అమెరికా గడ్డపై నినదించిన ధిక్కార స్వరాలు.. ఇప్పుడు ఇరాన్ పెజెష్కియన్ సైతం..
అమెరికాపై ఇరాన్ దాడి చేసింది.. కానీ క్షిపణులతో కాదు.. డ్రోన్లతో కాదు. అమెరికా గడ్డపైనే, ప్రపంచ దేశాల సమక్షంలో మాటలతో ఎదురుదాడి చేసింది.
అమెరికాపై ఇరాన్ దాడి చేసింది.. కానీ క్షిపణులతో కాదు.. డ్రోన్లతో కాదు. అమెరికా గడ్డపైనే, ప్రపంచ దేశాల సమక్షంలో మాటలతో ఎదురుదాడి చేసింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని వేదికగా చేసుకున్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఇరాన్‌ను బాధిత దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేశారు.
అమెరికా గడ్డపై నిలబడి.. అదే దేశ విధానాలను బహిరంగంగా ప్రశ్నించడం అంత సాధారణ విషయం కాదు. కానీ ఐక్యరాజ్యసమితి వేదిక అందుకు భిన్నమైన రాజకీయ వేదిక. అమెరికా నడిబొడ్డున ఉన్న న్యూయార్క్‌లోనే ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు అమెరికా విధానాలను తీవ్రంగా విమర్శించిన నేతలు చరిత్రలో చాలామందే ఉన్నారు.ఇప్పుడు ఆ జాబితాలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పేరు కూడా చేరింది.
ఇరాన్-అమెరికా యుద్ధం కొనసాగుతున్న వేళ.. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో పెజెష్కియాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను నేరుగా ప్రశ్నించారు. అమెరికా తమను ఉగ్రవాదులుగా పేర్కొంటోందని.. కానీ ఇరాన్ ప్రజలే ఉగ్రవాదానికి బాధితులని ఆయన వాదించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి ఫొటోలను కూడా సభలో ప్రదర్శించారు. ఆయన ప్రసంగం ప్రారంభమైన సమయంలో అమెరికా ప్రతినిధి సభ నుంచి బయటకు వెళ్లారు. అయితే పెజెష్కియాన్ ప్రసంగాన్ని కేవలం అమెరికాపై మరో ఘాటు విమర్శగా చూడటం కంటే.. అమెరికా గడ్డపై ఐక్యరాజ్యసమితి వేదికగా గతంలో వినిపించిన ధిక్కార స్వరాల పరంపరలో మరో అధ్యాయంగా చూడొచ్చు.
1960.. ఫిడెల్ క్యాస్ట్రో సుదీర్ఘ ప్రసంగం
అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఐక్యరాజ్యసమితి వేదికను ఉపయోగించుకున్న ప్రముఖ నేతల్లో క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో ముందుంటారు. 1960 సెప్టెంబర్ 26న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో క్యాస్ట్రో ఏకంగా 269 నిమిషాలు.. అంటే 4 గంటల 29 నిమిషాలు మాట్లాడారు. యూఎన్ అధికారిక ఆర్కైవ్ ప్రకారం అది జనరల్ అసెంబ్లీ చరిత్రలో నమోదైన అత్యంత సుదీర్ఘ ప్రసంగం. అప్పటికి యూఎన్ ప్రసంగాలకు సాధారణంగా 15 నిమిషాల పరిమితి ఉండేది. అమెరికా జోక్యం, లాటిన్ అమెరికా వ్యవహారాల్లో వాషింగ్టన్ పాత్రపై క్యాస్ట్రో తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా బెదిరింపులకు క్యూబా భయపడదనే సందేశాన్ని కూడా ఇచ్చారు. అంటే.. అమెరికా గుండెల్లోనే నిలబడి అమెరికా విధానాలను సవాలు చేయడానికి యూఎన్ వేదికను ఉపయోగించుకున్న తొలి ప్రముఖ ఉదాహరణల్లో క్యాస్ట్రో ప్రసంగం ఒకటి.
1974లో యాసిర్ అరాఫత్
1974.. యాసిర్ అరాఫత్ అమెరికాను నేరుగా ప్రశ్నించిన వేళ
ఆ తర్వాత 1974లో పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్ఓ) నేత యాసిర్ అరాఫత్ యూఎన్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. పాలస్తీనా సమస్యపై మాట్లాడిన అరాఫత్.. అమెరికా ఇజ్రాయెల్‌కు ఆయుధాలు అందిస్తోందని విమర్శించారు. పాలస్తీనా ప్రజల సమస్యను ప్రపంచ సమాజం సరిగ్గా అర్థం చేసుకోవాలని కోరారు. అంతేకాదు.. తన ప్రసంగంలో నేరుగా అమెరికా ప్రజలను ఉద్దేశించి తమ పోరాటాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అరాఫత్ ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. అమెరికా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. అమెరికా ప్రజలతో తమకు శత్రుత్వం లేదనే తేడాను ఆయన చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా.. ఇదే విధంగా ఇప్పుడు పెజెష్కియాన్ కూడా అమెరికా ప్రజలను కాకుండా.. ప్రధానంగా అమెరికా ప్రభుత్వ విధానాలు, ట్రంప్ నిర్ణయాలనే లక్ష్యంగా చేసుకున్నారు.
