ఓరుగల్లు ఎయిర్ పోర్టులో మనం మర్చిపోయిన యోధుడి విగ్రహం
అంటే.. యాదవ రాజు జైతుడు తన కుమార్తె సోమల దేవిని గణపతి రాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. దీంతో రెండు పెద్ద సామ్రాజ్యాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.
రోటీన్ కు భిన్నమైన నిర్ణయాలు అప్పుడప్పుడు కొన్ని ప్రభుత్వాలు తీసుకుంటాయి. చరిత్రలోని కొందరు ప్రముఖుల్ని కాలం మర్చిపోతుంటుంది. అదే సమయంలో జాతి జనులు పట్టించుకోకుండా ఉంటారు. అనూహ్య రీతిలో పాలకుల కంట్లో పడి.. అలాంటి వారు మళ్లీ వెలుగులోకి వస్తారు. అలాంటి నిర్ణయాన్నే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. త్వరలో తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టులో మనం మర్చిపోయిన ఒక యోధుడి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అతనే.. రేచర్ల రుద్రారెడ్డి.
కాకతీయ సామ్రాజ్యంలో రాజు కాని రాజుగా గుర్తింపు పొందటమే కాదు.. రాజు అయ్యేందుకు వచ్చిన అవకాశాల్ని వదులుకోవటమే కాదు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయ నిర్మాణానికి కారణం కూడా ఈ మహానుభావుడే. కాకతీయ రాజులు అనగానే పలువురి పేర్లు వినిపించినా.. ఆధునిక కాలంలో రాణి రుద్రమదేవికి దక్కిన పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు మరే కాకతీయ రాజుకు దక్కలేదని చెప్పాలి. అదే సమయంలో రేచర్ల రుద్రారెడ్డి లాంటి వారిని తలుచుకున్న పాపాన పోతున్నది లేదు. అలాంటి వేళ.. రేవంత్ ప్రభుత్వం అనూహ్య రీతిలో రాణి రుద్రమ దేవి నిలువెత్తు విగ్రహాంతో పాటు.. పదిహేను అడుగుల ఎత్తులో ఉండే రేచర్ల రుద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని విమానశ్రయ టెర్మినల్ ముంగిట ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇంతకూ ఆయన ఎవరు? ఆయన ఎందుకంత ఇస్పెషల్? అందరికి అర్థమయ్యేలా ఆయన్నుకాకతీయుల కట్టప్పగా అనుకోవచ్చా? ఇంతకు రాణి రుద్రమదేవి కాలానికి.. రేచర్ల రుద్రారెడ్డి కాలానికి మధ్య దూరమెంత? ఇలాంటి వివరాల్ని తెలుసుకుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నది సముచిత నిర్ణయం మాత్రమే కాదు.. చరిత్రలో నమోదైనా.. కాలం వదిలేసిన ఒక ప్రముఖు యోధుడ్ని గుర్తించి.. తగిన ప్రాధాన్యతను ఇప్పటికైనా కల్పిస్తున్నామన్న సంతోషం కలుగుతుంది.
ఎవరీ రేచర్ల రుద్రారెడ్డి అలియాస్ రేచర్ల రుద్రుడు? అతన్ని ఇట్టే గుర్తు పెట్టుకోవటానికి వీలుగా సిం‘ఫుల్’ గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆయన కాకతీయ రాజు కాదు. అయితే.. కాకతీయ సామ్రాజ్యంలో అత్యంత శక్తివంతమైన ప్రధాన సేనాధిపతి. ఇప్పటికాలం వారికి ఇట్టే అర్థం కావాలంటే ఆయన కాకతీయ సామ్రాజ్యంలో కమాండర్ ఇన్ చీఫ్ గా చెప్పొచ్చు. అంతేకాదు.. కాకతీయులకు అత్యంత నమ్మకస్థులైన రేచర్ల రెడ్డి వంశానికి చెందిన వయక్తి.
కాకతీయ సామ్రాజ్యం ఒక భారీ సంక్షోభంలో చిక్కుకునన వేళ.. దాని నుంచి బయటపడేసిన ధీరుడిగా చెప్పొచ్చు. క్రీ.శ. 1199 ప్రాంతంలో కాకతీయ రాజు మహాదేవుడు. ఆయన దేవగిరి రాజులు (యాదవులతో) జరిగిన యుద్ధంలో మరణిస్తారు. అదే సమయంలో ఆయన కొడుకు కం యువరాజు గణపతి దేవుడిని శత్రువులు బందీగా పట్టుకెళతారు. ఆ సమయంలో కాకతీయ సామ్రాజ్యం చుట్టూ ఉన్న శత్రువులు.. అంతర్గతంగా ఉన్న తిరుగుబాటుదారులు రాజ్యాన్ని ముక్కలు చేయటానికి ప్లాన్ చేస్తారు.
