లడ్డూ ఇష్యూ...కూటమి పెద్దలు జనంలోకి ?

ఇదిలా ఉంటే హైందవం పట్ల జగన్ కు విశ్వాసం లేదని బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో శ్రీ వెంకటేశ్వర స్వామితో ఎవరూ ఆటలాడుకోలేదని, బ్రిటీషర్లు కూడా సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించారని బాబు గుర్తు చేశారు.;

Update: 2026-02-05 19:52 GMT

తిరుమల తిరుపతి శ్రీనివాసుని లడ్డూ ప్రసాదం ఇపుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ లడ్డూ విషయంలో సీబీఐ ఇచ్చిన నివేదికలో జంతు కొవ్వు పంది కొవ్వు కలవలేదని ఉందని వైసీపీ వాదిస్తోంది. అయితే కెమికల్స్ ప్రమాదకరమైన రసాయనాలు కలిశాయని, అంతే కాదు నెయ్యి లేకుండానే కేవలం ఫ్లేవర్ తో లడ్డూలను తయారు చేసి పూర్తి కల్తీగా మార్చేశారు అని కూటమి మండిపడింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మంత్రులు అంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే భవిష్యత్తు కార్యక్రమం చాలానే ఉండబోతోంది అని అంటున్నారు.

వైసీపీది మహాపాపం :

శ్రీవారి పవిత్రత దెబ్బతీసేందుకే వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ కుట్ర జరిగిందని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు కల్తీ నెయ్యి సరఫరాపై 2022 లో వచ్చిన నివేదికను తొక్కిపెట్టారని ఆయన మండిపడ్డారు. వీరికి భగవంతుడు అంటే లెక్క లేదని, హిందూ మతం పట్ల విశ్వాసం లేదని కూడా నిందించారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని అసలు వదిలి పెట్టమని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి హిందువుల సెంటిమెంట్‌ను పరిరక్షిస్తుంది అని బాబు చెప్పారు. తామంతా కలిసి కూటమి తరపున ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెప్పరు.

కాపాడేలా చర్యలు :

తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలను తీసుకుంటున్నామని బాబు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రక్షాళన చేయటంలో భాగంగా తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకున్నామని ఆయన అంటున్నారు. నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిళ్లు తీయించామని, వాటిని ఎన్డీడీబీకి పంపామని అన్నారు. ఇక సిట్ నివేదిక చూస్తే అన్ని రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారు చేసినట్టు వెలుగు చూసిందని ఆయన గుర్తు చేశారు. భగవంతుడు అంటే లెక్కలేని తనంగా వ్యవహరించారని బాబు ఫైర్ అయ్యారు.

విశ్వాసం లేదు :

ఇదిలా ఉంటే హైందవం పట్ల జగన్ కు విశ్వాసం లేదని బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో శ్రీ వెంకటేశ్వర స్వామితో ఎవరూ ఆటలాడుకోలేదని, బ్రిటీషర్లు కూడా సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించారని బాబు గుర్తు చేశారు. వాళ్ల కంటే హీనంగా గత పాలకులు వ్యవహరించారని అన్నారు. నాడు లడ్డూ కల్తీకి పాల్పడిందే కాక ఇప్పుడు మళ్లీ ఎదురుదాడి చేస్తున్నారు అన్నారు. జరిగిన ఘటనను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని బాబు అన్నారు.

పాయింటే మరి :

ఇదిలా ఉంటే జగన్ మోహన్ రెడ్డికి వేంకటేశ్వరస్వామిపై భక్తి ఉంటే డిక్లరేషన్ పై ఎందుకు సంతకం పెట్టలేదని బాబు సూటిగా ప్రశ్నించారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ పై సంతకం చేశారు కదా అని గుర్తు చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్తులు డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందేనని బాబు చెప్పుకొచ్చారు. అక్రమాలకు పాల్పడిన దోషులు ఎవరైనా ప్రజల మనోభావాలతో ఆడుకున్న వారిని ఉపేక్షించే సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల ముందుంచుతాం :

తిరుమల లడ్డూ గురించిన అన్ని నివేదికలనూ ప్రజల ముందే ఉంచుతామని బాబు వెల్లడించారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడుకోవటం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ తరహా విషయాలను ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వదిలిపెట్టబోమని ఆయన తేల్చి చెబుతున్నారు. దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడతాం, అదే మాధవ సేవ. ఈ అంశంపై పీఠాధిపతులలోనూ చర్చించి ముందుకు వెళ్తామని బాబు చెప్పడం విశేషం.

జనంలోకి :

బాబు చెబుతున్న మాటలను బట్టి చూస్తే ఆస్తిక జనులు అందరినీ కలుపుకుని ప్రజల వద్దకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మరి సభలు సమావేశాలు నిర్వహిస్తారా లేక బృందాలుగా జనంలోకి కూటమి నేతలు వెళ్ళి ప్రజలకు వాస్తవాలు తెలియచేస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా కూటమి అయితే వైసీపీని గట్టిగా బిగించాలని చూస్తోంది. లడ్డూ ఇష్యూ ఇపుడు ఏపీలో హీటెక్కించే టాపిక్ గా మారబోతోంది.

Tags:    

Similar News