోకి రావటంతో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో కరవు పరిస్థితులు నెలకొన్న వేళ.. ఇప్పుడు కురిసే వర్షాలు వర్షలోటును కాస్త తీర్చగలవు. కానీ.. ఒకేసారి కుండపోతగా కురిసే వర్షం పంటలకు ఏ మాత్రం సాయం చేయదన్నది మర్చిపోకూడదు.

సాధారణం కంటే దాదాపు 43 శాతానికి పైనే తెలంగాణలో వర్షపాత లోటు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్ లో 38 శాతం వరకు ఉంది. ఈసారి వర్షాలు లేని కారణంగా ఖరీఫ్ సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. తెలంగాణలో 16 లక్షల వరకు.. ఆంధ్రప్రదేశ్ లో 21 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు తగ్గింది. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు జూన్ - సెప్టెంబరు మధ్య నైరుతి రుతుపవనాల కారణంగా విస్తారంగా వర్షాలు పడే పరిస్థితి. ఈసారి సూపర్ ఎల్ నినో కారణంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

మూడు రోజుల్లో కురిసే వర్షాలకు సంబంధించి వాతావరణ నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా కుండపోత మాదిరి వర్షం పడే జిల్లాలకు రెడ్ అలెర్టు ప్రకటించగా.. భారీ నుంచి అతి భారీ వర్షాలు (11.5 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం) నమోదయ్యే జిల్లాలకు ఆరెంజ్ అలెర్టు.. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు (6.4 సెంటీమీటర్లు నుంచి 11.5 సెంటీమీటర్ల వరకు) పడే జిల్లాలకు ఎల్లో అలెర్టు ప్రకటించారు. రెడ్.. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉంది. ఇందుకు అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

తెలంగాణ.. ఏపీలో వివిధ అలెర్టు ప్రకటించిన జిల్లాలు

రెడ్ అలెర్ట్

కొమరంభీం ఆసిఫాబాద్.. మంచిర్యాల.. జయశంకర్ భూపాలపల్లి.. ములుగు.. భద్రాద్రి కొత్తగూడెం

శ్రీకాకుళం.. విజయనగరం.. పార్వతీపురం మన్యం.. అల్లూరి సీతారామరాజు..విశాఖపట్నం.. అనకాపల్లి

ఆరెంజ్ అలెర్ట్

ఆదిలాబాద్.. జగిత్యాల.. కరీంనగర్.. పెద్దపల్లి.. ఖమ్మం.. మహబూబాబాద్.. వరంగల్.. హన్ముకొండ

కాకినాడ.. తూర్పుగోదావరి.. పశ్చిమ గోదావరి.. ఏలూరు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ

ఎల్లో అలెర్ట్

నిర్మల్.. నిజామాబాద్.. రాజన్న సిరిసిల్ల.. నల్గొండ.. సూర్యాపేట.. జనగామ.. సిద్దిపేట.. యాదాద్రి భువనగరి.. మహబూబాబ్ నగర.. నాగర్ కర్నూల్.. వనపర్తి.. జోగులాంబ గద్వాల

క్రిష్ణా.. ఎన్టీఆర్.. గుంటూరు.. పల్నాడు.. బాపట్ల జిల్లాలుః

గ్రీన్ అలెర్ట్

హైదరాబాద్ పరిసర ప్రాంతాలు

రాయలసీమ జిల్లాలు.. నెల్లూరు.. ప్రకాశం జిల్లాలు

Tags:    

Similar News