ఇలాంటి వేళలో అనూహ్య పరిణామాలకు కారణం రేచర్ల రుద్రుడు. యువరాజును శత్రువులు బందీగా తీసుకెళ్లిన వేళ.. రేచర్ల రుద్రుడు సొంతంగా సైన్యాన్ని నడిపించి తిరుగుబాటుదారులను దారుణంగా ఓడిస్తాడు. కాకతీయ సైన్యం ఎంత బలంగా ఉంటుందో అందరికి అర్థమయ్యేలా చేశాడు. అదే సమయంలో కాకతీయ ప్రముఖుల టీం ఒకటి ఏర్పాటు చేసి యువరాజు గణపతి దేవుడిని బందీగా తీసుకెళ్లిన యాదవులతో దౌత్యపరమైన చర్చలు జరిపిస్తాడు.
ఇక్కడ రేచర్ల రుద్రుడి తెలివిని మెచ్చుకోవాలి. గణపతిదేవుడిని విడిపించేందుకు యాదవులతో యుద్ధం కంటే దౌత్యమే మంచిదని భావించాడు. దీనికి తగ్గట్లే యాదవులు కూడా కాకతీయ రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తే.. దక్షిణం వైపు నుంచి తమకు రక్షణ కరువవుతుందని భావించారు. అందుకే కాకతీయులను శాశ్వితంగా శత్రువులుగా ఉంచుకునే కన్నా.. వారితో స్నేహ సంబంధాలు పెట్టుకోవటమే తమకు ప్రయోజనంగా భావించారు. ఈ భావనకు కీలకం అప్పటి యాదవ రాజు జైత్రపాల. అదే సమయంలో గణపతిదేవుడ్ని బందీగా విడుదల చేస్తే.. గౌరవ మర్యాదలకు భంగం కలిగినా.. తర్వాతి రోజుల్లో మరింత ఇబ్బందన్న విషయాన్ని గుర్తించి.. కయ్యాన్ని వియ్యంతో ముగించాడు.
అంటే.. యాదవ రాజు జైతుడు తన కుమార్తె సోమల దేవిని గణపతి రాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. దీంతో రెండు పెద్ద సామ్రాజ్యాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. భార్యతో పాటు గణపతిదేవుడు ఓరుగల్లుకు రాగా.. రేచర్ల రుద్రుడు ఎంతో నిస్వార్థంతో ఆయనకు పట్టాభిషేకం జరిపించాడు. అందుకే ఆయన్ను సకల దేశ ప్రతిష్ఠాపనాచార్య పేరుతో కొనియాడారు.దాదాపు పన్నెండు..పదమూడేళ్లు రాజు సేవలో ఉండగా.. గణపతి దేవుడు దాదాపు 60 ఏళ్లకు పైనే ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని పాలించారు.
ఇక.. రాణిరుద్రమ దేవి మరెవరో కాదు.. గణపతిదేవుడి గారాలపట్టి (కుమార్తె). గణపతి దేవుడికి మగ సంతానం లేదు. ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రుద్రమదేవి అయితే చిన్న కుమార్తె గణపాంబ. రుద్రమదేవికి కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే గణపతిదేవుడు ఆమెను తనతో పాటు సహ పాలకురాలిగా ప్రకటించటం తెలిసిందే. ఇది జరిగిన ఆరేళ్లకు తాను పదవీ విరమణ చేసి.. రాజ్యాధికారాన్ని అధికారికంగా రుద్రమదేవికి క్రీ.శ.1262లో అప్పగించటం తెలిసిందే.
రేచర్ల రుద్రారెడ్డి గురించి చదువుతున్నప్పుడు అసంకల్పితంగా రాజమౌళి బాహుబలి మూవీలోని కట్టప్ప పాత్ర గుర్తుకు వస్తుంది. అయితే.. కట్టప్ప మాదిరి రేచర్ల రుద్రారెడ్డి బానిస కాదు. గొప్ప పాలకుడు. వ్యూహకర్త.. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల మహాసేనాధిపతి. శత్రువులను భయపెట్టిన వీరుడు. కాకతీయ రాజులకు చూపించే విధేయతలో మాత్రం కట్టప్పతో పోల్చటం తప్ప కాదు. కాకతీయుల చరిత్రలో రేచర్ల రుద్రుడు నిజమైన కట్టప్ప. ఆ మాటకు వస్తే అంతకు ఎన్నో వందల రెట్లు ఎక్కువ గౌరవం.. అధికారం ఉన్న యోధుడన్న విషయాన్ని మర్చిపోకూడదు. తర్వాతి కాలంతో తన అభిరుచికి తగ్గట్లు నేటికి అపురూప శిల్ప సంపదతో అలరాడే రామప్ప దేవాలయాన్ని నిర్మించింది కూడా రేచర్ల రుద్రారెడ్డి. అలాంటి యోధుడ్ని కాలం మర్చిపోతే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి.. ఆ యోధుడికి తగిన గౌరవ మర్యాదల్ని (ఓరుగల్లు ఎయిర్ పోర్టు టెర్మినల్ వద్ద ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు) తర్వాతి తరాలు సైతం మర్చిపోలేని విధంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పాలి.