కేంద్రం ఎన్నిక‌ల సంఘంలో చిచ్చు.. అస‌లేంటీ వివాదం?

గత 10 నెలల్లో కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తా క‌థ‌నం పేర్కొంది.

Update: 2026-09-24 04:30 GMT

కేంద్ర ఎన్నికల సంఘం వ్య‌వ‌హారం మ‌రోసారి రాజ‌కీయ చ‌ర్చ‌కు, ర‌చ్చ‌కు కూడా దారితీసింది. ఇప్ప‌టి వ‌ర‌కు సర్ వివాదాలు, ఓట్ల చోరీ వంటి ఆరోప‌ణ‌లు తీవ్ర‌స్థాయిలో ఎదుర్కొన్న సంఘం.. ఇప్పుడు అంత‌ర్గ‌త విభేదాల‌తో కుమ్ములాట‌లు ప‌డుతోంద‌న్న వార్త‌లు సంచ‌ల‌నంగా మారాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్‌) ప్రక్రియకు సంబంధించి ప్ర‌ధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు విభేదిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

గత 10 నెలల్లో కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తా క‌థ‌నం పేర్కొంది. ఈ వివాదానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ప‌రిశీలిస్తే.. ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో స‌ర్ స‌హా ప‌లు అంశాలపై కమిషనర్ల మధ్య తీవ్రమైన చర్చ, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఓటర్ల డేటాబేస్ నిర్వహణపై అంత‌ర్గత విభేదాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అలానే.. కొత్త ఓటర్ల చేర్పు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఇద్దరు కమిషనర్లు ప్రశ్నించారని సమాచారం. అలానే.. తమకు తెలియకుండా, తమ ఆమోదం లేకుండానే కమిషన్ పేరిట కొన్ని కీలక ఆదేశాలు, నిర్ణయాలు జారీ అవుతుండ‌డాన్ని ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు కూడా ప్ర‌శ్నిస్తున్న‌ట్టు తెలిసింది.

ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేపింది. ముఖ్యంగా ఎన్నిక‌ల సంఘంపై ఓట్ల చోరీ ఆరోపణలు వ‌స్తున్న ద‌రిమిలా.. విపక్షాలు తాజా వార్త‌ల‌ ఆధారంగా ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నిక‌ల సంఘంలో ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు ముఖ్యంగా ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ చేస్తున్న‌ది దేశద్రోహమని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాదు, "సమయం వస్తుంది.. మిమ్మల్ని వదలం" అంటూ ఎన్నికల అధికారులను హెచ్చరించారు. విపక్షాలు దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.

అయితే.. ఈ వ్య‌వ‌హారాన్ని బీజేపీ సమర్థించ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల సంఘంలో కమిషనర్ల మధ్య చర్చలు, విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని బీజేపీ పేర్కొంది. విపక్షాలు అనవసరంగా 'ఓట్ల చోరీ' ఆరోపణలు చేస్తున్నాయని కొట్టిపారేసింది. ఇక‌, ఈ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందిస్తూ అంతర్గత విభేదాల వార్తలను పూర్తిగా తోసిపుచ్చింది. అలాంటివేవీ లేవ‌ని.. సంచ‌ల‌నం కోసం మీడియా పాకులాడుతోంద‌ని పేర్కొంది. కానీ, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో ఏదో జ‌రుగుతోంద‌న్న వార్త‌లు అయితే గ‌ట్టిగానే వ‌స్తున్నాయి.

Tags:    

Similar News