ఘోరం: స్లీపర్ బస్సులో మంటలు.. తొమ్మిది మంది ఆహుతి
స్లీపర్ బస్సులో మంటలు తొమ్మిది నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ఈ ఘోర ఘటన ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ వే లో చోటు చేసుకుంది.
స్లీపర్ బస్సులో మంటలు తొమ్మిది నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ఈ ఘోర ఘటన ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ వే లో చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని మహోబా వైపు వెళుతుండగా.. ఈ తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది సజీవ దహనం కాగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా జాతీయ మీడియా చెబుతోంది.
తెల్లవారుజాము ప్రాంతంలో బస్సులో మంటలు అంటుకోవటం.. వేగంగా వ్యాపించిన వైనం ప్రయాణికుల్ని బలి తీసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా మంటలు అంటుకోవటం.. తమను తాము రక్షించుకోవటం కోసం బస్సులో నుంచి దూకేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. మంటల తీవ్రతతో పాటు.. దట్టమైన పొగ అలుముకోవటంతో బయటకు రాలేక.. బస్సులోనే చిక్కుకుపోయారు.
బస్సు దగ్థమవుతున్న వీడియో క్లిప్ లు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. అగ్నిప్రమాదానికి కారణాలు బయటకు రావాల్సి ఉంది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారిని వెంటనే వైద్య సహాయం అందేలా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లోనూ ఇలాంటి ఉదంతమే చోటు చేసుకున్నప్పటికి.. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
నాగోల్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన పలువురు మూడు బస్సుల్లో శ్రీశైలం బయలుదేరారు. బుధవారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో గాయత్రి నగర్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద రెండు బస్సుల్లో డీజిల్ పోయిస్తున్న వేళలో.. హైవే మీద ఆపి ఉంచిన బస్సులోని కుడి భాగం నుంచి హటాత్తుగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర వెంటనే.. ప్రయాణికుల్ని అలెర్టు చేయటంతో అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. బస్సు వేగంగా వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉంటే.. నష్టం తీవ్రంగా ఉండేది. మంటల తీవ్రత సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఘటనా స్థలానికి చేరుకోని మంటల్ని ఆర్పేశారు. బస్సులో మంటలకు కారణం ఏమిటన్న దానిపై విచారణ చేస్తున్నారు.