2006.. ‘డెవిల్’ అంటూ హ్యూగో చావెజ్ సంచలనం
2006లో వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ యూఎన్ వేదికపై చేసిన ప్రసంగం ఇప్పటికీ అత్యంత గుర్తుండిపోయే ప్రసంగాల్లో ఒకటి. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ తనకంటే ముందు రోజు అదే వేదికపై ప్రసంగించారు. మరుసటి రోజు చావెజ్ వేదికపైకి వచ్చి.. బుష్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ఆయనను ‘డెవిల్’గా అభివర్ణించారు. అంతేకాదు.. బుష్ ప్రసంగించిన అదే పోడియం వద్ద నిలబడి అమెరికా ఆధిపత్యాన్ని, విదేశాంగ విధానాన్ని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలకు సభలో చప్పట్లు కూడా వినిపించాయి. అది కూడా అమెరికా గడ్డపైనే.. అమెరికా అధ్యక్షుడిపై బహిరంగంగా చేసిన ఘాటు రాజకీయ దాడిగానే నిలిచిపోయింది.
2009.. గడాఫీ 96 నిమిషాల ప్రసంగం
2009లో లిబియా నేత ముఅమ్మర్ గడాఫీ తొలిసారి యూఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. దాదాపు 96 నిమిషాల పాటు సాగిన ఆ ప్రసంగంలో ఆయన యూఎన్ భద్రతా మండలి నిర్మాణాన్ని ప్రపంచ రాజకీయ వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. ఇరాక్ యుద్ధం సహా అమెరికా విదేశాంగ విధానంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అంటే 1960లో క్యాస్ట్రో నుంచి 2006లో చావెజ్ వరకు.. 2009లో గడాఫీ వరకు.. అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించే నేతలకు న్యూయార్క్‌లోని యూఎన్ వేదిక ఒక అంతర్జాతీయ మైక్‌గా పనిచేసింది. ఇప్పుడు అదే మైక్‌ను పెజెష్కియాన్ ఉపయోగించారు.
ఇప్పుడు పెజెష్కియాన్ వంతు!
2026లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. క్యాస్ట్రో అమెరికాతో యుద్ధం సమయంలో మాట్లాడారు. అరాఫత్ పాలస్తీనా సమస్యను ప్రపంచం ముందు ఉంచారు. చావెజ్ అమెరికా విదేశాంగ విధానాన్ని బుష్ పాలన సమయంలో తీవ్రంగా విమర్శించారు. గడాఫీ యూఎన్ వ్యవస్థపైనే ప్రశ్నలు సంధించారు. కానీ పెజెష్కియాన్ పరిస్థితి వేరు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధమే జరుగుతోంది. అందుకే ఆయన ప్రసంగంలోని ప్రతి మాటకు మరింత వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడింది. ట్రంప్ ముందు రోజు యూఎన్ వేదికపై ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో.. పెజెష్కియాన్ అదే వేదికపై అమెరికా వాదనకు ప్రత్యామ్నాయ కథనాన్ని వినిపించారు. ఇరాన్ లొంగిపోదని స్పష్టం చేస్తూనే.. బెదిరింపులు లేకుండా చర్చలు జరిగితే దౌత్యానికి తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పారు. ఇది కేవలం ‘అమెరికాకు కౌంటర్’ మాత్రమేనా?
కాదు. పెజెష్కియాన్ ప్రసంగాన్ని మూడు స్థాయిల్లో చూడొచ్చు. మొదటిది.. ఇరాన్ ప్రజలకు సందేశం.. అమెరికా ఒత్తిడికి ఇరాన్ ప్రభుత్వం తలవంచడం లేదని దేశ ప్రజలకు చూపించడం ఒక లక్ష్యం కావచ్చు. రెండోది.. ప్రపంచ దేశాలకు సందేశం.. యుద్ధంలో ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందనే వాదనను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచడం ద్వారా తన చర్యలకు దౌత్యపరమైన మద్దతు సంపాదించుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. మూడోది.. అమెరికాతో భవిష్యత్ చర్చలకు సంకేతం.. ఇక్కడే పెజెష్కియాన్ ప్రసంగంలోని మరో కోణం కనిపిస్తుంది. ఒకవైపు అమెరికాపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. మరోవైపు బలప్రయోగం లేకుండా చర్చలు, దౌత్యం, చర్చల ద్వారా పరిష్కారానికి ఇరాన్ సిద్ధంగా ఉందనే సంకేతం ఇచ్చారు. అంటే వేదికపై ధిక్కార స్వరం ఉన్నప్పటికీ.. దౌత్యానికి తలుపులు పూర్తిగా మూసివేయలేదు.
క్యాస్ట్రో నుంచి పెజెష్కియాన్ వరకు.. మారింది ఏమిటి?
ఈ నేతల ప్రసంగాలను ఒకే గీతలో పెట్టడం పూర్తిగా సరైనది కాదు. వారి కాలం, దేశాల పరిస్థితులు, అమెరికాతో సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు వేర్వేరు. కానీ ఒక సామాన్య అంశం మాత్రం కనిపిస్తుంది. అమెరికా గడ్డపైనే అమెరికా విధానాలను ప్రశ్నించడం... 1960లో క్యాస్ట్రో సుదీర్ఘ ప్రసంగంతో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేశారు. 1974లో అరాఫత్ పాలస్తీనా సమస్యను అమెరికా సహా ప్రపంచ దేశాల ముందు ఉంచారు. 2006లో చావెజ్ బుష్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. 2009లో గడాఫీ అమెరికా ఆధిపత్యంతో పాటు యూఎన్ వ్యవస్థను ప్రశ్నించారు. 2026లో పెజెష్కియాన్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ హెచ్చరికలకు న్యూయార్క్ నుంచే సమాధానం ఇచ్చారు.
మరి పెజెష్కియాన్‌కు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది?
ఇది వెంటనే యుద్ధాన్ని ఆపుతుందా? అమెరికా విధానాన్ని మార్చుతుందా? అనే ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం.అయితే ఒక విషయం మాత్రం స్పష్టం.పెజెష్కియాన్‌కు యూఎన్.జీఏ ఒక భారీ అంతర్జాతీయ వేదికను ఇచ్చింది. యుద్ధరంగంలో ఇరాన్‌కు ఉన్న సైనిక సామర్థ్యం ఒక అంశం అయితే.. ప్రపంచానికి తన కథనాన్ని వినిపించడం మరో అంశం. పెజెష్కియాన్ రెండో అంశాన్ని గట్టిగా ఉపయోగించుకున్నారు. అదే సమయంలో అమెరికా ప్రతినిధి ప్రసంగం నుంచి బయటకు వెళ్లడం.. ఈ ఘర్షణను మరింత ప్రతీకాత్మకంగా మార్చింది.
న్యూయార్క్‌లోని యూఎన్ భవనం అమెరికా భూభాగంలో ఉన్నప్పటికీ.. అది ప్రపంచ దేశాల వేదిక.. అందుకే అమెరికాకు ప్రత్యర్థులుగా ఉన్న నేతలు గతంలో కూడా అదే వేదికను ఉపయోగించి వాషింగ్టన్‌ను ప్రశ్నించారు. క్యాస్ట్రో సుదీర్ఘంగా మాట్లాడారు.. అరాఫత్ పాలస్తీనా వాదన వినిపించారు.. చావెజ్ బుష్‌ను ‘డెవిల్’ అంటూ సంచలనం సృష్టించారు.. గడాఫీ యూఎన్ వ్యవస్థనే ప్రశ్నించారు. ఇప్పుడు ఆ వరుసలోకి పెజెష్కియాన్ వచ్చారు. అయితే ఆయన ముందున్న సవాలు మాత్రం గత నేతల కంటే భిన్నం. ఎందుకంటే ఇది కేవలం మాటల యుద్ధం కాదు.. నిజమైన యుద్ధం మధ్యలో జరిగిన ప్రసంగం. అందుకే పెజెష్కియాన్ చెప్పిన మాటల కంటే.. వాటి తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు ఏ దిశగా వెళ్తాయి? హార్ముజ్ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? యుద్ధం ముగింపు కోసం ఏదైనా ఒప్పందానికి మార్గం ఏర్పడుతుందా? అనేదే అసలు ఆసక్తికరమైన అంశం.
అమెరికా గడ్డపై నిలబడి అమెరికానే ప్రశ్నించడం.. చరిత్రలో కొత్త విషయం కాదు. కానీ యుద్ధం మధ్యలో అదే చేయడం మాత్రం పెజెష్కియాన్ ప్రసంగానికి ప్రత్యేక ప్రాధాన్యం తెచ్చింది.